‘అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వాళ్ళ 5 సంవత్సరాల పదవి కాలంలో చేసిన అప్పులు, ఆ 5 సంవత్సరాల పదవి కాలంలోనే తీర్చాలి. లేకుంటే, చట్టపరంగా శిక్షలు వేసే విధంగా చట్టం చేయనున్న కేంద్ర ప్రభుత్వం. ఆ చట్టం పై ప్రజాభిప్రాయ సేకరణ వచ్చే మార్చి లో మొదలవబోతుంది’ అని ఉన్న ఒక పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: 5 సంవత్సరాల పదవి కాలంలో చేసిన అప్పులు, ఆ 5 సంవత్సరాల పదవి కాలంలోనే రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీర్చేటట్టు చట్టం రాబోతుంది. వచ్చే మార్చి లో ప్రజాభిప్రాయ సేకరణ.
ఫాక్ట్ (నిజం): పోస్టులో చెప్పిన చట్టాన్ని ప్రభుత్వం తెస్తున్నట్టుగా ఎక్కడా కూడా సమాచారం లేదు. అదే మెసేజ్ అక్టోబర్-2018 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టు లో చెప్పిన చట్టం గురించి గూగుల్ లో వెతకగా, అలాంటి చట్టాన్ని ప్రభుత్వం తెస్తున్నట్టుగా ఎక్కడా కూడా సమాచారం లేదు. అంతేకాదు, ఇలాంటి పోస్ట్ (ఆర్కైవ్డ్) అక్టోబర్-2018 నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే, ఆ పోస్టు ప్రకారం మార్చి-2019 లోనే ప్రజాభిప్రాయ సేకరణ జరిగి ఉండాలి, కానీ అటువంటి సర్వే ఏదీ కూడా ప్రభుత్వం నిర్వహించలేదు.
ప్రజలకు వివిధ పథకాలు మరియు సేవలు అందించడానికి, మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ ఉండడంతో, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే అప్పులు జీడీపీ లో మూడు శాతం చేరుకునేల ప్రయత్నిచాలని FRBM ( Fiscal Responsibility and Management Act, 2003) చట్టాన్ని ప్రభుత్వం చేసింది. ప్రభుత్వాలు చేసే అప్పులు మరియు FRBM చట్టం గురించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు. మౌళిక సదుపాయాల నిర్మాణము కోసం ప్రభుత్వాలు చాలా అప్పులు తీసుకుంటాయి. ఆ అప్పులు తీర్చడానికి చాలా సమయం పడుతుంది. అంతేకాదు, తీసుకున్న అప్పులకు వడ్డీ కట్టడానికే ప్రతి సంవత్సరం బడ్జెట్ లో చాలా డబ్బులను ప్రభుత్వం కేటాయిస్తుంది.
చివరగా, 5 సంవత్సరాల పదవి కాలంలోనే తీసుకున్న అప్పులు తీర్చాలని ప్రభుత్వం చట్టాన్ని తెస్తున్నట్టుగా ఎక్కడా కూడా సమాచారం లేదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?