Fake News, Telugu
 

“Mid-brain Activation” ప్రక్రియను ప్రాచీన నలందా విశ్వవిద్యాలయంలో బోధించారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

ముక్కుతో వాసన చూసి చదువుతున్నది. ఇలాంటి విద్యలు పూర్వం నలంద యూనివర్సిటీలో నేర్పించేవారు.” అని చెప్తూ KBC కార్యక్రమంలో ఒక బాలిక కళ్లకు గంతలు కట్టుకొని, కేవలం ముక్కుతో వాసన చూసి ఒక పుస్తకాన్ని చదువుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: కళ్లకు గంతలు కట్టుకొని కేవలం ముక్కుతో వాసన చూడడం ద్వారా పుస్తకాన్ని చదవగలిగే విద్యని పూర్వం నలందా విశ్వవిద్యాలయంలో నేర్పించేవారు.

ఫాక్ట్: ఈ ప్రక్రియ పేరు “Mid-brain Activation”. ఇది ఒక అశాస్త్రీయమైన మోసపూరిత ప్రక్రియ. కళ్ల గంతలు కట్టుకున్న వ్యక్తికి ముక్కు పక్కన ఉన్న ఖాళీ నుంచి వస్తువు లేదా పుస్తకం కనిపిస్తుంది. 2021లో KBC షోలో ప్రసారమైన ఈ సన్నివేశంపై భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నరేంద్ర నాయక్ కంప్లయింట్ ఇవ్వగా సోనీ టీవీ యాజమాన్యం ఈ సన్నివేశాన్ని ఎపిసోడ్ నుంచి తొలగించింది. పైగా, ఈ ప్రక్రియను ప్రాచీన నలందా విశ్వవిద్యాలయంలో బోధించారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ వీడియోలో చూపినట్లుగా ఈ ప్రక్రియని “Mid-brain Activation” అంటారని గుర్తించాం. ఈ ప్రక్రియలో భాగంగా ఒక వ్యక్తి కళ్లకు గంతలు కట్టి, ఏదైనా వస్తువుని కేవలం తాకడం ద్వారా దాని రంగును గుర్తిస్తారు. అలాగే ముక్కుతో వాసన చూడడం ద్వారా పుస్తకంలో ఉన్న అంకెలను, అక్షరాలను చెప్తారు. అయితే, ఈ “Mid-brain Activation” ప్రక్రియ అనేది ఒక అశాస్త్రీయమైన మోసపూరిత ప్రక్రియ అని జన విజ్ఞాన వేదిక, భారత హేతువాద సంఘం వంటి సంస్థలు అనేక సార్లు ఆధారాలతో సహా రుజువు చేశాయి.

కళ్లకు గంతలు కట్టినప్పుడు ముక్కు పక్కన ఉండే ఖాళీలో నుంచి చూసి ఆ వ్యక్తి తనకి ఇచ్చిన వస్తువు గురించి వివరిస్తాడు. ఇక వైరల్ వీడియో విషయానికి వస్తే, ఈ వీడియో క్లిప్ అమితాబ్ బచ్చన్ నిర్వహించే ‘KBC’ కార్యక్రమంలో 2021లో ప్రసారమైంది. అయితే, లక్షల మంది చూసే కార్యక్రమంలో ఇటువంటి అశాస్త్రీయమైన ప్రక్రియలను చూపించడంపై అభ్యంతరం తెలుపుతూ భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నరేంద్ర నాయక్ కంప్లయింట్ ఇవ్వగా, KBC కార్యక్రమాన్ని ప్రసారం చేసే సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా యాజమాన్యం ఈ ప్రక్రియని చూపే సన్నివేశాన్ని ఎపిసోడ్ నుంచి తొలగించింది. పైగా, జరిగిన దానికి క్షమాపణలు చెప్తూ, మళ్ళీ ఇటువంటి తప్పులను పునరావృతం కాకుండా జాగ్రత్త పడతామని ఆ సంస్థ పేర్కొంది.

నరేంద్ర నాయక్ మాట్లాడుతూ ఇది ఒక మోసపూరిత వ్యాపార ప్రక్రియ అని, “Mid-brain Activation” పిల్లలకు నేర్పుతామని చెప్పి కొందరు మోసగాళ్ళు తల్లిదండ్రుల దగ్గర వేల రూపాయలను వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే తరహాలో విదేశాలలో కూడా అనేక పేర్లతో ఈ ప్రక్రియ ఉంది అని ఆయన చెప్పారు. ఇక నలందా విశ్వవిద్యాలయంలో ఇటువంటి ప్రక్రియ బోధించారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఆ విశ్వవిద్యాలయ చరిత్రని గురించి వెల్లడించే పుస్తకాలలో కూడా ఈ ప్రక్రియ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు.

చివరిగా, “Mid-brain Activation” అనే ఈ మోసపూరితమైన ప్రక్రియని పురాతన నలందా విశ్వవిద్యాలయంలో బోధించారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll