Fake News, Telugu
 

ఈ వీడియోలో బోర్‌వెల్ నుండి తెల్ల రంగులో బయటకి వస్తున్నది పాలు కాదు; ఈ వీడియో మహారాష్ట్రకు సంబంధించినది కాదు

0

మహారాష్ట్రలోని ఒక పొలంలో బోర్ వేస్తే పాలు బయటకువచ్చిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్:  మహారాష్ట్రలోని ఒక పొలంలో బోర్ వేస్తే అందులో నుండి పాలు బయటికి వచ్చిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం) : 2019లో రాజస్థాన్ బికనేర్ జిల్లాలో రెండేళ్లుగా మూతపడి ఉన్న ఒక బోర్‌వెల్‌ను రసాయనాల సహాయంతో శుభ్రం చేసి తిరిగి స్టార్ట్ చేసినప్పుడు, దాన్లో నుండి మొదట కొంతసేపు వరకు తెల్లటి నురుగులాంటి నీరు బయటకి వచ్చింది. రెండు గంటల తరువాత ఈ తెల్లటి నురుగు పోయి అందులో నుండి నీరు వచ్చింది. ఈ వీడియోలో బోరింగ్ పైప్ నుండి బయటికి వస్తున్నది పాలు కాదు. అలాగే, ఈ వీడియో మహారాష్ట్రకి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని చాలా మంది సోషల్ మీడియా యూసర్లు 2019లో షేర్ చేస్తూ, రాజస్థాన్ బికనేర్ జిల్లా నౌరంగ్‌దేసర్ గ్రామంలోని ఒక పొలంలో బోర్ వేస్తే పాలు బయటకి వచ్చిన దృశ్యాలంటూ తెలిపారు. ఈ ఘటన నౌరంగ్‌దేసర్ గ్రామంలోని వీర్ బిగ్గాజి పెట్రోల్ పంప్ సమీపంలోని పొలంలో చోటుచేసుకున్నట్టు ఈ సోషల్ మీడియా యూసర్లు తెలిపారు.

అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోకి సంబంధించి స్పష్టతనిస్తూ ‘INC News’ అనే యూట్యూబ్ ఛానెల్ 19 నవంబర్ 2019 నాడు ఒక వీడియోని పబ్లిష్ చేసినట్టు తెలిసింది. రెండుళ్లుగా మూతపడి ఉన్న ఒక బోర్‌వెల్‌ను రసాయనాల సహాయంతో శుభ్రం చేసి తిరిగి స్టార్ట్ చేసినప్పుడు, అందులో నుండి తెల్లటి నురుగు నీరు బయటకి వచ్చిందని, రెండు గంటల తరువాత నీరు బయటకి రావడం మొదలయ్యిందని నౌరంగ్‌దేసర్ గ్రామ సర్పంచ్ రాంనివాస్ వారికి స్పష్టం చేసినట్టు ఈ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

ఈ వీడియోకి సంబంధించిన మరింత స్పష్టత కోసం విశ్వాస్ న్యూస్ ఫాక్ట్-చెకింగ్ సంస్థ వీర్ బిగ్గాజి పెట్రోల్ పంప్ యాజమాని రాంచంద్రను సంప్రదించారు. వీడియోలోని ఘటన 2019 నవంబర్ నెలలో చోటుచేసుకుందని, తన తమ్ముడి పొలంలో రెండుళ్లుగా మూతపడి ఉన్న ఒక బోర్‌వెల్‌ను రసాయనాల సహాయంతో శుభ్రం చేసి తిరిగి స్టార్ట్ చేసినప్పుడు, దాంట్లో నుండి మొట్టమొదట కొంతసేపు వరకు తెల్లటి నురుగులాంటి నీరు బయటకి వచ్చిందని రాంచంద్ర, విశ్వాస్‌ వార్తా సంస్థకి తెలిపారు. తెల్లటి నురుగు నీరు వస్తున్నప్పుడు తీసిన వీడియోలని కొందరు గ్రామస్థులు సోషల్ మీడియాలో తప్పుగా షేర్ చేశారని  రాంచంద్ర స్పష్టం చేశారు. ఈ ఘటనకు సంబంధించి రాజస్థాన్ పత్రిక వార్తా సంస్థ కూడా ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా వీడియోలో బోర్‌వెల్ నుండి తెల్లగా బయటికివస్తున్నది పాలు కాదని, ఈ వీడియో మహారాష్ట్రకు సంబంధించినది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, రెండుళ్లుగా మూతపడి ఉన్న బోర్‌వెల్‌ను తిరిగి స్టార్ట్ చేసినప్పుడు, అందులో నుండి తెల్లటి నురుగు నీరు బయటకి వచ్చిన దృశ్యాలని మహారాష్ట్రలోని ఒక పొలంలో బోర్ వేస్తే పాలు బయటికి వచ్చిన దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll