Fake News, Telugu
 

ఈ ఫోటోలో ఉన్నది చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పిన ఏసీబీ న్యాయమూర్తి హిమ బిందు కాదు

0

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పిన న్యాయమూర్తి అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. అలాగే అంతకుముందు ఆమెను ముఖ్యమంత్రి జగన్ లా కాలేజీ డీన్‌గా నియమించాడని కూడా వార్తలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి.  ఈ కథనం ద్వారా ఆ ఫోటోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఫోటో.

ఫాక్ట్(నిజం): ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది శ్రీకాకుళం-I అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా వ్యవహరిస్తున్న కే. శ్రీదేవి, చంద్రబాబు కేసులో తీర్పు చెప్పిన ఏసీబీ న్యాయమూర్తి హిమ బిందు కాదు. పైగా న్యాయమూర్తి హిమ బిందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లా కాలేజీ డీన్‌గా నియమించాడన్న వార్తలో కూడా నిజం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఐతే చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పిన న్యాయమూర్తి పేరు సత్య వెంకట హిమ బిందు.

ఈమె ప్రస్తుతం విజయవాడ III అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా, ఏసీబీ కోర్టు జడ్జిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. ఐతే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్నది శ్రీకాకుళం I అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా వ్యవహరిస్తున్న కే. శ్రీదేవి, చంద్రబాబు కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి హిమ బిందు కాదు.

కాగా చంద్రబాబు కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి హిమ బిందు ఫోటో ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి  శ్రీకాకుళం జిల్లా న్యాయమూర్తి ఫోటో ఏసీబీ న్యాయమూర్తి అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారని అర్ధమవుతుంది.

ఐతే కొన్ని ఆన్లైన్ బ్లాగ్స్ న్యాయమూర్తి హిమ బిందు ఫోటోకు బదులు న్యాయమూర్తి కే. శ్రీదేవి ఫోటోను చంద్రబాబు కేసుకు ఆపాదిస్తూ షేర్ చేయడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇదిలా ఉంటే న్యాయమూర్తి హిమ బిందుకు ముఖ్యమంత్రి జగన్ లా కాలేజీ డీన్‌గా నియమించాడన్న వార్తలో కూడా నిజం లేదు, దీనికి సంబంధించిన రిపోర్ట్స్ ఏవి మాకు లభించలేదు.

చివరగా, ఈ ఫోటోలో ఉన్నది చంద్రబాబుకు రిమాండ్ విధిస్తూ తీర్పు చెప్పిన ఏసీబీ న్యాయమూర్తి హిమ బిందు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll