Fake News, Telugu
 

నాథూరామ్ గాడ్సే కాంగ్రెస్ సభ్యుడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

గాంధీని హత్య చేసిన గాడ్సే కాంగ్రెస్ సభ్యుడు అని, హత్య తరువాత కాంగ్రెస్‌పై విచారణ ఎందుకు జరగలేదు? హత్య జరిగిన వెంటనే గాంధీని ఆసుపత్రికి తరలించకుండా బిర్లా హౌసులో ఎందుకు ఉంచారు అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే కాంగ్రెస్ సభ్యుడు. గాంధీపై హత్యాయత్నం జరిగిన వెంటనే ఆసుపత్రికి తరలించకుండా బిర్లా హౌస్‌కు తరలించారు.

ఫాక్ట్(నిజం): గాంధీ బిర్లా హౌస్ నుంచి లాన్‌కు వెళ్తుండగా కాల్పులు జరిగాయి. అప్పుడు గాంధీని బిర్లా హౌస్‌లోకి తీసుకెళ్లిన అరగంట తర్వాత చనిపోయాడు. గాడ్సే ఆత్మకథ అయిన ‘వై ఐ కిల్డ్ గాంధీ’ అనే పుస్తకంలో తాను ఆర్ఎస్ఎస్ సంస్థలో చేరినట్టు స్వయంగా రాశాడు. జీ.డీ. ఖోస్లా, తన పుస్తకం ‘ది మర్డర్ ఆఫ్ ది మహాత్మా’లో గాడ్సే తన 22వ సంవత్సరంలో RSSలో చేరాడని రాశాడు. ఫ్రంట్‌లైన్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాథూరామ్ గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సే కూడా గాడ్సే RSSని విడిచిపెట్టలేదని తెలిపారు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్టులో చేసిన క్లెయిమ్ గురించి కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, గాంధీ బిర్లా హౌస్ నుంచి లాన్‌కు వెళ్తుండగా కాల్పులు జరిగాయి అని, అప్పుడు గాంధీని బిర్లా హౌస్‌లోకి తీసుకెళ్లిన అరగంట తర్వాత చనిపోయాడు అని తెలుసుకున్నాం (ఇక్కడ మరియు ఇక్కడ).

అయితే, నాథూరాం గాడ్సే కాంగ్రెస్ సభ్యుడు అని అనేందుకు ఎక్కడా ఆధారాలు  దొరకలేదు. పైగా, గాడ్సే ఆత్మకథ అయిన ‘వై ఐ కిల్డ్ గాంధీ’ పుస్తకంలో, “నేను హిందువులందరికీ హక్కుల విషయంలో సమాన హోదా కోసం కుల వ్యతిరేక ఉద్యమాల ఆర్‌ఎస్‌ఎస్ విభాగంలో చేరాను” అని రాయటం గమనించాం.

అంతే కాకుండా, జీ.డీ. ఖోస్లా, తన పుస్తకం ‘ది మర్డర్ ఆఫ్ ది మహాత్మా’లో గాడ్సే తన 22వ సంవత్సరంలో RSSలో చేరాడని, కొన్ని సంవత్సరాల తరువాత అతను పూనా హిందూమహాసభ స్థానిక బ్రాంచ్ కి కార్యదర్శి అయ్యాడు అని తెలిపారు. కర్కరే అనే వ్యక్తి, పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో గాంధీని హత్య చేసే ముందు గాడ్సే మరియు ఆప్టేతో తాను జరిపిన చర్చల గురించి వివరణ ఇస్తూ “గాంధీజీని గాడ్సే ఒంటరిగా హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. నన్ను కావాలనుకుంటే అహ్మద్‌నగర్‌కు వెళ్లమని మరియు హిందూ మహాసభ యొక్క పనులు చూసుకొమ్మని చెప్పారు” అని తెలిపారని రాశారు.

ఫ్రంట్‌లైన్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాథూరామ్ గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సే మాట్లాడుతూ, “గాడ్సే సోదరులందరూ RSSలో ఉన్నారని మరియు గాడ్సే ఆర్ఎస్ఎస్ ను విడిచిపెట్టలేదని తెలిపారు” అంటూ పలు రిపోర్ట్ లలో ప్రచురించబడింది (ఇక్కడ మరియు ఇక్కడ).

చివరిగా, నాథూరామ్ గాడ్సే కాంగ్రెస్ సభ్యుడు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll