Fake News, Telugu
 

రాయచూరులో తీసిన ఈ వీడియోలో గణపతి నిమజ్జనం ఊరేగింపుపై రాళ్లు రువ్వుతున్న వ్యక్తులు ముస్లింలు కాదు

0

‘అన్నిమతాలు సమానమే కదరా.. రాళ్ళు ఎందుకు విసురుతున్నారు.. అసలు బిల్డింగ్ పై రాళ్ళ కుప్పలు ఎందుకు పెట్టుకున్నారు మరకలు..’ అని చెప్తూ, ఒక గణపతి నిమజ్జనం ఊరేగింపు మీద ఇద్దరు వ్యక్తులు రాళ్లు రువ్వుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక గణపతి నిమజ్జనం ఊరేగింపుపై కొందరు ముస్లిం వ్యక్తులు ఇళ్లపై నిలబడి రాళ్లతో దాడి చేస్తున్న వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియోలోని సంఘటన కర్ణాటక రాష్ట్రం రాయచూరులో జరిగింది. ఈ సంఘటనలో నిందితులు ముస్లింలు కాదు, ప్రవీణ్, ప్రశాంత్ అనే ఇద్దరు హిందూ వ్యక్తులు. వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి, తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలో కనిపిస్తున్న సంఘటన గురించి మాకు కొన్ని కన్నడ వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). 

వాటిని మేము తెలుగులోకి అనువదించుకుని చదువగా, చూడగా (వీడియో రిపోర్టులను Google Notebook LLM ఉపయోగించి తర్జుమా చేశాము) ఈ సంఘటన కర్ణాటకలోని రాయచుర్‌ పట్టణంలో రెండు గుంపుల మధ్య ఉన్న పాత కక్ష్యల కారణంగా జరిగిందని మాకు తెలిసింది. 

కన్నడ ప్రభ వారు 6 సెప్టెంబర్ 2025న ప్రచురించిన ఒక వార్తా కథనం ప్రకారం, ఈ సంఘటన రాయచుర్‌లోని గంగా నివాస్ రోడ్డులో ఒక గణపతి నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా జరిగింది. ప్రశాంత్, ప్రవీణ్ అనే ఇద్దరు యువకులు సమీపంలోని ఒక దుకాణంపైకి ఎక్కి ఈ ఊరేగింపుపై దాడి చేశారు.

ఈ వార్తా కథనాల ప్రకారం, ఈ దాడిలో వినయ్ కుమార్, గణేష్ అనే ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ నిమిత్తం, నిందితులు ప్రశాంత్, ప్రవీణ్ లపై స్థానిక సదర్ బజార్ పోలీస్ వారు కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు. ఈ రెండు గుంపుల మధ్య ఉన్న పాత గొడవల కారణంగానే నిందితులు ఈ దాడి చేశారని వార్తా కథనాలు పేర్కొన్నాయి.

ఈ విషయంపై మరింత సమాచారం కోసం, రాయచుర్‌ సదర్ బజార్ పోలీస్ వారిని మేము సంప్రదించగా, ఈ సంఘటనలో ఎటువంటి మతపరమైన కోణం లేదని, ఇందులో ఉన్న రెండు వర్గాల వారు హిందువులే అని, వైరల్ క్లెయిములో చెప్తున్నట్లుగా రాళ్లు రువ్విన వారు ముస్లింలు కాదని, పోలీస్ ఇన్స్పెక్టర్ ఉమేష్ కాంబ్లే మాకు చెప్పారు. అలాగే, వీళ్లు రాళ్లు రువ్వింది మనుషుల పైనే కానీ గణపతి విగ్రహం పైన కాదని ఆయన మాకు తెలిపారు.

ఇదిలా ఉంచితే, కర్ణాటకలోని మాండ్యాలో ఉన్న మద్దూర్ టౌనులో 7 సెప్టెంబర్ 2025న గణపతి నిమజ్జనం ఊరేగింపు పై ఒక మసీదు దగ్గర కొందరు రాళ్లు రువ్వగా, గొడవలు అయ్యాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ సందర్భంగా 8 సెప్టెంబర్ 2025న కొందరు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు (ఇక్కడ, ఇక్కడ).

చివరగా, ఒక గణపతి నిమజ్జనం ఊరేగింపుపై ఇద్దరు వ్యక్తులు రాళ్లు రువ్వుతున్న ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం రాయచూరులో జరిగింది. ఈ సంఘటనలో నిందితులు ముస్లింలు కాదు, ప్రవీణ్, ప్రశాంత్ అనే ఇద్దరు హిందూ వ్యక్తులు. వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Share.

About Author

Comments are closed.

scroll