“మ్యాగీని కుళ్లిన మైదా మరియు పంది మాంసపు రసంతో తయారు చేస్తారు, మ్యాగీ తినడం వల్ల మూత్రపిండాలు మరియు కాలేయం పై తీవ్ర ప్రభావం పడుతుంది, ఎక్కువగా మ్యాగీ తింటే రక్తహీనత, కీళ్లనొప్పులు ఏర్పడవచ్చు, మ్యాగీ తినడం వల్ల మన జ్ఞాపకశక్తి మీద ప్రభావం పడుతుంది మరియు జ్ఞాపకశక్తి తగ్గుతుంది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: నెస్లే మ్యాగీ నూడుల్స్‌ను పంది మాంసం రసంతో తయారు చేస్తారు, మ్యాగీ నూడుల్స్ తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఫాక్ట్(నిజం): నెస్లే ఇండియా మ్యాగీ నూడుల్స్‌ను పంది మాంసంతో తయారు చేయదు. నెస్లే భారతదేశంలో అమ్మే మ్యాగీలో పంది మాంసంతో చేసిన ఎటువంటి పదార్థాలు లేవు. నెస్లే భారతదేశంలో వెజిటబుల్ మ్యాగీ నూడుల్స్‌తో పాటు చికెన్ నూడుల్స్‌ను విక్రయిస్తుంది. మ్యాగీలో ఉపయోగించే E635 అనే పదార్థం పంది కొవ్వుతో తయారు చేస్తారని పలు పోస్టులు గతంలో వైరల్ అయ్యాయి. అయితే, మ్యాగీలో ఉపయోగించే E635 అనే రుచిని పెంచే పదార్థం (Flavour enhancer) ఈస్ట్, బీట్‌రూట్‌తో తయారు చేయబడిందని, ఇది శాఖాహారులకు అనుకూలంగా ఉంటుందని మ్యాగీ పేర్కొంది. మ్యాగీలో ఉపయోగించే పదార్థాలన్నీ తినేందుకు సురక్షితమైనవిగా FSSAI ఆమోదించింది. అయితే, మ్యాగీ నూడుల్స్‌లో ఉపయోగించే కొన్ని పదార్థాలు అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయని పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. ఇకపోతే మ్యాగీని శుద్ధి చేసిన పిండి (మైదా)తో తయారు చేయడం వల్ల దీనిని తక్కువగా తినడం మంచింది. అలాగే, మ్యాగీలో పామాయిల్, వివిధ ఫ్లేవర్లు & కలరింగ్ ఏజెంట్లు ఉంటాయి మరియు సోడియం అధికంగా ఉంటుంది, కాబట్టి మ్యాగీని తరచుగా తినకపోవడమే మంచిది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
మ్యాగీ వెజిటబుల్ నూడుల్స్ ప్యాకెట్ పై ఉన్న అందులో వాడిన పదార్థాల వివరాల ప్రకారం, మ్యాగీ నూడుల్స్‌ను తయారు చేయడానికి శుద్ధి చేసిన గోధుమ పిండి (మైదా), పామాయిల్, అయోడైజ్డ్ ఉప్పు, గోధుమ గ్లూటెన్, E508 (పొటాషియం క్లోరైడ్), E412 (గ్వార్ గమ్), యాసిడ్ రెగ్యులేటర్స్ (E501(i) మరియు E500(i)), హ్యూమెక్టెంట్ (E451(i)) (పెంటాసోడియం ట్రైఫాస్ఫేట్) ఉపయోగిస్తారు.
అలాగే మ్యాగీ మసాలాలో ఉల్లిపాయ పొడి, ధనియాల పొడి, ఎర్ర కారం, పసుపు పొడి, వెల్లుల్లి పొడి, జీలకర్ర పొడి, సోంపు పొడి, అల్లం పొడి, మెంతి పొడి, నల్ల మిరియాల పొడి, కాల్చిన ఉల్లిపాయ పొడి, లవంగం పొడి, పచ్చి ఏలకుల పొడి, జాజికాయ పొడి వంటి పలు మసాలాలు ఉపయోగిస్తారు. అలాగే, ఇందులో హైడ్రోలైజ్డ్ వేరుశెనగ ప్రోటీన్, శుద్ధి చేసిన గోధుమ పిండి (మైదా), చక్కెర, స్టార్చ్, పామాయిల్, అయోడైజ్డ్ ఉప్పు, E508 (పొటాషియం క్లోరైడ్), యాసిడ్ రెగ్యులేటర్లు (E330), E635 (డిసోడియం 5-రైబోన్యూక్లియోటైడ్లు), ఫుడ్ కలర్ (E150d), గోధుమ గ్లూటెన్ కూడా ఉన్నాయి. ఈ వివరాల ప్రకారం, నెస్లే ఇండియాలో అమ్మే మ్యాగీలో పంది మాంసంతో చేసిన ఎటువంటి పదార్థాలు లేవు.

