వివరణ (SEPTEMBER 27, 2021): ఇంతకుముందు జూన్ 30, 2021 నాటి తీర్పులో సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు, కోవిడ్ కారణంగా మరణించిన వారిపై ఆధారపడిన వారికి పరిహారం మంజూరు చేయడానికి మార్గదర్శకాలను రూపొందించాలని కోర్టు NDMA ని ఆదేశించింది.
సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ద్వారా మరణించిన వారికి ‘డెత్ సర్టిఫికెట్’ గురుంచి గైడ్లైన్స్ ఇటీవల విడుదల చేసింది. ఈ గైడ్లైన్స్ గురుంచి, వాటిలో ఉన్న సమస్యల మీద మా ఆర్టికల్ ఇక్కడ చదవండి.
అదే విధంగా, కోర్ట్ ఆదేశాల మేరకు కోవిడ్ కారణంగా మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వాల నుండి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందుతుందని కేంద్రం కోర్ట్ కి తెలిపింది. ఈ ఎక్స్ గ్రేషియా కోసం నిధులు ‘స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్’ నుండి తీసుకోవాలని తెలిపింది. వివిధ రాష్ట్రాలు దీనికి సంబంధిత గైడ్లైన్స్ 2021లోనే జారీ చేసాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గైడ్లైన్స్ ఇక్కడ చూడొచ్చు.
వివరణ (JULY 01, 2021): డెత్ సర్టిఫికేట్ మరియు పరిహారం విషయంపై విచారణ జరిపిన సుప్రీమ్ కోర్టు 30 జూన్ 2021న కరోనాతో చనిపోయిన వారికి మరియు కరోనా సోకి ఉండి ఇతర ఆరోగ్య సమస్యలతో చనిపోయిన వారందరికి కూడా కచ్చితంగా కరోనా వల్ల చనిపోయారని పేర్కొంటూ డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలనీ ఆదేశించింది. అలాగే విపత్తు నిర్వహణ చట్టం కింద విపత్తుల సమయంలో పరిహారాన్ని చెల్లించడం చట్టబద్ధమైన బాధ్యత అని, కాబట్టి కేంద్ర ప్రభుత్వం కరోనా వల్ల చనిపోయిన వారికి పరిహారాన్ని చెల్లించాలని తీర్పు చెప్పింది. కాకపోతే ఎంత పరిహారం చెల్లించాలో మేము చెప్పలేమని, ఎంత పరిహారాన్ని చేల్లిస్తుందో కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించి, దీనికి సంబంధించిన గైడ్లైన్స్ రూపొందించి తమకు చెప్పాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది. ఈ తీర్పు యొక్క కాపీని ఇక్కడ చూడొచ్చు.
‘కరోనాతో చనిపోయిన వారికి జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద 3 నుండి 4 లక్షల వరకు పరిహారం వస్తుందని, ఇందుకోసం చనిపోయిన వారి డెత్ సర్టిఫికేట్ లో కరోనాతో చనిపోయినట్టు పేర్కొనాలని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ‘కరోనాతో చనిపోయిన వారికి జాతీయ విపత్తు నిర్వహణ చట్టం కింద 3 నుండి 4 లక్షల వరకు పరిహారం వస్తుంది.’
ఫాక్ట్ (నిజం): విపత్తుల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు విపత్తు నిర్వహణ చట్టం, 2005 సెక్షన్ 12(iii) కింద పరిహారం అందిల్చాల్సిన విషయం నిజమైనప్పటికీ, కరోనాతో చనిపోయిన వారికి ఈ చట్టం కింద పరిహారం అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టత లేదు. 14 మార్చ్ 2020 కేంద్ర ప్రభుత్వం కరోనాని నోటిఫైడ్ డిసాస్టర్ గా గుర్తించింది. దీనికి అనుగుణంగా కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు 4 లక్షల పరిహారం అందిస్తామని గైడ్లైన్స్ కూడా విడుదల చేసింది. కాకపోతే గైడ్లైన్స్ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే ఈ గైడ్లైన్స్ నుండి పరిహారం అంశాన్ని తీసేసి కొత్త గైడ్లైన్స్ విడుదల చేసింది. ఇలా చేయడానికి గల కారణాలు కేంద్ర ప్రభుత్వం పేర్కొనలేదు. ఈ కేసులో సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్ ద్వారా మరణించిన వారికి ‘డెత్ సర్టిఫికెట్’ గురుంచి గైడ్లైన్స్ విడుదల చేసింది. అదే విధంగా, కోర్ట్ ఆదేశాల మేరకు కోవిడ్ కారణంగా మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వాల నుండి రూ. 50,000 ఎక్స్ గ్రేషియా అందుతుందని కేంద్రం కోర్ట్ కి తెలిపింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
విపత్తు నిర్వహణ చట్టం, 2005 (DMA) లోని సెక్షన్ 12 (iii) ప్రకారం విపత్తుల సమయాల్లో ఆస్తి మరియు ప్రాణ నష్టం జరిగినప్పుడు అందించాల్సిన పరిహారానికి సంబంధించిన నేషనల్ డిసాస్టర్ మ్యానేజ్మెంట్ అథారిటీ (NDMA) గైడ్లైన్స్ రూపొందించాలని పేర్కొంది.
