ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆడుదాం ఆంధ్ర’ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో భాగంగా క్రికెట్ ఆడుతూ వై.కా.పా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కిందపడి గాయపడ్డారని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: ‘ఆడుదాం ఆంధ్ర’ టోర్నమెంట్లో భాగంగా క్రికెట్ ఆడుతూ కిందపడి గాయపడిన వై.కా.పా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి.
ఫాక్ట్: వీడియోలో క్రికెట్ ఆడుతూ అదుపుతప్పి కింద పడిన వ్యక్తి ఒడిశా బీజేడీ ఎమ్మెల్యే భూపిందర్ సింగ్. 25 డిసెంబర్ 2023 నాడు కలహండి జిల్లాలో క్రికెట్ పోటీలను ప్రారంభిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది ‘ఆడుదాం ఆంధ్ర’ టోర్నమెంట్లో జరిగిన ఘటన కాదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా ఈ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియో గురించి 25 డిసెంబర్ 2023 నాడు ఒడిశా మీడియా సంస్థలు కథనాలను (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ప్రసారం చేశాయి.
ఈ కథనాల ప్రకారం, 25 డిసెంబర్ 2023న ఒడిశాలోని కలహండి జిల్లాలో ఈ ఘటన జరిగింది. బిజూ జనతా దళ్ (బీజేడీ) పార్టీకి చెందిన భూపీందర్ సింగ్ క్రికెట్ పోటీలను ప్రారంభ సమయంలో క్రికెట్ ఆడుతుండగా అదుపుతప్పి కింద పడ్డారు. ఈ ఘటనలో ఆయనకి స్వల్ప గాయాలైనట్లు వార్తా కథనాల్లో పేర్కొన్నారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్‌లో ‘ఆడుదాం ఆంధ్ర’ టోర్నమెంట్ ఈ ఘటన జరిగిన మరుసటి రోజు, అనగా 26 డిసెంబర్ 2023 నాడు ప్రారంభమైంది. బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఈ పోటీలను ప్రారంభిస్తున్న వీడియోని ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో క్రికెట్ ఆడుతూ బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గాయపడ్డారని సంబంధంలేని వీడియోని షేర్ చేస్తున్నారు.