Fact Check, Fake News, Telugu
 

‘రైట్ టు రీకాల్’ బిల్లును మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని చెప్పడానికి ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు

0

“సరిగ్గా పనిచేయని MLA లకు త్వరలో లోకసభలో ప్రవేశపెట్టనున్న బిల్లు షాక్ ఇవ్వనుంది, ఈ బిల్లు ఆమోదం పొందితే రెండేళ్లలోనే సదరు ఎమ్మెల్యే పదవి నుంచి దిగిపోవాలి, పనితీరులో విఫలమైన MLAను తొలగించాలంటే ఆ నియోజకవర్గంలోని ఓటరు స్పీకరుకు పిటిషన్ పెట్టుకునే అవకాశాన్ని ఈ బిల్లు కల్పించనుంది, ఈసీ దానిని పరిశీలించి ఓటింగ్ నిర్వహిస్తుంది. ఆ నియోజకవర్గంలోని 75% పైగా ప్రజలు ఆ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఓటేస్తే మళ్లీ ఉపఎన్నిక నిర్వహిస్తారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అలాగే ఈ పోస్టులు మోదీ ప్రభుత్వం త్వరలో లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పనితీరు సంతృప్తికరంగా లేని ఎంపీలు, ఎమ్మెల్యేలను రీకాల్ (పదవి నుంచి తొలగించే) చేసేలా ఒక బిల్లును మోదీ ప్రభుత్వం త్వరలో లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది.

ఫాక్ట్(నిజం): పనితీరు సంతృప్తికరంగా లేని ఎంపీలు, ఎమ్మెల్యేలను రీకాల్ చేయడానికి (పదవి నుండి తొలగించడానికి) మోదీ ప్రభుత్వం త్వరలో లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టనుందని చెప్పడానికి ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. 2017లో అప్పటి బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేకపోతే, ప్రజలు ఆ ప్రజాప్రతినిధులను వెనక్కి పిలిచే హక్కును ఇచ్చే ‘రైట్ టు రీకాల్’ ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లు గడువు ముగియడంతో రద్దు చేయబడింది. అలాగే, ఆగస్ట్ 1974లో ఇలాంటి ‘రైట్ టు రీకాల్’ బిల్లును కేరళకు చెందిన ఎంపీ సి.కె. చంద్రప్పన్ ప్రైవేట్ మెంబర్ బిల్లుగా లోక్‌సభలో ప్రవేశపెట్టగా, 28 నవంబర్ 1974 జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లు వీగిపోయింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, సరిగ్గా పనిచేయని ఎంపీలు, ఎమ్మెల్యేలను రీకాల్ చేసేలా ఒక బిల్లును మోదీ ప్రభుత్వం త్వరలో లోక్‌సభలో ప్రవేశపెట్టనుందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు. ఒకవేళ  మోదీ ప్రభుత్వం ఇలాంటి ఆలోచన చేసి ఉంటే, కచ్చితంగా పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేసి ఉండేవి. ఇదే క్లెయిమ్ గత కొన్నేళ్లుగా వైరల్ అవుతోంది.

ఈ క్రమంలోనే మార్చి​ 2017లో అప్పటి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ వరుణ్ గాంధీ, ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేకపోతే, ప్రజలు ఆ ప్రజాప్రతినిధులను పదవి నుండి తొలగించే హక్కును ఇచ్చే ‘రైట్ టు రీకాల్’ ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు అని తెలిసింది (ఇక్కడ, & ఇక్కడ).

10 మార్చి 2017న ఎంపీ వరుణ్ గాంధీ, ఎన్నికైన ఎంపీల, ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తికరంగా లేకపోతే, ప్రజలు ఆ ప్రజాప్రతినిధులను పదవి నుంచి తొలగించేలా చట్టం చేసేందుకు 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణను ప్రతిపాదిస్తూ లోక్‌సభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును (Representation of the People (Amendment) Bill, 2016) ప్రవేశపెట్టారు.

ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రకారం, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓటు వేసిన వారిలో 75% మంది వారి పనితీరు పట్ల సంతృప్తి చెందకపోతే, ఎన్నికైన రెండేళ్లలోపు వారిని రీకాల్ చేయవచ్చు. ఇందుకోసం ఎన్నికల తర్వాత కనీసం రెండు సంవత్సరాల వ్యవధి తర్వాత నియోజకవర్గంలోని ఏ ఓటరు అయినా స్పీకర్ ముందు పిటిషన్ దాఖలు చేయడం ద్వారా రీకాల్ ప్రక్రియను ప్రారంభించవచ్చు. ఈ రీకాల్ పిటిషన్ పై ఆ నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లలో కనీసం నాలుగో వంతు మంది సంతకం చేయాలి. స్పీకర్ పిటిషన్ యొక్క ప్రామాణికతను పరిశీలించిన తర్వాత, ఓటర్ల సంతకాలను ధృవీకరించడానికి స్పీకర్ దానిని ఈసీఐకి బదిలీ చేస్తాడు. స్పీకర్ నుండి రీకాల్ పిటిషన్ అందిన తర్వాత, ఎన్నికల కమిషన్, రీకాల్ పిటిషన్‌పై సంతకాల ప్రామాణికతను కోసం ధృవీకరణ ప్రక్రియను ప్రారంభించి, దీనిని ఒక నిర్దిష్ట వ్యవధిలోపు పూర్తి చేయాలి. అనంతరం రీకాల్ ప్రక్రియను నిర్వహిస్తుంది. దీనికోసం MP లేదా MLA నియోజకవర్గంలోని పది ప్రాంతాల్లో రీకాల్ పిటిషన్‌పై ఓటింగ్ ప్రక్రియను నిర్వహించాలి. రీకాల్ పిటిషన్‌కు అనుకూలంగా సదరు ప్రజాప్రతినిధి ఎన్నికల్లో పొందిన ఓట్లలో కనీసం 3/4 వంతు ఓట్లు వస్తే రీకాల్ పిటిషన్ విజయవంతమైందని భావిస్తారు అంటే సదరు ప్రజాప్రతినిధిని పదవి నుండి తొలగిస్తారు, ఆ తర్వాత ECI ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నికను నిర్వహించాలి.

