Fake News, Telugu
 

01 ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి వచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే రూపొందించబడిన పథకం

0

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏకీకృత పెన్షన్ పథకం (యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్, UPS) ద్వారా 60 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ. 10,000 పెన్షన్ లభిస్తుందని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కింద, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రతి నెలా రూ. 10,000 పెన్షన్ లభిస్తుంది.

ఫాక్ట్(నిజం): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కింద, 60 ఏళ్లు పైబడిన అందరికి ప్రతి నెలా రూ. 10,000 పెన్షన్ లభించదు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే రూపొందించబడిన పథకం. ఈ పథకం 01 ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి వచ్చింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) అనేది జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద తీసుకొచ్చిన ఒక కొత్త పెన్షన్ విధానం. ఇది NPS లో భాగంగా ఉండే కొత్త ఆప్షన్. ఉద్యోగులు NPS నుంచి UPS కి మారవచ్చు. UPS ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత గ్యారంటీగా నెలనెలా ఖచ్చితమైన మొత్తంలో పెన్షన్ లభిస్తుంది. ఇది ఫిక్స్‌డ్ పెన్షన్ సిస్టమ్, అంటే చివరి జీతంపై ఆధారపడి ప్రతి నెల గ్యారంటీగా పెన్షన్ వస్తుంది. UPS పథకం కింద కనీసం పదేళ్లు ఉద్యోగం చేసిన వారు నెలకు కనీసం రూ. 10,000 పెన్షన్ పొందవచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) కింద, 60 ఏళ్లు పైబడిన అందరికి ప్రతి నెలా రూ. 10,000 పెన్షన్ లభించదు.

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) అనేది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే రూపొందించబడిన పథకం. ఈ పథకం 01 ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి వచ్చింది. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) అనేది జాతీయ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద తీసుకొచ్చిన ఒక కొత్త పెన్షన్ విధానం, దీనిని పాత పెన్షన్ పథకం (OPS), జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) రెండింటి ప్రయోజనాలను కలిపి తయారుచేశారు. ఇప్పటికే అమలు అవుతున్న న్యూ పెన్షన్ స్కీమ్‌ (NPS)లో ఉండాలా లేక కొత్తగా వచ్చిన యూనిఫైడ్ పెన్షన్‌ స్కీమ్‌ (UPS)లో చేరాలా అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే ఎంచుకోవచ్చు. 2004లో NPS అమలులోకి వచ్చినప్పటి నుంచి UPS అమలులోకి వచ్చే ఒక రోజు ముందు వరకు అంటే 31 మార్చి 2025 వరకు పదవీ విరమణ పొందిన వారికి, పొందబోయే వారికి కూడా యూపీఎస్ వర్తిస్తుంది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు UPS ఎంపిక చేసుకోకుండా NPSలో కూడా కొనసాగవచ్చు. UPS కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

NPS కు, UPS కు మధ్య తేడా: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న NPS కింద ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత కచ్చితంగా ఇంత మొత్తం పెన్షన్ అందుతుందనే గ్యారెంటీ లేదు. ఉద్యోగి తన సర్వీసులో పెన్షన్ కోసం అందించిన కంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టి, దానిపై వచ్చే లాభాలపై వారి పెన్షన్లు ఆధారపడి ఉంటాయి. అయితే కొత్తగా తీసుకువచ్చిన UPS విధానంలో మాత్రం ఖచ్చితమైన మొత్తంలో పెన్షన్ అందుతుంది.

యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) లోని ప్రధానాంశాలు:

కచ్చితమైన పెన్షన్‌: కనీసం 25 ఏళ్ల సర్వీసు ఉన్న ఉద్యోగులు కచ్చితమైన పెన్షన్‌కు అర్హులు అవుతారని కేంద్రం వెల్లడించింది. ఇలాంటి ఉద్యోగులు పదవీ విరమణ చేయడానికి ముందు 12 నెలల పాటు అందుకున్న బేసిక్‌ పే సగటులో 50 శాతం జీతాన్ని ప్రతి నెల పెన్షన్ రూపంలో కచ్చితంగా అందుకుంటారు. కనీసం 10 ఏళ్ల పైన.. 25 ఏళ్ల లోపు ఉన్న ఉద్యోగులకు పదవీ విరమణ పొందిన వారికి వారి సర్వీసుకు తగ్గట్టుగా పెన్షన్ వస్తుంది.

కచ్చితమైన కుటుంబ పెన్షన్‌: ఏదైనా అనుకోని ప్రమాదంలో ఒకవేళ ఉద్యోగి మరణించినట్లయితే వారి భాగస్వాములకు పెన్షన్ అందుతుంది. ఆ ఉద్యోగి చనిపోయే నాటికి అందుకుంటున్న జీతంలో 60 శాతం కచ్చితమైన సొమ్మును ఉద్యోగి కుటుంబానికి పెన్షన్‌గా అందిస్తారు.

కచ్చితమైన కనీస పెన్షన్: కనీసం 10 ఏళ్ల పాటు సర్వీసులో ఉండి రిటైర్‌ అయిన ఉద్యోగులకు కనిష్టంగా రూ.10 వేలు కచ్చితంగా పెన్షన్ అందుతుంది.

ద్రవ్యోల్బణ ఇండెక్సేషన్‌ (Inflation indexation): కచ్చితమైన పెన్షన్, కచ్చితమైన కుటుంబ పెన్షన్, కచ్చితమైన కనీస పెన్షన్‌పై ఇండెక్సేషన్‌ ప్రయోజనం ఉంటుంది. ఇది డియర్‌నెస్‌ రిలీఫ్‌ ఆల్‌ ఇండియా కన్జూమర్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ వర్కర్స్‌(AICPI-IW)పై ఆధారపడి ఉంటుంది

పదవీ విరమణ వేళ: UPS విధానంలో గ్రాట్యూటీకి అదనంగా పదవీవిరమణ సమయంలో ఉద్యోగులకు కొంత మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రతి 6 నెలల సర్వీసు పూర్తిపై నెల వేతనం(బేసిక్ పే + డీఏ)లో 10వ వంతును లెక్కగట్టి దీన్ని అందిస్తారు. ఈ చెల్లింపు కచ్చితమైన పింఛన్‌ మొత్తాన్ని తగ్గించదు.

చివరగా, 01 ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి వచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం మాత్రమే రూపొందించబడిన పథకం.

Share.

About Author

Comments are closed.

scroll