Fake News, Telugu
 

అబ్దుల్ కలాం విగ్రహారాధనను మూర్ఖత్వంగా భావించేవాడని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

భారత మాజీ రాష్ట్రపతి మరియు శాస్త్రవేత్త ఏ.పీ.జె.అబ్దుల్ కలాం విగ్రహారాధనను మూర్ఖత్వంగా భావించేవారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. వీడియోలోని వ్యక్తి, అబ్దుల్ కలాం జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి వివరిస్తూ, “అబ్దుల్ కలాం చిన్నప్పుడు వారి నాన్న అతన్ని దేవాలయానికి తీసుకెళ్లినప్పుడు, దేవాలయం ప్రవేశ ద్వారాలపై ఉన్న సింహాల విగ్రహాలను చూసి అబ్దుల్ కలాం భయపడ్డారు. అబ్దుల్ కలాం తండ్రి దానికి, “అవి నిజమైన సింహాలు కావు, కేవలం విగ్రహాలు మాత్రమే, అవి నిన్ను ఏమి చేయవు”, అని చెప్పి దేవాలయం లోనికి తీసుకెళ్లారు. దేవాలయం లోనికి వెళ్ళాక అబ్దుల్ కలాం, “నాన్న నాదొక ప్రశ్న. బయట ఉన్న సింహాలు నన్ను ఏమి చేయవన్నది నువ్వు చెప్పింది నిజమైతే, లోనున్న దేవుడు నన్ను ఏం చేస్తాడని నన్ను తీసుకొచ్చావు.”, అని అడిగాడంటూ తెలిపారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.   

క్లెయిమ్: అబ్దుల్ కలాం విగ్రహారాధనను మూర్ఖత్వంగా భావించేవాడని తెలుపుతూ ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఒక వ్యక్తి వివరిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): కెనడా దేశం టొరెంటోలోని స్వామి నారాయణ్ మందిరాన్ని, బెంగళూరు ఇస్కాన్ మందిరం మరియు ఇతర దేవాలయాలను సందర్శించినప్పుడు, అబ్దుల్ కాలం విగ్రహాలకు పూజలు చేసిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. అబ్దుల్ కలాం విగ్రహారాధనను మూర్ఖత్వంగా భావిస్తానని పేర్కొన్నట్టుగా ఎటువంటి అధికారిక ఆధారాలు లేవు. వీడియోలో తెలుపుతున్న సంఘటన గురించి అబ్దుల్ కాలం తన ఆత్మకథ పుస్తకం ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’లో ఎక్కడా పేర్కొనలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం కొన్ని సంబంధిత పదాలను ఉపయోగించి వెతికితే, విగ్రహారాధనను తాను వ్యతిరేకిస్తానని అబ్దుల్ కలాం పేర్కొన్నట్టుగా మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. వీడియోలో తెలుపుతున్న సంఘటన గురించి అబ్దుల్ కలాం తన ఆత్మకథ పుస్తకం ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’లో కూడా ఎక్కడా ప్రస్తావించలేదు.

ఒకవేళ విగ్రహారాధనకు సంబంధించి అబ్దుల్ కలాం అటువంటి వ్యాఖ్యలు చేసివుంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవి. అబ్దుల్ కలాం మరణించిన తరువాత DRDO సంస్థ ఏర్పాటు చేసిన మెమోరియల్‌లో, కలాం విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై, కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు కొన్ని వార్తా సంస్థలు రిపోర్ట్ చేశాయి. విగ్రహారాధనను అబ్దుల్ కలాం వ్యతిరేకించే వారని, అటువంటిది అతని మెమోరియల్‌లో ఆయన విగ్రహమే ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని వారు తెలిపినట్టు ఈ వార్తా రిపోర్టులు తెలిపాయి.  

అయితే, అబ్దుల్ కలాం గతంలో కెనడా దేశం టొరెంటోలోని స్వామి నారాయణ్ మందిరాన్ని, బెంగళూరులో ఇస్కాన్ మందిరం మరియు ఇతర దేవాలయాలను సందర్శించినప్పుడు విగ్రహాలకు పూజ చేస్తున్న చిత్రాలు మరియు వీడియోలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి.

అంతేకాదు, అబ్దుల్ కలాం విగ్రహాలకు ప్రార్థనలు చేయడం మరియు నగ్న సాధువులను గౌరవించడం వలన అతను ముస్లిం కాదని తమిళనాడు తౌహీద్ జమాత్ అధ్యక్షుడు 2018లో వ్యాఖ్యలు చేశారు.

అబ్దుల్ కలాం తాను ఒక మతపరమైన వ్యక్తినని, ఆన్ని మతాలను గౌరవిస్తానని, మతభావన ఆధ్యాత్మికంలోకి మారి దేశాభివృద్ధి కోసం ప్రజలను ఏకం చేసే విధంగా ఉండాలని పలు సార్లు పేర్కొన్నారు. అబ్దుల్ కలాం మసీదులను, హర్మిందర్ సాహిబ్ గోల్డెన్ టెంపుల్ మరియు చర్చిలను సందర్శించినప్పుడు తీసిన చిత్రాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. విగ్రహారాధనను తాను మూర్ఖంగా భావిస్తానని అబ్దుల్ కలాం పేర్కొన్నట్టుగా ఎక్కడా నమ్మదగిన ఆధారాలు లేవు.

చివరగా, అబ్దుల్ కలాం విగ్రహారాధనను మూర్ఖత్వంగా భావించేవాడంటూ ఈ వీడియోలో తెలుపుతున్న సంఘటన ఏది అబ్దుల్ కలాం జీవితంలో చోటుచేసుకుందని చెప్పడానికి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll