Fake News, Telugu
 

ఈ వైరల్ వీడియో భారతదేశంలో అక్రమంగా ఉంటున్న బంగ్లాదేశ్ వలసదారులను 26 ఏప్రిల్ 2025న గుజరాత్ పోలీసులు అరెస్టు చేసిన దృశ్యాలను చూపిస్తుంది

0

22 ఏప్రిల్ 2025న కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడికి తామే పాల్పడినట్టు ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ప్రకటించింది. కాకపోతే, 25 ఏప్రిల్ 2025న తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో పోస్ట్ చేసిన కొత్త ప్రకటనలో, TRF పహల్గామ్ సంఘటనలో తమ ప్రమేయం లేదని, అంతకు ముందు చేసిన ప్రకటనతో తమకు సంబంధం లేదని తెలిపింది. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారయాత్రకు వచ్చిన వారిపై విచక్షణారహితంగా కాల్పులకు తెగపడ్డారు. మతం అడిగిన తర్వాత ఉగ్రవాదులు పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్చి చంపారని బాధితులు చెప్పినట్లు పలు మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడఇక్కడ). రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు (ఇక్కడఇక్కడ).

పహల్గామ్ దాడి తర్వాత, తీవ్రవాదులకు పాకిస్థాన్ మద్దతు ఇస్తోందని భావించిన భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై పలు ఆంక్షలు విధించింది. భారతదేశం 1960 సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది, పాకిస్తాన్ సైనిక సలహాదారులను న్యూఢిల్లీ నుండి బహిష్కరించింది, ఇస్లామాబాద్ నుండి తన సొంత సైనిక సలహాదారులను ఉపసంహరించుకుంది. భారత ప్రభుత్వం అన్ని పాకిస్థాన్ సరిహద్దు క్రాసింగ్‌లను మూసివేసింది. పాకిస్తాన్ పౌరులకు వీసాలపై ఆంక్షలను విధించింది, వారిని 48 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అలాగే, భారత పౌరులను వెంటనే పాకిస్తాన్ నుండి తిరిగి రావాలని సూచించింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ నుండి పాక్ సైనిక, నావికాదళ, వైమానిక సలహాదారులను కూడా భారత్ బహిష్కరించింది. దీనికి ప్రతిస్పందిస్తూ, పాకిస్తాన్ భారతదేశంతో వాణిజ్యాన్ని నిలిపివేసింది. భారత విమానాలకు తన గగనతలాన్ని మూసివేసింది, భారత దౌత్యవేత్తలను బహిష్కరించింది.

ఈ నేపథ్యంలో, “హైదరాబాద్‌లో పాకిస్తానీయుల కోసం పోలీసులు వెతుకుతున్నప్పుడు, స్థానిక ముస్లింల సహాయంతో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలు పట్టుబడ్డారు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టుకు మద్దతుగా, పోలీసులు పెద్ద సంఖ్యలో ప్రజలను అదుపులోకి తీసుకున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల ఏప్రిల్ 2025లో, పోలీసులు హైదరాబాద్‌లో పాకిస్తానీయుల కోసం వెతుకుతుండగా, హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ రోహింగ్యా ముస్లింలు పట్టుబడ్డారు. అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో హైదరాబాద్‌కు సంబంధించింది కాదు. ఈ వైరల్ వీడియో భారతదేశంలో అక్రమంగా ఉంటున్న 550 మందికి పైగా బంగ్లాదేశ్ వలసదారులను 26 ఏప్రిల్ 2025న గుజరాత్ పోలీసులు అరెస్టు చేసిన దృశ్యాలను చూపిస్తుంది. రిపోర్ట్స్ ప్రకారం, పాకిస్థాన్ పౌరులు 48 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం 23 ఏప్రిల్ 2025న ఆదేశించిన నేపథ్యంలో, 26 ఏప్రిల్ 2025న, గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో తనిఖీలు చేయగా, నకిలీ పత్రాలతో భారతదేశంలో అక్రమంగా ఉంటున్న 550 మందికి పైగా బంగ్లాదేశ్ వలసదారులు గుజరాత్ పోలీసులకు పట్టుబడ్డారు. అలాగే, ఏప్రిల్ 2025లో హైదరాబాద్‌లో పలువురు అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు పట్టుబడ్డారని పలు వార్త కథనాలు రిపోర్ట్ చేశాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోను తెలుగు మీడియా సంస్థ ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’ వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 26 ఏప్రిల్ 2025న షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణ ప్రకారం, వైరల్ వీడియో అహ్మదాబాద్‌లో 400 మందికి పైగా అక్రమ వలసదారులను పోలీసులు అరెస్టు చేసిన దృశ్యాలను చూపిస్తుంది. దీన్ని బట్టి వైరల్ వీడియో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కి సంబంధించినది మనం నిర్ధారించవచ్చు.

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, పహల్గామ్ దాడి తర్వాత, పాకిస్థాన్ పౌరులు 48 గంటల్లోపు భారతదేశం విడిచి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం 23 ఏప్రిల్ 2025న ఆదేశించిన నేపథ్యంలో, 26 ఏప్రిల్ 2025న, గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్, సూరత్ నగరాల్లో  తనిఖీలు చేయగా, నకిలీ పత్రాలతో భారతదేశంలో అక్రమంగా ఉంటున్న 550 మందికి పైగా బంగ్లాదేశ్ వలసదారులు గుజరాత్ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వార్త కథనాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా ఇటీవల ఏప్రిల్ 2025లో హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశ్ వలసదారులు పట్టుబడ్డారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికగా, ఏప్రిల్ 2025లో హైదరాబాద్‌లో పలువురు అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు పట్టుబడ్డారని పలు వార్త కథనాలు రిపోర్ట్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ).

చివరగా, ఈ వైరల్ వీడియో భారతదేశంలో అక్రమంగా ఉంటున్న 550 మందికి పైగా బంగ్లాదేశ్ వలసదారులను 26 ఏప్రిల్ 2025న గుజరాత్ పోలీసులు అరెస్టు చేసిన దృశ్యాలను చూపిస్తుంది.

Share.

About Author

Comments are closed.

scroll