2015లో అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీ పూరి శంకరాచార్యను నిర్ధాక్షిణ్యంగా కొట్టి, లాఠీఛార్జ్ చేసి విధుల్లో ఈడ్చుకేళుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఆ వీడియోలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీ పూరి శంకరాచార్యను నిర్ధాక్షిణంగా విధులలో ఈడ్చుకేళ్ళిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ ఘటన 2015 సెప్టెంబర్ నెలలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి నగరంలో చోటుచేసుకుంది. గంగా నదిలో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిరాకరిస్తూ అల్లహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పుని బేఖాతరు చేస్తూ ద్వారకా శంకరాచార్య స్వామి స్వరూపానంద శిష్యులు అలాగే, కొంతమంది ఉద్యమకారులు పోలీసులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. నిరసనకారులని అదుపు చేసే క్రమంలో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియోలో పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్నది ద్వారకా శంకరాచార్య స్వామి స్వరూపానంద శిష్యుడు స్వామి అవిముక్తేశ్వరానందపై, శ్రీ పూరి శంకరాచార్యపై కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలతో ఉన్న వీడియోని ‘ఇండియా TV’ వార్తా సంస్థ 23 సెప్టెంబర్ 2015 నాడు తమ యూట్యూబ్ ఛానల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. వారణాసి నగరంలో గణేష్ నిమజ్జనానికి సంబంధించి చెలరేగిన ఘర్షణలని అదుపు చేసేందుకు పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్ చేసిన దృశ్యాలని వీడియోలో రిపోర్ట్ చేసారు.
ఈ వివరాల ఆధారంగా వీడియోలోని ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఈ లాఠీఛార్జుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతూ ‘ది ఇండియన్ ఎక్ష్ప్రెస్’ వార్తా సంస్థ 24 సెప్టెంబర్ 2015 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. గంగా నదిలో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిరాకరిస్తూ అల్లహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని బేఖాతరు చేస్తూ, వారాణసిలో ద్వారకా శంకరాచార్య స్వామి స్వరూపానంద శిష్యులు, కొంతమంది హిందూ ఉద్యమకారులు పోలీసులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టినట్టు ఆర్టికల్‌లో తెలిపారు. సుమారు 30 గంటల పాటు సాగిన ఈ నిరసన కార్యక్రమాన్ని అదుపు చేసేందుకు పోలీసులు నిరసనకారులపై లాఠీఛార్జ్ చేసినట్టు ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసారు. అయితే, ఈ లాఠీఛార్జులో భాగంగా పోలీసులు ద్వారకా శంకరాచార్య స్వామి స్వరూపానంద శిష్యుడు స్వామి అవిముక్తేశ్వరానందపై చేయి చేసుకున్నట్టు ఆర్టికల్‌లో తెలిపారు.
ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ ఘటనలో భాగంగా శ్రీ పూరి శంకరాచార్యను పోలీసులు కొట్టినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. వీడియోలోని ఘటన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మాట వాస్తవమే అయినప్పటికీ, ఈ లాఠీఛార్జ్ ఘటనతో శ్రీ పూరి శంకరాచార్యకు ఎటువంటి సంబంధం లేదని పై వివరాల ఆధారంగా స్పష్టమయ్యింది.
చివరగా, అఖిలేష్ ప్రభుత్వంలో జరిగిన ఈ లాఠీఛార్జులో పోలీసులు కొడుతున్నది శ్రీ ద్వారకా శంకరాచార్య స్వామి స్వరూపానంద శిష్యుడు స్వామి అవిముక్తేశ్వరానందని, శ్రీ పూరి శంకరాచార్యను కాదు.