Deepfake, Fake News, Telugu
 

చంద్రపూర్ జిల్లాలోని బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తిపై పులి దాడి చేసి చంపింది అంటూ AI ద్వారా రూపొందించిన వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు

0

“మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన చంద్రాపూర్ జిల్లాలో జరిగిన ఘోర సంఘటన ఇది రైతుపై పులి దాడి ..చనిపోయిన రైతు” అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఇదే వీడియోను “బ్రహ్మపురి ఫారెస్ట్ గెస్ట్ హౌజ్, చంద్రాపూర్ జిల్లా మహారాష్ట్ర ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పై దాడి చేసి నోట కరుచుకొని ఎత్తుకెళ్లిన పులి” అని కూడా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో, ఒక ఇంటి ముందు కూర్చున్న వ్యక్తిపై పులి దాడి చేసి, అతన్ని ఈడ్చుకుంటూ వెళ్ళడాన్ని మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరొక పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 31 అక్టోబర్ 2025న, చంద్రపూర్ జిల్లాలోని బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తిపై పులి దాడి చేసి చంపిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఇటీవల అక్టోబర్/నవంబర్ 2025లో చంద్రపూర్ జిల్లాలోని బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తిపై పులి దాడి చేసి చంపినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. అలాగే, చంద్రపూర్ జిల్లా అటవీ అధికారులు కూడా తమ పరిధిలోని బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగలేదని, వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని, ఇది AI ద్వారా సృష్టించబడిందని స్పష్టం చేశారు. అంతేకాకుండా, పలు AI- జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా ఈ వైరల్ వీడియో AI ద్వారా సృష్టించబడిందని నిర్ధారించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా, వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా ఇటీవల నవంబర్ 2025లో చంద్రపూర్ జిల్లాలోని బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తిపై పులి దాడి చేసి చంపిదా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/ఆధారలు లభించలేదు.

అలాగే, చంద్రపూర్ జిల్లాలోని బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఇలాంటి సంఘటన ఏదైనా జరిగిందా అని తెలుసుకోవడానికి, చంద్రపూర్‌లోని, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (చంద్రపూర్ సర్కిల్‌) కార్యాలయాన్ని మేము (Factly) సంప్రదించగా, వారి పరిధిలోని బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరగలేదని, వైరల్ అవుతున్న వీడియో ఫేక్ అని, ఇది AI ద్వారా సృష్టించబడిందని స్పష్టం చేశారు. 07 నవంబర్ 2025న, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (చంద్రపూర్ సర్కిల్) కార్యాలయం ఇదే విషయాన్ని తెలుపుతూ ఒక మీడియా ప్రకటన కూడా విడుదల చేసింది.

అంతేకాకుండా, 07 నవంబర్ 2025న, భారత ప్రభుత్వ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) మహారాష్ట్ర విభాగం కూడా X (ట్విట్టర్)లో, మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో ఇలాంటి సంఘటన జరగలేదని, ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని స్పష్టం చేసింది.

ఈ వైరల్ వీడియోను మనం జాగ్రతగా పరిశీలిస్తే, ఈ వీడియోలోని దృశ్యాలు అసహజంగా ఉండటం కూడా మనం గమనించవచ్చు. తదుపరి ఈ వైరల్ వీడియో నిజంగా AI- ఉపయోగించి తయారు చేసిందా? లేదా? అని నిర్ధారించడానికి, Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ ఉపయోగించి ఈ వైరల్ వీడియోను పరిశీలించగా, ఈ వీడియో 94% AI- జనరేటెడ్ కావచ్చని Hive ఫలితాన్ని ఇచ్చింది. దీన్ని బట్టి ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని మనం నిర్ధారించవచ్చు.

చివరగా, చంద్రపూర్ జిల్లాలోని బ్రహ్మపురి అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తిపై పులి దాడి చేసి చంపింది అంటూ షేర్ అవుతున్న ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడింది.

Share.

About Author

Comments are closed.

scroll