Deepfake, Fake News, Telugu
 

ఓ గున్న ఏనుగు రోడ్డుపై ఉన్న చెత్తను పక్కనే ఉన్న చెత్త డబ్బాలో వేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న ఈ వీడియో AI ఉపయోగించి రూపొందించబడింది

0

ఓ గున్న ఏనుగు తల్లి ఏనుగుతో వెళ్తుడంగా రోడ్డుపై ఉన్న చెత్తను/ఖాళీ కూల్ డ్రింక్ డబ్బాను తన తొండంతో తీసుకొని పక్కనే ఉన్న చెత్త డబ్బాలో వేస్తున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఇది నిజమైన ఘటనగా పలువురు యూజర్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈనాడు దినపత్రిక కూడా ఈ వీడియో నిజమైన ఘటనను చూపిస్తున్నట్లుగా కథనం ప్రచురించింది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఓ గున్న ఏనుగు ఉన్న చెత్తను/ఖాళీ కూల్ డ్రింక్ డబ్బాను తన తొండంతో తీసుకొని పక్కనే ఉన్న చెత్త డబ్బాలో వేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో నిజమైన సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోను జాగ్రతగా పరిశీలిస్తే, ఇందులో పలు తప్పిదాలు/ అసమానతలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ వీడియోలో కనిపిస్తున్న మనుషుల/వ్యక్తుల యొక్క కదలికలు అసహజంగా ఉండటం మనం చూడవచ్చు. గున్న ఏనుగు చెత్తను/ఖాళీ కూల్ డ్రింక్ డబ్బాను చెత్త డబ్బాలో వేస్తున్నప్పుడు ఆ కూల్ డ్రింక్ డబ్బా ఆకారం అసహజంగా మారిపోవడం, అలాగే చెత్త డబ్బాపై ఉన్న ‘USE ME’ అనే అక్షరాలు తర్వాత ‘NBE ME’ గా మారడం మనం చూడవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి సృష్టించబడిన దృశ్యాలలో ఇటువంటి లోపాలు సహజంగానే ఉంటాయి (ఇక్కడఇక్కడ). దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించి ఉండవచ్చని తెలుస్తోంది.

తదుపరి ఈ వైరల్ వీడియో AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వైరల్ వీడియోను పరిశీలించగా, ఈ వీడియో 99.4% AI- జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, ఓ గున్న ఏనుగు రోడ్డుపై ఉన్న చెత్తను పక్కనే ఉన్న చెత్త డబ్బాలో వేస్తున్న దృశ్యాలు అంటూ AI ఉపయోగించి తయారు చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.

 

Share.

About Author

Comments are closed.

scroll