Fake News, Telugu
 

మధ్యప్రదేశ్‌లో ఇటీవల 3.35 లక్షల టన్నుల బంగారం దొరికిందని వస్తున్న పుకార్లలో వాస్తవం లేదు

0

మధ్యప్రదేశ్‌లో 3.35 లక్షల టన్నుల బంగారు ఖనిజ భాండారం కనుగొనబడింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచ స్థాయిలో మన స్థానానికి ఓ కీలక మలుపు కావచ్చు!’ అని చెప్తూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒక పోస్ట్ షేర్ చేయబడుతోంది. ఇలా క్లెయిమ్ చేస్తూ, బంగారు గనిలో కొందరు కార్మికులు, అధికారులు నుంచొని, దొరికిన బంగారాన్ని పరిశీలిస్తున్నట్లుగా ఉన్న ఓక ఫోటోని కూడా షేర్ చేస్తున్నారు. అలాగే, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న సిరోహాలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు చేపట్టిన ఒక సర్వేలో, 100 హెక్టార్ల భూమిలో బంగారు నిల్వలు దొరికినట్లు భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారని మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).  అసలు, ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మధ్యప్రదేశ్‌లో ఇటీవల 3.35 లక్షల టన్నుల బంగారు ఖనిజ బాండరం దొరికింది.  

ఫ్యాక్ట్(నిజం): మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో తీసుకున్న ఒక నమూనాలో, అక్కడ బంగారం ఉండవచ్చు అనే సంకేతం దొరికిందని, ప్రస్తుతం దానిపై పరిశోధన జరుగుతుందని, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(GSI) డైరెక్టర్ జనరల్ అసిత్ సాహా మీడియాతో చెప్పారు. అక్కడ పెద్ద బంగారు గని ఉందా లేదా అనే విషయం ఇప్పుడు చెప్పలేమని, ప్రస్తుతం దానిపై పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతుకగా, ఈ విషయం గురించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క డైరెక్టర్ జనరల్ అసిత్ సాహా, 7 ఆగస్ట్ 2025న మీడియాతో మాట్లాడారని మాకు తెలిసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).

ఈ వార్తా కథనాల ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ఉన్న సిరోహా దగ్గర భారీ మోతాదులో బంగారు నిల్వలు కనుగొనబడ్డాయని వస్తున్న సమాచారంలో ఎంత నిజం ఉంది అని మీడియా ప్రతినిధులు అసిత్ సాహాని అడిగారు. దానికి జవాబుగా, అక్కడ తీసుకున్న ఒక నమూనాపై చేసిన ప్రాథమిక పరిశోధనలో, అక్కడ బంగారం ఉండవచ్చు అని తెలిసిందని ఆయన చెప్పారు. ఆయన మీడియాకు ఈ విషయాలు చెప్తున్న వీడియో, మనం ‘etvbharat’ వారు ప్రచురించిన ఒక వార్తా కథనంలో చూడవచ్చు.

అయితే, అక్కడ బంగారు గని ఉందా లేదా అనే విషయం ఆయన ఇప్పుడు చెప్పలేరని, పరిశోధనలు అయిన తర్వాతే ఆ విషయం తెలుస్తుందని మీడియాకు తెలిపారు. 100 హెక్టార్ల భూమిలో బంగారు గని ఉండవచ్చని, పరిశోధనలో తేలిందనే పుకారు గురించి ఆయన మాట్లాడుతూ, అది ఇప్పుడు వారు చెప్పలేరని, చాలా సమయం పరిశోధనల తర్వాతే తెలుస్తుందని చెప్పారు. దీనిబట్టి, వైరల్ కథనంలో వాస్తవం లేదని, అది కేవలం ఒక పుకారు మాత్రమే అని మనకు అర్థం అవుతుంది.

7 ఆగస్ట్ 2025న జబల్‌పూర్‌లో జరిగిన ఒక జాతీయ సమావేశ సమయంలో, అసిత్ సాహా మీడియాకు ఈ విషయాలు తెలిపారు

అదనంగా, వైరల్ పోస్టులో షేర్ చేస్తున్న ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసినదని AI డిటెక్షన్ టూల్స్ తెలిపాయి.

చివరగా, మధ్యప్రదేశ్‌లో ఇటీవల 3.35 లక్షల టన్నుల బంగారం దొరికిందని వస్తున్న పుకార్లలో వాస్తవం లేదు. ప్రస్తుతం అక్కడ తీసుకున్న ఒక నమూనాపై చేసిన ప్రాథమిక పరిశోధనలో బంగారం ఉండవచ్చు అని తెలిసిందని, ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.

Share.

About Author

Comments are closed.

scroll