“భారతీయ రైల్వేలకు చెందిన ఒక గూడ్స్ రైలు గమ్యాన్ని చేరుకోవడానికి 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది” అని చెప్తూ ఉన్న పోస్ట్ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). పలు ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని పేర్కొంటూ కథనాలు ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). “విశాఖపట్నం నుండి బయలుదేరిన గూడ్స్ రైలు గమ్యాన్ని తన గమ్యస్థానమైన ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి చేరుకోవడానికి 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది” అని ఈ కథనాలు పేర్కొన్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: భారతీయ రైల్వేలకు చెందిన ఒక గూడ్స్ రైలు గమ్యస్థానానికి చేరుకోవడానికి 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది.
ఫాక్ట్(నిజం): భారతీయ రైల్వేకు చెందిన ఒక గూడ్స్ రైలు తన గమ్యాన్ని చేరుకోవడానికి మూడేళ్లకు పైగా పట్టిందన్న వాదనలో నిజం లేదు. వాస్తవంగా, కేవలం గూడ్స్ రైలుకు చెందిన ఒక్క బోగీ/వ్యాగన్ మాత్రమే ఆలస్యంగా సుమారు మూడున్నర ఏళ్ల తరువాత గమ్యస్థానానికి చేరుకుంది, మొత్తం రైలు కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా భారతీయ రైల్వేలకు చెందిన ఒక గూడ్స్ రైలు గమ్యాన్ని చేరుకోవడానికి 3 సంవత్సరాలకు పైగా సమయం పట్టిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, జూలై 2018లో ప్రచురించబడిన ‘ది ఎకనామిక్ టైమ్స్ (The Economic Times)’ వార్తాకథనం ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, గూడ్స్ రైలు నుండి ఒక వ్యాగన్ తప్పిపోయింది, మొత్తం గూడ్స్ రైలు కాదు. “ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి చెందిన రామచంద్ర గుప్తా అనే వ్యాపారవేత్త 2014లో విశాఖపట్నం నుండి ఇండియన్ పొటాష్ లిమిటెడ్ (IPL) సంస్థ ద్వారా తన పేరు మీద ఎరువులు బుక్ చేశాడు. (IPL) సంస్థ 1,316 బస్తాల డి-అమోనియం ఫాస్ఫేట్ (DAP) ఎరువులను బస్తీకి రవాణా చేయడానికి ఒక వ్యాగన్‌ను బుక్ చేసింది. సాధారణంగా, 1,400 కి.మీ మొత్తం ప్రయాణానికి 42 గంటల 13 నిమిషాల సమయం పడుతుంది, అయితే ఈ బండికి/ వ్యాగన్‌కు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది” అని ఈ కథనం పేర్కొంది.
ఈ ఘటనను రిపోర్ట్ చేస్తూ జూలై 2018లో పలు ఇతర మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ) . ఈ కథనాల ప్రకారం, ఇండియన్ పొటాస్ కంపెనీ, ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి చెందిన M/S రామచంద్ర గుప్తా పేరిట విశాఖపట్నం ఓడరేవు నుండి ఉత్తరప్రదేశ్‌లోని బస్తీకి ఎరువులతో వ్యాగన్ నెం. 107462 ను 2014 సంవత్సరంలో లోడ్ చేసి పంపింది. కొన్ని నెలల తర్వాత కూడా ఆ వ్యాగన్ గమ్యస్థానానికి చేరుకోకపోవడంతో గుప్తా రైల్వేశాఖకు ఫిర్యాదు చేశారు. ఎరువులు లోడ్ చేసిన ఆ వ్యాగన్ చివరకు 2018 జూలైలో బస్తీ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది.
ఈ ఘటన గురించి నార్త్ ఈస్టర్న్ రైల్వేస్(ఈశాన్య రైల్వే) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) సంజయ్ యాదవ్ మాట్లాడుతూ,“కొన్నిసార్లు కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా సరుకు రవాణా రైలు నుండి వ్యాగన్లు వేరు చేయబడతాయి. బహుశా, ఈ వ్యాగన్ కూడా అలానే విడిపోయినట్లు కనిపిస్తోంది. కానీ ఈ ఘటనపై సమగ్ర విచారణ ఏమీ చెప్పలేము” అని తెలిపినట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి. దీన్ని బట్టి మొత్తం రైలు ఆలస్యం కాలేదు అని మనం నిర్ధారించవచ్చు. వాస్తవంగా, కేవలం గూడ్స్ రైలుకు చెందిన ఒక్క బోగీ/ వ్యాగన్ మాత్రమే ఆలస్యంగా మాత్రమే గమ్యస్థానానికి చేరింది.

అంతేకాకుండా, ఈ వైరల్ పోస్టులు మరియు వార్తాకథనాలపై స్పందిస్తూ భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) 10 డిసెంబర్ 2024న తన అధికారిక ఫాక్ట్-చెకింగ్ X (ట్విట్టర్) హ్యాండిల్‌లో ఈ వార్త కథనాలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, భారతీయ రైల్వేలో ఏ గూడ్స్ రైలు దాని గమ్యాన్ని చేరుకోవడానికి ఇంత సమయం పట్టలేదని స్పష్టం చేసింది.
మేము ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం నార్త్ ఈస్టర్న్ రైల్వేస్(ఈశాన్య రైల్వే) చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO)ని కూడా సంప్రదించాము, వారి నుండి సమాచారం అందుకున్న వెంటనే ఈ ఫాక్ట్-చెక్ కథనాన్ని అప్డేట్ చేస్తాము.
చివరగా, భారతీయ రైల్వేకు చెందిన ఒక గూడ్స్ రైలు తన గమ్యాన్ని చేరుకోవడానికి మూడేళ్లకు పైగా పట్టిందన్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా ఉంది. వాస్తవానికి, గూడ్స్ రైలులోని ఒక బోగీ/వ్యాగన్ మాత్రమే తప్పిపోయి దాదాపు మూడున్నరేళ్ల తర్వాత గమ్యస్థానానికి చేరుకుంది, మొత్తం రైలు కాదు.