Fake News, Telugu
 

యువరాజ్ సింగ్ పంజాబ్ వరదల వల్ల ప్రభావితమైన రైతుల కుటుంబాలకు ₹42 కోట్ల విలువైన 600 ట్రాక్టర్లను విరాళంగా ఇచ్చాడనే వాదనలో నిజం లేదు

0

ఆగస్టు 2025లో పంజాబ్ వరదల వల్ల ప్రభావితమైన రైతుల కుటుంబాలకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ₹42 కోట్ల విలువైన 600 ట్రాక్టర్లను విరాళంగా ఇచ్చారని పేర్కొంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆగస్టు 2025లో పంజాబ్ వరదల వల్ల నష్టపోయిన రైతుల కుటుంబాలకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ₹42 కోట్ల విలువైన 600 ట్రాక్టర్లను విరాళంగా ఇచ్చాడు. 

ఫాక్ట్(నిజం): భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆగస్టు 2025లో పంజాబ్ వరదల్లో ప్రభావితమైన రైతుల కుటుంబాలకు ₹42 కోట్ల విలువైన 600 ట్రాక్టర్లను విరాళంగా ఇచ్చాడనే వాదనలో నిజం లేదు. యువరాజ్ సింగ్ 600 ట్రాక్టర్లను విరాళంగా ఇచ్చినట్లు కానీ, ఇవ్వనున్నట్లు కానీ ఎటువంటి  విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. యువరాజ్ సింగ్ యొక్క YouWeCan ఫౌండేషన్, Factly తో మాట్లాడుతూ, ఈ వార్తలో నిజం లేదని, అతను ఇలాంటి విరాళం ఇవ్వలేదని స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పంజాబ్ వరదల వల్ల ప్రభావితమైన రైతుల కుటుంబాలకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ₹42 కోట్ల విలువైన 600 ట్రాక్టర్లను విరాళంగా ఇచ్చారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వైరల్ క్లెయింను సమర్థించే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ మాకు లభించలేదు.

తదుపరి మేము యువరాజ్ సింగ్ (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), అతని YouWeCan ఫౌండేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌, సోషల్ మీడియా హ్యాండిల్స్ పరిశీలించాము (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). అక్కడ కూడా యువరాజ్ సింగ్ ఇలాంటి విరాళం ఇచ్చినట్లు ఎటువంటి సమాచారం లభించలేదు. యువరాజ్ సింగ్ 01 సెప్టెంబర్ 2025న చేసిన ఒక పోస్ట్‌లో పంజాబ్ వరదలపై విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు మద్దతు తెలిపాడు. అయితే 600 ట్రాక్టర్ల విరాళం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.

ఈ విషయంపై మేము YouWeCan ఫౌండేషన్‌ను సంప్రదించినప్పుడు, వైరల్ అవుతున్న వాదన అబద్ధమని, యువరాజ్ సింగ్ అలాంటి విరాళం ఇవ్వలేదని వారు Factlyకి తెలిపారు.

పంజాబ్ వరద బాధితులకు సోనూ సూద్, రణదీప్ హుడా, కపిల్ శర్మ, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, దిల్జిత్ దోసాంజ్, అమ్మీ విర్క్, సోనమ్ బజ్వా, గురుదాస్ మాన్, విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్, కరణ్ ఔజ్లా, గిప్పీ గ్రెవాల్  వంటి పలువురు సెలబ్రిటీస్ సహాయం చేశారని పలు వార్త కథనాలు (ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ, & ఇక్కడ) పేర్కొన్నాయి. 

చివరిగా, యువరాజ్ సింగ్ పంజాబ్ వరదల వల్ల ప్రభావితమైన రైతుల కుటుంబాలకు ₹42 కోట్ల విలువైన 600 ట్రాక్టర్లను విరాళంగా ఇచ్చాడనే వాదనలో నిజం లేదు.

Share.

About Author

Comments are closed.

scroll