జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ 13 అక్టోబర్ 2025న ప్రారంభమైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు అభ్యర్థులు నామినేషన్‌లు దాఖలు చేయడానికి చివరి తేదీ 21 అక్టోబర్ 2025 కాగా, నామినేషన్ల పరిశీలన 22 అక్టోబర్ 2025న చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 24 అక్టోబర్ 2025గా ఉంది. 11 నవంబర్ 2025న పోలింగ్ జరగనుండగా, 14 నవంబర్ 2025న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటర్ల జాబితాలో సినీ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లు ఓటర్లుగా నమోదు చేయబడ్డారు” అంటూ ఓటర్ల జాబితా ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటర్ల జాబితాలో సినీ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఓటర్లుగా నమోదు చేయబడ్డారు.
ఫాక్ట్(నిజం): వైరల్ అవుతున్న ఈ ఓటర్ల జాబితా ఫేక్. 2025 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటర్ల జాబితాలో సినీ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ ఓటర్లుగా నమోదు చేయబడలేదు. ఈ నకిలీ జాబితా వైరల్ కావడంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు 16 అక్టోబర్ 2025న కేసు నమోదు చేశారు. ఇలాంటి నకిలీ కార్డులను ముద్రించి ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా వైరల్ అవుతున్న ఓటర్ల జాబితాను మనం జాగ్రతగా పరిశీలిస్తే, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్ పేరిట ఒకటే ఓటర్ కార్డ్ నంబర్ (EPIC No) – WKH4450729 ఉండటం మనం గమనించవచ్చు. ఈ ఓటరు కార్డు నంబర్‌కు సంబంధించిన వివరాల కోసం ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో వెతకగా, ఎటువంటి వివరాలు లభించలేదు.

తదుపరి సినీ హీరోయిన్ సమంత పేరిట ఉన్న ఓటరు కార్డు నంబర్(EPIC No) – WKH4450946 కు సంబంధించిన వివరాల కోసం ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో వెతకగా, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓటరుగా నమోదైన రొక్కం శ్రీనివాస్‌కు చెందినదని తెలిసింది.

ఈ ఓటరు కార్డులు వైరల్ కావడంతో అది అధికారుల దృష్టికి వెళ్ళింది. వాటిని పరిశీలించిన ఎన్నికల అధికారులు ఆయా కార్డులు నకిలీవంటూ తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, సర్కిల్–19 ఉప కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి కార్డులు ముద్రించి ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు (ఇక్కడ & ఇక్కడ).
దీనిపై జూబ్లీహిల్స్ నియోజకవర్గ అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ సయ్యద్ యాహియా కమాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు 16 అక్టోబర్ 2025న కేసు నమోదు చేశారు. అందుకు సంబంధించిన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.
అంతేకాకుండా, ఈ వైరల్ జాబితాలో కనిపించే ఇంటి నంబర్ 8-2-120/110/4 నంది హిల్స్‌లోని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇంటి నంబర్ అని వైరల్ పోస్ట్‌లు పేర్కొంటున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం, నందినగర్‌లోని ఆయన ఇంటి నంబర్ 8-2-120/110/1/3. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఇంటి నంబర్ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.

చివరగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓటర్ల జాబితాలో సినీ హీరోయిన్లు తమన్నా, సమంత, రకుల్ ప్రీత్ ఓటర్లుగా నమోదు చేయబడ్డారు అంటూ వైరల్ అవుతున్న జాబితా ఫేక్.