రాహుల్ గాంధీలా కనిపించే తన మాజీ ప్రియుడితో సోనియా గాంధీ ఉన్న ఫోటో అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సోనియా గాంధీ తన మాజీ ప్రియుడితో కలిసి ఉన్న ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటోలో సోనియా గాంధీతో ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ. ఈ వైరల్ ఫోటో 08 ఏప్రిల్ 1996న న్యూఢిల్లీలో జరిగిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరైనప్పుడు తీసినది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ ఫోటోను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోను రిపోర్ట్ చేస్తూ 2019, 2020 లో ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ప్రచురించిన కథనాల లభించాయి. ఈ కథనాలలోని ఫోటో క్యాప్షన్‌లో, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ 08 ఏప్రిల్ 1996న న్యూఢిల్లీలో జరిగిన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (SPG) వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఈ ఫోటోను PTI ప్రతినిధి తీశారని పేర్కొనబడింది. వైరల్ ఫోటోలో సోనియా గాంధీతో ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ అని పేర్కొన్న మరిన్ని కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. దీన్ని బట్టి, ఈ వైరల్ ఫోటోలో సోనియా గాంధీతో ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ అని స్పష్టమవుతోంది. వైరల్ పోస్టులలో సోనియా గాంధీని ‘ఆంటోనీ మైనో’ అని సంబోధించారు. సోనియా గాంధీ అసలు పేరు ఆంటోనియా ఎడ్విజ్ అల్బినా మైనో (Antonia Edvige Albina Maino).

చివరగా, ఈ వైరల్ ఫోటోలో సోనియా గాంధీతో ఉన్న వ్యక్తి రాహుల్ గాంధీ.