డిసెంబర్ 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా భారత సైన్యాన్ని కించపరిచారంటూ దాఖలైన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి 15 జూలై 2025న లక్నోలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు బెయిల్ మంజూరు చేసింది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ నేపథ్యంలో, ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తి రాహుల్ గాంధీతో సెల్ఫీ (ఫోటో) తీసుకున్నాడు అంటూ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 15 జూలై 2025న, లక్నోలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు న్యాయమూర్తి రాహుల్ గాంధీపై దాఖలైన పరువు నష్టం కేసు విచారణ సందర్భంగా రాహుల్ గాంధీతో సెల్ఫీ తీసుకున్నాడు, అందుకు సంబంధించిన ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ ఫోటోలో ఉన్నది 15 జూలై 2025న రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసిన లక్నో ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అలోక్ వర్మ కాదు. ఫోటోలో ఉన్నది న్యాయవాది సయ్యద్ మహమూద్ హసన్. డిసెంబర్ 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ భారత సైన్యాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో లక్నోలోని ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు 15 జూలై 2025న రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేస్తూ, కేసును 13 ఆగస్టు 2025కు వాయిదా వేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే ఫోటోను రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, ఈ వైరల్ ఫోటోలో ఉన్నది15 జూలై 2025న రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసిన లక్నో ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అలోక్ వర్మ కాదు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి న్యాయవాది సయ్యద్ మహమూద్ హసన్ అని, ఆయన 2006 నుండి లక్నో జిల్లా కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడాని వార్తా కథనాలు పేర్కొన్నాయి.

రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసిన లక్నో ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అలోక్ వర్మ ఫోటోను మనం అలహాబాద్ హైకోర్టు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

డిసెంబర్ 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత సైనికులను చైనా కొడుతున్నా కూడా భారత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో, భారత సైన్యంను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ 2023లో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. కానీ, రాహుల్ గాంధీ పలుమార్లు ఈ కేసు విచారణకు హాజరు కాలేదు. 11 ఫిబ్రవరి 2025న ఈ కేసును విచారించిన లక్నోలోని ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు, రాహుల్ గాంధీని విచారణకు హాజరు కావలిసిందిగా సమన్లు జారీ చేసింది.

దీనిని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ న్యాయవాదులు మహ్మద్ యాసిర్ అబ్బాసి, మహ్మద్ సమర్ అన్సారీ, ప్రన్షు అగర్వాల్ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్‌ను ఆశ్రయించారు. 29 మే 2025న, ఈ కేసును విచారించిన జస్టిస్ సుభాష్ విద్యార్థి గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది.

15 జూలై 2025న, రాహుల్ గాంధీ లక్నోలోని ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో ఈ కేసు విచారణకు హాజరయ్యారు. ఈ కేసును విచారించిన అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అలోక్ వర్మ బెయిల్ మంజూరు చేశారు. అలాగే, రూ.20 వేల పూచీకత్తు, రెండు బాండ్లు సమర్పించాలని రాహుల్ గాంధీ న్యాయవాదులకు ఆదేశించారు. ఇక ఈ కేసు తదుపరి విచారణను 13 ఆగస్టు 2025కు వాయిదా వేశారు.

చివరగా, ఈ వైరల్ ఫోటోలో ఉన్నది 15 జూలై 2025న రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసిన లక్నో ఎంపీ/ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అలోక్ వర్మ కాదు. ఫోటోలో ఉన్నది న్యాయవాది సయ్యద్ మహమూద్ హసన్.