ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ మరియు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తెలకు నలందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించడానికి భారత ప్రభుత్వం ₹2900 కోట్లను కేటాయించిందని, కానీ వాళ్ళు దానిలో 99% నిధులని అపహరించారని, అందువలన 2014లో వచ్చిన మోదీ ప్రభుత్వం పాత కమిటీని రద్దు చేసిందని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: నలందా విశ్వవిద్యాలయాన్ని నిర్మించడానికి భారత ప్రభుత్వం కేటాయించిన ₹2900 కోట్ల నిధులలో 99% అపహరించిన అమర్త్య సేన్ మరియు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తెలు. అందువలన 2014లో వచ్చిన మోదీ ప్రభుత్వం పాత కమిటీని రద్దు చేసింది.
ఫాక్ట్: మన్మోహన్ సింగ్ కుమార్తెలు నలందా విశ్వవిద్యాలయంలో ఎప్పుడూ పని చేయలేదు. వారికి యూనివర్సిటీ నుంచి ఎటువంటి జీతభత్యాలు లభించలేదు. ఫిబ్రవరి 2015 నాటికి అమర్త్యసేన్ యూనివర్సిటీ చాన్సలర్ గా పని చేసే నాటికి యూనివర్సిటీ నిర్మాణానికి కేటాయించిన ₹2722.10 కోట్లలో ప్రభుత్వం విడుదల చేసింది కేవలం ₹47.28 కోట్లు మాత్రమే. 2016లో కొత్త కమిటీని ఏర్పాటు చేయడానికి కారణం అమర్త్యసేన్ అవినీతికి పాల్పడటమేనని ప్రభుత్వం ఎక్కడా అధికారిక ప్రకటన జారీ చేయలేదు. కావున పోస్టులో చేయబడ్డ ఆరోపణలు తప్పు.
ప్రతిష్టాత్మకమైన నలందా విశ్వవిద్యాలయాన్ని పునర్నిర్మించాలన్న ఉద్దేశంతో 2007లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పచెప్తూ ప్రొఫెసర్ అమర్త్యసేన్ చైర్మన్ గా నలందా మెంటర్స్ గ్రూప్(NMG) అనే బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి ‘నలందా యూనివర్సిటీ చట్టం, 2010’ ని కూడా తెచ్చారు. 2012లో అమర్త్యసేన్ ఈ యూనివర్సిటీకి మొదటి ఛాన్సలర్ గా నియమించబడ్డాడు. ఆగస్టు 2014లో 800 ఏళ్ల తరువాత నలందా విశ్వవిద్యాలయం తిరిగి ప్రారంభమైంది. 2014లో మోదీ ప్రభుత్వం ఏర్పాడ్డాక, యూనివర్సిటీ విషయాలలో ప్రభుత్వ జోక్యం చేసుకొంటోందని ఆరోపిస్తూ ఫిబ్రవరి 2015లో రెండోసారి ఛాన్సలర్ పదవిని చేపట్టకుండా రాజీనామా చేశారు. చివరిగా, 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రతిపాదించిన యూనివర్సిటీ నూతన గవర్నింగ్ బృందంలో అమర్త్యసేన్‌కు చోటు దక్కలేదు.
ఇక పోస్టులో చేసిన ఆరోపణల విషయానికి వస్తే, విశ్వవిద్యాలయం పునర్నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టారో అని ఏప్రిల్ 2015లో పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాధానమిస్తూ, ప్రభుత్వం ఆమోదించిన ₹2722.10 కోట్లకు గాను ఇప్పటి వరకు కేవలం ₹47.28 కోట్లను మాత్రమే విడుదల చేశారని పేర్కొన్నారు. పైగా, అమర్త్యసేన్ యూనివర్సిటీలో ఉన్నంత కాలం ఎటువంటి జీతాన్ని తీసుకోలేదని 2015లోనే నలందా యూనివర్సిటీ స్పష్టం చేసింది.
ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కుమార్తెలకు ఈ యూనివర్సిటీతో సంబంధాలున్నాయని వస్తున్న ఆరోపణలని స్వయంగా వాళ్ళే ఖండించారు. నలందా యూనివర్సిటీలో తామెప్పుడూ పని చేయలేదని, తమకు యూనివర్సిటీ నుంచి ఒక్క రూపాయి కూడా అందలేదని మన్మోహన్ సింగ్ కుమార్తెలు దమన్ సింగ్, ఉపిందర్ సింగ్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని అమర్త్యసేన్ కూడా స్పష్టం చేశారు. ఇక 2016లో కొత్త కమిటీని ఏర్పాటు చేయడానికి కారణం అమర్త్యసేన్ అవినీతికి పాల్పడటమేనని ప్రభుత్వం ఎక్కడా అధికారిక ప్రకటన జారీ చేయలేదు.
చివరిగా, అమర్త్యసేన్ మరియు మన్మోహన్ సింగ్ కుమార్తెలు కలిసి నలందా యూనివర్సిటీకి సంబంధించిన ₹2900 కోట్ల డబ్బును దుర్వినియోగం చేశారనే ఆరోపణలలో నిజం లేదు.