Fake News, Telugu
 

ఈ వీడియోలో నరేంద్ర మోదీని పొగుడుతూ ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా పాట పాడుతున్నది రాకీ మిట్టల్‌ కాదు

0

రాకీ మిట్టల్ ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా పాడిన పాట యొక్క దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. రాకీ మిట్టల్ పాటకు వ్యతిరేకంగా భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కోర్టుకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయంటూ ఈ పాటని షేర్ చేస్తూ క్లెయిమ్ చేశారు. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

క్లెయిమ్: రాకీ మిట్టల్ ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా పాడిన పాట దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో ‘మై చౌకీదార్’ అనే హిందీ గేయాన్ని పాడుతున్నది ఉమాశంకర్ దే మరియు నబానితా సాహ అనే గాయకులు. రాకీ మిట్టల్ 2019లో కాంగ్రెస్ మరియు రాహుల్ గాంధీని కించపరుస్తూ పాడిన ఒక వివాదాస్పద గేయాన్ని పలువురు కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తూ, హర్యానా ప్రభుత్వం వెంటనే రాకీ మిట్టల్‌ను తొలగించి కాంగ్రెస్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాకీ మిట్టల్‌పై కోర్టులో పరువు నష్టం దావా పెడతామని డిమాండ్ చేశారు. కానీ, పోస్టులో షేర్ చేసిన వీడియోకీ, రాకీ మిట్టల్‌కు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ఉమాశంకర్ దే అనే యూట్యూబ్ ఛానెల్ 04 ఏప్రిల్ 2019 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఉమాశంకర్ దే మరియు నబానితా సాహ అనే గాయకులు ‘మై చౌకీదార్’ అనే గేయాన్ని పాడుతున్న దృశ్యాలు, అంటూ ఈ వీడియోని పబ్లిష్ చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ పాటని రూపొందించినట్టు ఉమాశంకర్ దే ఈ వీడియోని తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేస్తూ తెలిపారు

బీజేపి స్టార్ క్యాంపెయినర్ మరియు హర్యానా ప్రభుత్వంలో ‘ఏక్ ఔర్ సుధర్’ కార్యక్రమానికి డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించిన రాకీ మిట్టల్‌, నరేంద్ర మోదీని, దేశంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ అనేక గీతాలను తన యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేశారు. రాకీ మిట్టల్‌ రూపొందించిన అటువంటి కొన్ని పాటలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

రాకీ మిట్టల్ 2019లో కాంగ్రెస్ మరియు రాహుల్ గాంధీపై చేసిన ఒక వివాదాస్పద గేయాన్ని హర్యానా కాంగ్రెస్ నాయకులు వ్యతిరేకిస్తూ, హర్యానా ప్రభుత్వం వెంటనే రాకీ మిట్టల్‌ను తొలగించి కాంగ్రెస్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే రాకీ మిట్టల్‌పై కోర్టులో పరువు నష్టం దావా వేస్తామని డిమాండ్ చేశారు. కానీ, పోస్టులో షేర్ చేసిన వీడియోకీ, రాకీ మిట్టల్‌కు ఎటువంటి సంబంధం లేదు. రాకీ మిట్టల్ పాటకు వ్యతిరేకంగా భారతదేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కోర్టుకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయంటూ ఇటీవల ఏ వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.

చివరగా, ఈ వీడియోలో నరేంద్ర మోదీని పొగుడుతూ ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా పాట  పాడుతున్నది రాకీ మిట్టల్‌ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll