YSR కాంగ్రెస్ పార్టీ (YSRCP) చిహ్నాన్ని (ఎన్నికల గుర్తు) మార్చాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని అంటూ ఓ లేఖతో కూడిన పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ లేఖలో పార్టీకి ప్రస్తుతం ఉన్న ‘ఫ్యాన్’ గుర్తు స్థానంలో గొడ్డలి గుర్తును కేటాయించాలని తాను ఏకగ్రీవంగా నిర్ణయించానని పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ పేర్కొనట్లు ఉంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: YSR కాంగ్రెస్ పార్టీకి (YSRCP) ప్రస్తుతం ఉన్న ‘ఫ్యాన్’ గుర్తు స్థానంలో గొడ్డలి గుర్తును కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
ఫాక్ట్(నిజం): YSR కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఎన్నికల గుర్తును గొడ్డలి గుర్తుకు మార్చాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఈ వైరల్ లేఖ ఫేక్. వాస్తవంగా, YSR కాంగ్రెస్ పార్టీని (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) కొలిశెట్టి శివకుమార్ స్థాపించి ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించారు. అయితే, తర్వాత శివకుమార్ YSRCP భాద్యతలను పూర్తిగా వై.ఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పగించారు. Factlyతో మాట్లాడుతూ, శివకుమార్ తాను కొత్తగా యుగ తులసి పార్టీని స్థాపించానని, ప్రస్తుతం తనకు YSRCPతో ఎలాంటి సంబంధం లేదని, ఇలాంటి లేఖ ఏది తాను ఎన్నికల సంఘానికి రాయలేదని, ఈ వైరల్ లేఖ ఫేక్ అని చెప్పారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా ఈ వైరల్ క్లెయింకు సంబంధించిన వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, YSR కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న ‘ఫ్యాన్’ గుర్తు స్థానంలో గొడ్డలి గుర్తును కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ వార్తా కథనాలు మాకు లభించలేదు.
వాస్తవంగా, YSR కాంగ్రెస్ పార్టీని (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) కొలిశెట్టి శివకుమార్ అనే వ్యక్తి స్థాపించి ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ చేయించారు. అయితే, తరువాత శివకుమార్ YSRCP బాధ్యతలను పూర్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అప్పగించారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

అయితే, శివకుమార్ 2022లో కొత్తగా యుగ తులసి పార్టీని స్థాపించి, 2022 మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికలో, 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో, 2024 సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్, వారణాసి పార్లమెంటరీ స్థానాల నుండి యుగ తులసి పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు.


ఇదే విషయమై మేము కొలిశెట్టి శివకుమార్ సంప్రదించగా, Factlyతో మాట్లాడుతూ, శివకుమార్ తాను కొత్తగా యుగ తులసి పార్టీని స్థాపించానని, తాను YSR కాంగ్రెస్ పార్టీని (యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ) వ్యవస్థాపకుడిని అని, కానీ తరువాత పార్టీ బాధ్యతలను పూర్తిగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి అప్పగించానని, ప్రస్తుతం తనకు YSRCPతో ఎలాంటి సంబంధం లేదని, తాను కొత్తగా యుగ తులసి పార్టీని స్థాపించానని, అలాగే ఇలాంటి లేఖ ఏది తాను ఎన్నికల సంఘానికి రాయలేదని, ఈ వైరల్ లేఖ ఫేక్ అని చెప్పారు. ఈ వైరల్ లేఖపై స్పందిస్తూ ఆయన విడుదల చేసిన పత్రికా ప్రకటన కాపీని మాకు షేర్ చేశారు.

YSRCP సోషల్ మీడియా విభాగం వారి అధికారిక X(ట్విట్టర్) హ్యాండిల్ ఈ వైరల్ లేఖ ఫేక్ అని పేర్కొంటూ పోస్టు చేసింది.
The Election Symbols (Reservation & Allotment) Order, 1968 ప్రకారం, కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ఎన్నికల గుర్తులను (చిహ్నాలు) కేటాయిస్తుంది.

చివరగా, YSR కాంగ్రెస్ పార్టీ యొక్క ఎన్నికల గుర్తును గొడ్డలి గుర్తుకు మార్చాలని కోరుతూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు శివకుమార్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు.