ఇకపై ఉత్తరప్రదేశ్‌లోని ప్రైవేట్ డెంటల్ మరియు మెడికల్ కాలేజీల్లో SC, ST, OBC కోటాల ద్వారా ప్రవేశం రద్దు చేస్తూ యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రైవేట్ డెంటల్ మరియు మెడికల్ కాలేజీల్లో SC, ST, OBC కోటాల ద్వారా ప్రవేశం రద్దు చేస్తూ యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఫ్యాక్ట్(నిజం): వివిధ వార్తా పత్రికలకు ఉత్తర్ ప్రదేశ్ వైద్య విద్య శాఖ అధికారులు స్పష్టం చేసిన సమాచారం మేరకు, ప్రస్తుతం అమలవుతున్న 2006 నాటి పాలసీ ప్రకారం, రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ రంగ మెడికల్ మరియు డెంటల్ కాలేజీల్లో ఎప్పుడూ కూడా SC, ST, OBCలకు రిజర్వేషన్ అనేది లేదు. మరియు ఈ పాలసీలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు చేయలేదు. కావున, ఈ పోస్టు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, వైరల్ అవుతున్న ఫొటోను reverse image search చేయగా ఇదే పోస్టును కనీసం ఏప్రిల్ 2017 నుంచి ప్రచారంలో ఉంది అని గుర్తించాము.
ఇక ఏప్రిల్ 2017 లో దీనికి సంబంధించిన వార్తా కథనాలను పరిశీలించగా, ఇదే విషయంపై 13 ఏప్రిల్ 2017న “India Today” చేసిన ట్వీట్ లభించింది. “ ప్రైవేట్ డెంటల్ మరియు మెడికల్ కాలేజీల్లో SC, ST, OBC రిజర్వేషన్లు రద్దు చేస్తూ బిజెపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది” అని ఈ ట్వీట్ సారాంశంలో ఉంది. అయితే, కొందరు ఈ వార్తను ఫేక్ న్యూస్ అని కామెంట్ చేశారు.
ఇక ఇదే విషయంపై వేరే వార్తా కథనాలను కోసం వెతకగా, అదే రోజు “ Times of India” లో ప్రచురించిన వార్తా కథనం దొరికింది. అలాగే “The Wire” వెబ్సైటులో కూడా ఇదే వార్తను గురించిన ఒక వ్యాసం లభించింది.
ఈ కథనాల ప్రకారం, ప్రస్తుతం అమలవుతున్న 2006 నాటి పాలసీ ప్రకారం, రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ రంగ మెడికల్ మరియు డెంటల్ కాలేజీల్లో ఎప్పుడూ కూడా రిజర్వేషన్ అనేది లేదు. మరియు ఈ పాలసీలో ప్రస్తుతం ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, ప్రైవేట్ మెడికల్ మరియు డెంటల్ కాలేజీలు ఇప్పడు NEET పరిధిలోకి చేర్చబడ్డాయి. ఈ కాలేజీలలోని పోస్టు గ్రాడ్యూయేట్ కోర్సులకు సంబంధించిన సీట్లని NEET స్కోర్ ఆధారంగా కేటాయిస్తారు. 10 మార్చి 2017న అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జారీ చేసిన జీవోలో కూడా ప్రైవేట్ మెడికల్ మరియు డెంటల్ కాలేజీలలో SC, ST, OBC రేజర్వేషన్లు ఉండవు అని స్పష్టం చేశారు. ఇదే పాలసీని యోగి ప్రభుత్వం అమలు చేస్తుంది.
ఆయితే తప్పుడు వార్తను ప్రచారం చేసినందుకు “India today” తరువాత క్షమాపణ కోరుతూ ఒక కథనాన్ని కూడా ప్రచురించింది.
ఇక ఏప్రిల్ 2021లో కూడా యోగి అదిత్యనాథ్ ప్రైవేటు విద్యా సంస్థల్లో SC, ST లకు ఉచితంగా ప్రవేశాలు పొందే వ్యవస్థను రద్దు చేశాడనే వార్త ప్రచారంలో ఉండగా, Factly దానిని ఫాక్ట్- చెక్ అది తప్పుదోవ పట్టించే వార్త అని వివరిస్తూ ఒక కథనం ప్రచురించింది. దానిని ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, ఉత్తరప్రదేశ్‌లోని ప్రైవేట్ మెడికల్ మరియు డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్లకు యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం రాకముందు నుంచే SC, ST, OBC రిజర్వేషన్ లేదు.