నెస్లే భారతదేశంలో వెజిటబుల్ మ్యాగీ నూడుల్స్‌తో పాటు చికెన్ నూడుల్స్‌ను కూడా విక్రయిస్తుంది. ఇందులో కూడా ఎక్కడ పంది మాంసంతో చేసిన పదార్థాలు ఉన్నట్లు పేర్కొనలేదు.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనల ప్రకారం, ఒకవేళ మ్యాగీ నూడుల్స్‌లో పంది మాంసంతో తయారు చేసిన పదార్థాలను ఉపయోగిస్తే, నెస్లే సంస్థ మ్యాగీ నూడుల్స్ ప్యాకేజింగ్‌పై ఆ విషయాన్ని తప్పనిసరిగా పేర్కొనాలి.
మ్యాగీలో ఉపయోగించే E635 అనే పదార్థం పంది కొవ్వుతో తయారు చేస్తారని పలు పోస్టులు గతంలో వైరల్ అయ్యాయి. అయితే, మ్యాగీలో ఉపయోగించే E635 అనే రుచిని పెంచే పదార్థం (Flavour enhancer) ఈస్ట్, బీట్‌రూట్‌తో తయారు చేయబడిందని, ఇది శాఖాహారులకు అనుకూలంగా ఉంటుందని మ్యాగీ పేర్కొంది. అలాగే మ్యాగీ నూడుల్స్‌లో పంది మాంసం లేదని స్పష్టం చేసింది.

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నిబంధనల ప్రకారం, ఆహార పదార్థల ప్యాకెట్లపై అది మాంసాహారం లేదా శాఖాహారం అని స్పష్టంగా పేర్కొనాలి. FSSAI ప్రకారం, మాంసాహార పదార్థలు కలిగి ఉన్న ప్యాకెట్లపై గోధుమ రంగు నిండిన త్రిభుజం ఉంటుంది. అలాగే, శాఖాహార పదార్థాలను కలిగి ఉన్న ప్యాకెట్లలో ఆకుపచ్చ రంగు నిండిన వృత్తం ఉంటుంది.

మ్యాగీలో ఉపయోగించే పదార్థాలన్నీ తినేందుకు సురక్షితమైనవిగా FSSAI ఆమోదించింది. అయితే, మ్యాగీ నూడుల్స్‌లో ఉపయోగించే కొన్ని పదార్థాలు అధికంగా తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయని పలు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. మ్యాగీని శుద్ధి చేసిన పిండి (మైదా)తో తయారు చేయడం వల్ల దీనిని తక్కువగా తినడం మంచిది. అలాగే, మ్యాగీలో పామాయిల్, వివిధ ఫ్లేవర్లు & కలరింగ్ ఏజెంట్లు ఉంటాయి, సోడియం అధికంగా ఉంటుంది, కాబట్టి మ్యాగీని తరచుగా తినకపోవడమే మంచిది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
జూన్ 2015లో, FSSAI కొన్ని మ్యాగీ నూడుల్స్ నమూనాలలో అనుమతించదగిన పరిమితులను మించి సీసం (Lead) స్థాయిలు ఉన్నాయని, అలాగే మోనోసోడియం గ్లుటామేట్ (MSG) ఉన్నట్లు గుర్తించింది. దీనితో, నెస్లే ఇండియా మార్కెట్ నుండి తమ అన్ని మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తులను ఉపసంహరించుకుంది. అయితే, నవంబర్ 2015లో, నెస్లే ఇండియా భారతదేశంలో తమ ప్రసిద్ధ ఇన్‌స్టంట్ మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను తిరిగి ప్రారంభించింది. అలాగే 2019లో, భారత మార్కెట్లోకి తిరిగి ప్రవేశించినప్పటి నుండి మ్యాగీ నూడుల్స్‌పై నిర్వహించిన అన్ని పరీక్షలు సురక్షితమైనవని తేలిందని FSSAI పేర్కొంది.
చివరగా, నెస్లే మ్యాగీ నూడుల్స్‌ను పంది మాంసం రసంతో తయారు చేస్తారనే వాదనలో నిజం లేదు.