అయితే, వరుణ్ గాంధీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు (Representation of the People (Amendment) Bill, 2016) పార్లమెంటులో ఆమోదం పొందలేదు, ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లు గడువు ముగియడంతో రద్దు చేయబడింది. లోక్‌సభ పదవీకాలం ముగిసినప్పుడు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందని బిల్లులు రద్దు చేయబడతాయి.

ఇలాంటి రైట్ టు రీకాల్ (Right to Recall) బిల్లును 23 ఆగస్టు 1974లో కేరళకు చెందిన ఎంపీ సి.కె. చంద్రప్పన్ ప్రైవేట్ మెంబెర్ బిల్లుగా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 15 నవంబర్ 1974న లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ నిర్వహించారు.

అయితే, 28 నవంబర్ 1974 జరిగిన ఓటింగ్‌లో ఈ బిల్లు వీగిపోయింది. ఈ బిల్లుకు అనుకూలంగా 22 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 89 ఓట్లు వచ్చాయి

ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే ఏంటి?

మంత్రి కాని పార్లమెంటు సభ్యుడు (MP), అంటే ప్రభుత్వంలో భాగము కాని సభ్యుడు ప్రవేశపెట్టే బిల్లును ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటారు. పార్లమెంటులో రెండు రకాల బిల్లులు ప్రవేశపెడతారు: ప్రభుత్వ, ప్రైవేట్ బిల్లులు. పబ్లిక్ బిల్లులను ప్రభుత్వ బిల్లులు అని కూడా పిలుస్తారు (ఇక్కడ).

ప్రైవేట్ మెంబర్ బిల్లులకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు:

  • ఎవరైనా పార్లమెంటు సభ్యుడు (ఎంపీ) ఈ బిల్లును ప్రవేశపెట్టవచ్చు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఇద్దరూ ప్రైవేట్ సభ్యుల బిల్లును ప్రవేశపెట్టవచ్చు, కానీ ఆ సభ్యుడు మంత్రివర్గంలో ఉండకూడదు.
  • సాధారణంగా శుక్రవారం రోజున ప్రైవేట్ మెంబర్ బిల్లులు చర్చకు వస్తాయి.
  • ప్రైవేట్ మెంబర్ బిల్లు చట్టంగా మారాలంటే ఉభయ సభలలో ఆమోదం పొందాలి.
  • ఉభయ సభలలో ఆమోదం పొందిన తర్వాత, బిల్లు చట్టంగా మారాలంటే రాష్ట్రపతి ఆమోదం కూడా తప్పనిసరి.
  • పార్లమెంటు సమావేశాలకు ప్రైవేట్ సభ్యుల బిల్లుల సంఖ్యను 3కి పరిమితం చేశారు.

ప్రైవేట్ మెంబర్ బిల్లులు చాలా అరుదుగా చట్టాలుగా మారతాయి. సుమారు గత 45 ఏళ్లలో, ఒక్క ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా పార్లమెంటులో ఆమోదం పొందలేదు. పార్లమెంటు ఆమోదించిన చివరి ప్రైవేట్ మెంబర్ బిల్లు సుప్రీంకోర్టు (క్రిమినల్ అప్పీలేట్ అధికార పరిధి విస్తరణ) బిల్లు, 1968. ఇది 09 ఆగస్టు 1970న చట్టంగా మారింది. 1952 నుండి ఇప్పటివరకు కేవలం 14 ప్రైవేట్ మెంబర్ బిల్లులు మాత్రమే చట్టాలుగా మారాయి. పార్లమెంటులో ఆమోదం పొందిన ప్రైవేట్ మెంబర్ బిల్లులకు సంబంధించిన మరింత సమాచారం కోసం ఇక్కడ & ఇక్కడ చూడండి.

చివరగా, ‘రైట్ టు రీకాల్’ బిల్లును మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. గతంలో ‘రైట్ టు రీకాల్’ బిల్లును ఇద్దరు ఎంపీలు ప్రైవేట్ మెంబర్ బిల్లులగా ప్రవేశపెట్టగా అవి పార్లమెంట్ ఆమోదం పొందలేదు.  

Share.

About Author

Comments are closed.