‘దేవాలయాలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసిందని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తకి సంబంధించి నిజమెంటో చూద్దాం.
క్లెయిమ్: ‘దేవాలయాలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదు’ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు.
ఫాక్ట్(నిజం): APCOS ద్వారా దేవాదాయ శాఖలో కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, దేవాలయాల్లో నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పూర్తిగా అమలుచేయడం వల్ల ఇతర మతాలు ఆచరించే వారు నియామకం అయ్యే అవకాశం ఉండడంతో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ని పూర్తిగా కాకుండా పాక్షికంగా అమలు చేయాలనీ తీర్పు చెప్పింది. అంటే దేవాలయాల్లో నియామకాల సందర్భంలో కేవలం హిందూ మతాన్ని ఆచరించే వారికీ మాత్రమే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలవుతుంది. ఐతే కోర్టు ఇచ్చిన ఈ తీర్పును దేవాలయాలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదని తప్పుగా అర్ధం చేసుకొని ప్రచారం చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీ.ఓ మరియు సర్కులర్ :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాలు/సంస్థల అవసరాలకు అనుగుణంగా కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలను చేపట్టేందుకు 2019లో జీ.ఓ. Ms.No.136 ద్వారా ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ (APCOS) పేరుతో ఒక ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది.
ఈ జీ.ఓ అనుసరిస్తూ, సెక్రటేరియట్ డిపార్ట్‌మెంట్‌లు, ఎయిడెడ్ సంస్థలు, స్వయం ప్రతిపత్తి గల సంస్థలు, సెమీ అటానమస్ బాడీలు, మొదలైన అన్ని సంస్థలు తమ కార్యాలయాల్లోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను APCOSకు అనుసందించాలని కోరుతూ ప్రభుత్వం ఒక సర్కులర్ జారీ చేసింది.
పైన తెలిపిన జీ.ఓ మరియు సర్కులర్‌కు అనుగుణంగా ఇక నుండి దేవాదాయ శాఖలో కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలన్నీ APCOS ద్వారా జరగాలని ఆదేశిస్తూ విజయవాడ దేవాదాయ శాఖ కమీషనర్ ఒక సర్కులర్ జారీ చేసారు.
ప్రభుత్వ సర్కులర్‌కు వ్యతిరకంగా కోర్టులో పిటిషన్ :
ఐతే విజయవాడ దేవాదాయ శాఖ కమీషనర్ జారీ చేసిన సర్కులర్‌ను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేసాడు. Andhra Pradesh Charitable and Hindu Religious Institutions and Endowments Act, 1987లోని సెక్షన్ 13, 23 & 35 మరియు ఈ చట్టానికి సంబంధించిన రూల్స్ ప్రకారం హిందూ దేవాలయాల్లో కేవలం హిందూ మతం ఆచరిస్తున్న వారిని మాత్రమే నియమించాలన్న నిబంధనకు వ్యతిరేకంగా ప్రభుత్వ జీ.ఓ మరియు సర్కులర్ ఉందని పేర్కొంటూ పిటిషన్ దాఖలు చేసాడు.
ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ మరియు సర్కులర్ అమలు చేస్తే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా కేవలం హిందూ మతం వారే కాకుండా ఇతర మతాలకు చెందిన వారిని, మైనారిటీలను కూడా హిందూ దేవాలయాలలో ఉద్యోగులుగా నియమించాల్సి వస్తుందని, అది పైన తెలిపిన చట్టానికి వ్యతిరేకం అని పిటిషన్‌లో పేర్కొన్నాడు.
అసలు దేవాలయాలు ప్రభుత్వ సంస్థలు కావని, ప్రభుత్వం కేవలం ఆలయాల ధర్మకర్త(ట్రస్టీ) మాత్రమేనని, కాబట్టి కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ మరియు సర్కులర్ దేవాలయాలకు వర్తించవని పిటిషన్‌లో వాదించాడు.
ఐతే ఈ పిటిషన్‌కు బదులుగా విజయవాడ దేవాదాయ శాఖ కమీషనర్ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసారు. దేవాలయాల్లో నియామకాల సందర్భంలో కేవలం హిందూ మతం ఆచరించే వారికి మాత్రమే రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుందని ఈ అఫిడవిట్ ద్వారా స్పష్టం చేసారు.
కోర్టు తీర్పు:
ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు దేవాలయాలు ప్రభుత్వ సంస్థలు కావని పిటిషనర్ చేసిన వాదనతో ఏకీభవిస్తూ, కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ మరియు సర్కులర్లు ప్రభుత్వ సంస్థలకే వర్తిస్తాయని, దేవాలయాలు ప్రభుత్వ సంస్థలు కానందున దేవాలయాల్లో కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ నియామకాలు APCOS పరిధిలోకి రావని స్పష్టం చేసింది.
రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కి సంబంధించి, హిందూ మతంలోని కొన్ని వర్గాల వారు ఇతర మతాల్లోకి మారినప్పటికీ వారిని BCల కిందే గుర్తించే అవకాశం ఉండడంతో (అలాగే కొందరు హిందూ ఏతర వారిని BC-E కింద గుర్తిస్తారని), అలాంటప్పుడు నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అములు చేసినప్పుడు హిందూ మతం కాకుండా ఇతర మతాలను ఆచరించే వారు నియామకం అయ్యే అవకాశం ఉన్నందున, దేవాలయాల్లో నియామకాలకు సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ని పూర్తిగా అమలు చేయలేమని కోర్టు పేర్కొంది.
ఐతే కోర్టు రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ని పూర్తిగా కొట్టేయలేదు. దేవాదాయ శాఖ కమీషనర్ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్‌లో చెప్పినట్టు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాక్షికంగా అమలవుతుందని పేర్కొంది. అంటే దేవాలయాల్లో నియామకాల సందర్భంలో కేవలం హిందూ మతాన్ని ఆచరించే వారికీ మాత్రమే రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ని అమలవుతుంది.
దేవాలయాల్లో నియామకాలు ఇతర సంస్థలతో చేపట్టినప్పుడు కూడా పైన చెప్పినట్టు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాక్షికంగా అమలవుతుందని, ఒకవేళ సమాజంలోని అణగారిన వర్గాలు హిందూ మతాన్ని ఆచరిస్తూ ఉంటే వీరికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తిస్తుందని కూడా కోర్టు స్పష్టం చేసింది.
ఐతే దేవాలయాల్లో నియామకాల సమయంలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ని పాక్షికంగా అమలు చేయాలనీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని దేవాలయాలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించదని తప్పుగా అర్ధం చేసుకున్నారు. పోస్టులో చేస్తున్న క్లెయిమ్ కూడా ఇలా కోర్టు తీర్పును తప్పుగా అర్ధం చేసుకోవడం వల్లే.
చివరగా, దేవాలయాల్లో నియామకాలకు రూల్ అఫ్ రిజర్వేషన్ వర్తిస్తుంది, కాకపోతే పూర్తిగా కాదు.