Fake News, Telugu
 

రక్షణ రంగానికి కేటాయించే బడ్జెట్ శాతంలో యూపీఏ, ఎన్‌డీఏ మధ్య పెద్ద తేడా లేదు

0

మోదీ ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయింపులు ఎక్కువగా చేస్తుందని అర్ధం వచ్చేలా, గత ఆరు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం రక్షణ బడ్జెట్ కింద 24.85 లక్షల కోట్లు కేటాయించిందని చెప్తూ, ప్రస్థుత మోదీ ప్రభుత్వాన్ని పొగుడుతున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. అలాగే మోదీ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలలో చేసిన 80 లక్షల కోట్ల అప్పులో 25% దేశ భద్రత మీదే ఖర్చు చేసిందని కూడా పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: మోదీ ప్రభుత్వం రక్షణ రంగానికి కేటాయింపులు ఎక్కువగా చేస్తుంది.

ఫాక్ట్(నిజం): ప్రభుత్వాలు నికరంగా ఒక రంగంపై ఎంత ఖర్చు చేశాయన్న దానికన్నా, మొత్తం ఖర్చులో ఆ రంగానికి ఎంత కేటాయించాయో అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ఆ ప్రభుత్వం ఆ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో స్పష్టంగా అర్ధమవుతుంది. ఇలా చూసుకుంటే ప్రస్థుత బీజేపీ ప్రభుత్వం, గత కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య బడ్జెట్‌లో రక్షణ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతలో పెద్ద తేడా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో (2004-14)  సగటున 13.8% రక్షణ రంగానికి కేటాయించగా, బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వం ఏడు సంవత్సరాలలో (2014-21) సగటున కేవలం 12.75% కేటాయించింది. అదేవిధంగా బీజేపీతో పోలిస్తే గత కాంగ్రెస్ ప్రభుత్వం రక్షణ రంగంలో క్యాపిటల్ ఎక్స్‌పెన్‌డీచర్‌పై (పెట్టుబడి వ్యయం) ఎక్కువ ఖర్చు చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

రక్షణ కోసం అత్యధికంగా ఖర్చు చేసే దేశాల్లో భారత్ కూడా ఒకటి. స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) ప్రకారం 2020లో రక్షణ కోసం అత్యధికంగా ఖర్చు చేసే దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.

అలాగే భారత ప్రభుత్వం ప్రతీ సంవత్సరం బడ్జెట్‌లో ఎక్కువ శాతం కేటాయింపులు చేసే రంగాల్లో రక్షణ రంగం ఒకటి. బడ్జెట్‌లో రక్షణ రంగానికి చేసే కేటాయింపులు (నికర విలువ) ప్రతీ సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి. ఒక అధ్యయనం ప్రకారం రక్షణ రంగానికి ప్రభుత్వం చేసే కేటాయింపులు ప్రతీ సంవత్సరం సగటున 9% పెరుగుతూనే ఉంది.

రక్షణ రంగంలో ఏ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసింది?

ఐతే కేవలం ప్రభుత్వాలు చేసిన కేటాయింపుల నికర విలువ ఆధారంగా ఆ రంగంలో ప్రభుత్వాల పనితీరును అంచనా వేయలేము. ఎందుకంటే ప్రతీ సంవత్సరం సహజంగానే దేశ జీడీపీ పెరుగుతుంది కాబట్టి వివిధ రంగాలకు ప్రభుత్వాలు చేసే కేటాయింపుల, ఖర్చుల నికర విలువ పెరుగుతుంది. ఉదాహారణకి పైన టేబుల్‌లో చూపిస్తున్నట్టు ప్రతీ సంవత్సరం ఎలాగైతే దేశ జీడీపీ పెరుగుతుందో అదేవిధంగా రక్షణ రంగంలో కేటాయింపులు కూడా పెరిగాయి.

ఒక రంగానికి ఏ ప్రభుత్వం ఎక్కువ  ప్రాముఖ్యత ఇచ్చిందో తెలుసుకోవాలంటే, ఆయా ప్రభుత్వాలు చేసిన మొత్తం వ్యయంలో ఆ ప్రత్యేక రంగానికి ఎంత శాతం కేటాయించిందన్న అంశాన్ని పరిశీలిస్తే అవగాహన వస్తుంది. ఉదాహరణకి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేసిన మొత్తం ఖర్చులలో రక్షణ రంగానికి చేసిన కేటాయింపుల శాతాన్ని మోదీ ప్రభుత్వం చేసిన శాతంతో పోలిస్తే, ఏ ప్రభుత్వం రక్షణ రంగానికి ప్రాముఖ్యత ఇచ్చిందో తెలుస్తుంది.

ప్రస్థుత బీజేపీ ప్రభుత్వం, గత కాంగ్రెస్ ప్రభుత్వం మధ్య బడ్జెట్‌లో రక్షణ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతలో పెద్ద తేడా లేదు

2004-21 వరకు ప్రభుత్వాలు చేసిన మొత్తం ఖర్చులలో రక్షణ రంగంలో వాటా పరిశీలిస్తే బీజేపీ ప్రభుత్వం ఏడు సంవత్సరాలలో (2014-21) చేసిన మొత్తం వ్యయంలో రక్షణ రంగానికి కేటాయించిన సగటు కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో (2004-14) కేటాయించిన సగటు వాటానే కొంచెం ఎక్కువగా ఉంది.

కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలలో సగటున 13.8% రక్షణ రంగానికి కేటాయించగా, బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వం ఏడు సంవత్సరాలలో సగటున 12.75% కేటాయించింది.

ఈ పది సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం 2005-06లో అత్యధికంగా 16.14% రక్షణ రంగానికి కేటాయించగా, 2010-11లో అత్యల్పంగా 12.87% రక్షణ రంగానికి కేటాయించింది. ఐతే బీజేపీ అధికారంలో ఉన్న ఈ ఏడు సంవత్సరాలలో కేవలం మూడు సంవత్సరాలు మినహాయిస్తే మిగిలిన నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ అత్యల్పంగా కేటాయించిన దానికంటే తక్కువగా కేటాయించింది.

రెవిన్యూ vs పెట్టుబడి వ్యయం?

ప్రతీ సంవత్సరం రక్షణ రంగానికి చేసే కేటాయింపులు పెరుగుతూ వస్తున్నప్పటికీ, ఈ కేటాయింపులలో ఎక్కువ భాగం పెట్టుబడి వ్యయం కోసం కాకుండా రక్షణ రంగానికి సంబంధించిన రెవిన్యూ అవసరాలకు (జీతాలు, పెన్షన్లు మొదలైనవి) వినియోగిస్తున్నారు.

సైనికులకు అందించాల్సిన నెల జీతాలు, పెన్షన్లు మొదలైన పద్దులను రెవిన్యూ వ్యయం కింద పరిగణిస్తారు. సైన్యం కోసం కొత్త ఆయుధాలు కొనడం లేదా మౌలిక సదుపాయాలు సృష్టించడం/ఆధునీకరించడం వంటివి పెట్టుబడి వ్యయం కిందకు వస్తాయి. ఐతే, పైన చెప్పినట్టు ఎక్కువ శాతం కేటాయింపులు రెవిన్యూ అవసరాలకు ఖర్చు అవుతున్నాయి.

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ ఎనాలిసిస్ అనే సంస్థ 2010-11 నుండి 2019-20 రక్షణ మంత్రిత్వ శాఖ చేసిన మొత్తం ఖర్చులను అధ్యయనం చేస్తూ ప్రచురించిన రిపోర్ట్ ప్రకారం 2014-20 మధ్య కాలంలో బీజేపీ ప్రభుత్వంపెట్టుబడి వ్యయం(సైన్యానికి కొత్త ఆయుదాలు సమకూర్చడం, మౌలిక సదుపాయాలు సృష్టించడం/ఆధునీకరించడం, మొదలైనవి) కోసం కేటాయించిన సగటు కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలో ఉన్న కాలంలో (2010-14) క్యాపిటల్ ఎక్స్‌పెన్‌డీచర్‌ కోసం కేటాయించిన సగటు వాటానే ఎక్కువ.

మోదీ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాల్లో చేసిన 80 లక్షల కోట్ల అప్పులో 25% దేశ భద్రత మీదే ఖర్చు చేసింది?

ప్రజలు, సంస్థలు కట్టే టాక్స్ మొదలైన సొంత ఆదాయ వనరుల నుండి ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ కింద పరిగణిస్తారు. సాధారణంగా ప్రభుత్వం జీతాలు, పెన్షన్లు మొదలైనవి ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి మాత్రమే కేటాయించాలి. అంతేగాని ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతం/ పెన్షన్ల కోసం ప్రభుత్వం ఎప్పుడు కూడా అప్పులు చేయదు.

ఈ నేపథ్యంలో పైన చెప్పినట్టు రక్షణ రంగంలో జరిగే కేటాయింపులలో ఎక్కువ శాతం జీతాలు/పెన్షన్లకు ఖర్చవుతుండడంతో, ఈ మొత్తాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి ఖర్చు చేస్తారు, అప్పుల ద్వారా సమీకరించిన నిధుల నుండి కాదు.

ఇదిలా ఉంటే సాధారణంగా తమకు వచ్చే ఆదాయం కన్నా తాము చేయాల్సిన ఖర్చు ఎక్కువ ఉన్న సందర్భంలో ప్రభుత్వాలు ఆ లోటును (ద్రవ్య లోటు) అప్పుల ద్వారా సమీకరించుకుంటాయి. ఇలా సమీకరించిన దాంట్లో చాలా వరకు పెట్టుబడి వ్యయం కోసం ఖర్చు చేస్తుంటాయి. ఐతే బడ్జెట్‌లో ద్రవ్య లోటును పుర్చేందుకు కావాల్సిన ధనాన్ని ఎలా సేకరిస్తాయో (అప్పులు ఎలా తీసుకుంటాయో) చేప్తాయే గాని తీసుకున్న అప్పులను ఏ రంగంలో ఎంత ఖర్చు చేస్తాయో చెప్పావు. కాబట్టి పోస్టులో క్లెయిమ్ చేస్తున్నట్టు మోదీ ప్రభుత్వం తీసుకున్న అప్పుల్లో 25% కేవలం రక్షణ రంగంలో ఖర్చు చేసాయని చెప్పలేము.

చివరగా, రక్షణ రంగానికి కేటాయించే బడ్జెట్ శాతంలో యూపీఏ, ఎన్‌డీఏ మధ్య పెద్ద తేడా లేదు.

Share.

About Author

Comments are closed.

scroll