ఈ చట్టానికి అనుగుణంగా విపత్తుల సమయాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు అందించాల్సిన పరిహారానికి సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 08 ఏప్రిల్ 2015 ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం విపత్తుల సమయాల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు డెత్ సర్టిఫికేట్ లో పేర్కొన్న మరణానికి గల కారణాల ఆధారంగా 4 లక్షల రూపాయల పరిహారం అందిస్తారు. ఈ మొత్తం స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (SDRF) మరియు నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) నుండి అందిస్తారు. ఐతే ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ గైడ్లైన్స్ 2015 నుండి 2020 వరకు అమలులో ఉంటాయి.
ఐతే కేంద్ర ప్రభుత్వం 14 మార్చ్ 2020న కరోనాని నోటిఫైడ్ విపత్తుగా (డిసాస్టర్) గుర్తిస్తూ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. పైగా 2015లో విడుదల చేసిన విపత్తు నిర్వహణ చట్టం పరిహారం అందించే అంశంపై విడుదల చేసిన గైడ్లైన్స్ కాల వ్యవధి అయిపోవడంతో అదే రోజు (14 మార్చ్ 2020న) కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విపత్తు నిర్వహణ చట్టం, 2005 (DMA) లోని సెక్షన్ 12 కింద కరోనా విపత్తుని ఎదుర్కోవడానికి హాస్పిటల్స్ కి అయ్యే ఖర్చు, ధరలు, పరిహారం మొదలైన అంశాలకు సంబంధించి గైడ్లైన్స్ తో కూడిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ గైడ్లైన్స్ లో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని పేర్కొంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ గైడ్లైన్స్ తమ ట్విట్టర్ ద్వారా కూడా షేర్ చేసింది.
ఐతే ఈ గైడ్లైన్స్ విడుదల చేసిన కొన్ని గంటలకే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ లో కొన్ని సవరణలు చేస్తూ మరొక నోటిఫికేషన్ విడుదల చేసింది, ఈ నోటిఫికేషన్ లో కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం అందించే అంశాన్ని తీసేసింది. ఈ విషయానికి సంబంధించిన వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఇలా చేయడానికి గల కారణాలు కేంద్ర ప్రభుత్వం పేర్కొనలేదు. అంతకు ముందు చేసిన ట్వీట్ కూడా ప్రభుత్వం డిలీట్ చేసింది. ప్రస్తుతానికి మాత్రం, విపత్తు చట్టం కింద అందించాల్సిన పరిహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పష్టత లేదు.
ఐతే ఇటీవల సుప్రీంకోర్టులో కరోనా వల్ల చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని సెక్షన్ 12 (iii) కింద పరిహారం ఇప్పించాలని, మరియు కరోనా వల్ల చనిపోయిన వారికి డెత్ సర్టిఫికేట్ లో ఊపిరి తిత్తులు లేదా గుండె సంబంధించిన కారణాల వల్ల చనిపోయునట్టు పేర్కొంటున్నారని, అలాకాకుండా కరోనాతో చనిపోయినట్టు డెత్ సర్టిఫికెట్ ఇప్పించాలని, అలాగైతేనే పరిహారం వస్తుందని కోరుతూ రెండు వేరు వేరు పిటిషన్లు ఫైల్ అయ్యాయి . ఈ పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు విపత్తు నిర్వహణ చట్టం, 2005 లోని సెక్షన్ 12 (iii) కింద అందించాల్సిన పరిహారానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న స్కీమ్స్ వివరాలు మరియు కరోనాతో చనిపోయిన వారికి ఇచ్చే డెత్ సర్టిఫికెట్స్ కి కేంద్ర అవలంభిస్తున్న పాలసీ లేదా గైడ్లైన్స్ కి సంబంధించిన వివరాలు కోర్టుకి సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను 11 జూన్ 2021కి వాయిదా వేసింది.
పైన తెలిపిన వివరాల ప్రకారం పోస్టులో చెప్పినట్టు విపత్తుల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు విపత్తు నిర్వహణ చట్టం కింద పరిహారం అందిల్చాల్సిన విషయం నిజమైనప్పటికీ , కరోనాతో చనిపోయిన వారికి ఈ చట్టం కింద పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం నుండి ఎలాంటి స్పష్టత లేదు.
చివరగా, కరోనాతో చనిపోయిన వారి కుటుంబాలకు అందించే పరిహారానికి సంబంధించి ఎటువంటి స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ విషయం పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది.
వివరణ (MAY 31, 2021): భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా ఇది ఫేక్ అని, ఇటువంటి పరిహారం ఏది ప్రభుత్వం ఇవ్వడం లేదని ట్వీట్ చేసింది.