Fake News, Telugu
 

ఇటీవల పంజాబ్‌లో జరిగిన యువతి హత్య సంఘటనను తప్పుడు మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు

0

నీలం అనే హిందూ యువతి తన తల్లిదండ్రులతో గొడవ పడి, మహమ్మద్ ఆమీద్ అనే ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకుందని, పెళ్లైన ఐదు నెలలకే మహమ్మద్ ఆమీద్ ఆమెను హత్య చేసి, శవాన్ని ఒక కాలువలో పడేశాడని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మహమ్మద్ ఆమీద్ అనే ముస్లిం వ్యక్తి నీలం అనే హిందూ యువతిని పెళ్లైన ఐదు నెలలకే హత్య చేసి, శవాన్ని ఒక కాలువలో పడేశాడు.

ఫాక్ట్(నిజం): ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదు. FIR కాపీ ప్రకారం, బాధితురాలి పేరు నిషా సోనీ, నిందితుడి పేరు యువరాజ్ సింగ్ S/O  కర్నైల్ సింగ్. వార్తా కథనాల ప్రకారం, నిషా భాయ్‌ఫ్రెండ్ ఆమెను 20 జనవరి 2025న భాక్రా కాలువపై ఉన్న బ్రిడ్జికి తీసుకెళ్లి, నీటిలో తోసాడు. తర్వాత 22 జనవరి 2025న పసియానా బ్రిడ్జి సమీపంలో ఆమె శవం కనుగొనబడింది. రోపార్ పోలీసులు 23 జనవరి 2025న నిందితుడిని అరెస్టు చేసి ఐదు రోజుల రిమాండ్‌కు తరలించారు. భగవంత్‌పురా పోలీసు అధికారులు కూడా నిందితుడు సిక్కు మతానికి చెందినవాడని ధృవీకరించారు, దీంట్లో ఎలాంటి మతపరమైన లేదని స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ పోస్టులో ఉన్న ఫోటో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ దృశ్యాలను రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు (ఇక్కడ , ఇక్కడ , ఇక్కడ ) (ఆర్కైవ్ లింక్ ఇక్కడ, ఇక్కడ , ఇక్కడ ) మాకు లభించాయి. ఈ కథనాల ప్రకారం, చండీగఢ్‌లో ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ తీసుకుంటున్న హిమాచల్ ప్రదేశ్‌ జోగిందర్ నగర్‌కు చెందిన నిశా సోని అనే  యువతి, ఆమె బాయ్‌ఫ్రెండ్ యువరాజ్ సింగ్ చేతిలో హత్యకు గురైనట్లు తెలిసింది. యువరాజ్ సింగ్, పంజాబ్ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో పని చేస్తున్నాడని, నిశా సోని శవాన్ని పటియాలా భాక్రా కాలువలో పడేసినట్లు ఈ కథనాలు పేర్కొన్నాయి. 23 జనవరి 2025న రోపార్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, మోహాలి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితుడిని ఐదు రోజుల రిమాండ్‌లో పంపించింది.

ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, 23 జనవరి 2025న న్యూస్18 పంజాబ్ యూట్యూబ్ ఛానెల్‌లో DSP రాజ్‌పాల్ సింగ్ గిల్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ (ఆర్కైవ్ లింక్ ) వీడియో కనుగొన్నాము. మీడియాతో DSP రాజ్‌పాల్ సింగ్ గిల్ మాట్లాడుతూ, “నిషా సోని 20 జనవరి 2025న కనిపించకుండా పోయింది, ఆ తర్వాత ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోదరి ప్రకారం, నిషా యువరాజ్ సింగ్‌ను కలవడానికి వెళ్లింది, కానీ ఆమెను సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ సంప్రదించలేకపోయామని తెలిపింది. అంతేకాకుండా, యువరాజ్ నిషా వీడియోలను వైరల్ చేస్తానని నిషాను బెదిరిస్తున్నాడని సోదరి పోలీసులకు తెలిపారు. 20 జనవరి 2025న యూవరాజ్ నిశాను భాక్రా కాలువపై ఉన్న బ్రిడ్జికి తీసుకెళ్లి, నీటిలో తోసేశాడని. ఆ తర్వాత 22 జనవరి 2025న పసియానా బ్రిడ్జి సమీపంలో ఆమె శవం కనుగొనబడింది. ఈ నేపథ్యంలో, యూవరాజ్ పై హత్య కేసు నమోదైంది” అని చెప్పారు.

మేము ఈ కేసుకు సంబంధించిన FIR కాపీని కనుగొన్నాము. FIR ప్రకారం, ఈ ఘటనలో నిందితుడి పేరు యువరాజ్ సింగ్ S/O  కర్నైల్ సింగ్. తదుపరి, ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం  మేము సింగ్ భగవంత్‌పురా పోలీస్ స్టేషన్ అధికారులను సంప్రదించాము. వారు మాతో మాట్లాడుతూ ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతున్న కారణంగా బాధితురాలి పేరు చెప్పడానికి నిరాకరించారు. అయితే, నిందితుడు సిక్కు మతానికి చెందినవాడని ధృవీకరించారు, ఈ కేసులో ఎలాంటి మతపరమైన కోణం లేదని స్పష్టం చేశారు.

చివరిగా, ఇటీవల పంజాబ్‌లో జరిగిన యువతి హత్య సంఘటనను తప్పుడు మతపరమైన కోణంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll