Fake News, Telugu
 

10 రోజుల ట్రిప్ కోసం తన బిడ్డను ఒంటరిగా వదిలి వెళ్లిన మహిళను శిక్షిస్తున్న అమెరికన్ పోలీసులు అంటూ సంబంధం లేని పాత వీడియోను షేర్ చేస్తున్నారు

0

“16 నెలల బిడ్డను ఇంట్లో 10 రోజులు వంటరిగా వదిలి టూర్ వెళ్లిన తల్లి. ఆ బిడ్డ చనిపోవడంతో తల్లికి కఠినంగా శిక్ష వేసిన అమెరికా పోలీసులు” అంటూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒక మహిళకు వేసిన కట్లను పోలీసులు విప్పుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆర్కైవ్ చేసిన పోస్టును ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 16 నెలల బిడ్డను ఇంట్లో 10 రోజులు ఒంటరిగా వదిలి టూర్ వెళ్లిన తల్లి. ఆ బిడ్డ చనిపోవడంతో తల్లికి కఠినమైన శిక్ష వేసిన అమెరికా పోలీసులు.

ఫాక్ట్(నిజం): డిసెంబర్ 2018లో, వాలెంటినా గ్లోరియా సెయింట్ ల్యూక్స్ హాస్పిటల్‌లోని బిహేవియరల్ ఆరోగ్య విభాగంలో చికిత్స పొందుతోంది, అక్కడ ఆమె ఇద్దరు నర్సులపై ఉమ్మివేసి, వారిని కొట్టినందుకు ఆరోపణలు ఎదుర్కొంది, అరెస్టు చేయబడింది. వైరల్ వీడియో 2019లో విడుదలైన వాలెంటినా గ్లోరియా యొక్క మానసిక చికిత్స సెషన్‌కు సంబంధించినది. అయితే, అమెరికాలోని ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన క్రిస్టల్ కాండేలారియో తన 16 నెలల కుమార్తె జిలీన్‌ను ఇంట్లో ఒంటరిగా వదిలి 10 రోజుల సెలవులకు వెళ్లింది. జూన్ 2023లో జరిగిన ఈ సంఘటనలో, వెకేషన్ తర్వాత జూన్ 16న ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత క్రిస్టల్ తన బిడ్డ చనిపోయి ఉండటం చూసింది. 18 మార్చి 2024న కోర్టులో చిన్నారిని చనిపోవటానికి బాధ్యతను అంగీకరించిన క్రిస్టల్ కాండేలారియోకు కోర్టు జీవిత ఖైదు విధించింది. క్రిస్టల్ కాండేలారియోకు వైరల్ అవుతున్న వీడియోకు ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగిస్తూ రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, 1 ఆగష్టు 2019న, Hannah Critchfield అనే YouTube ఛానెల్ ఇదే వీడియోను (ఆర్కైవ్) ప్రచురించింది అని గమనించాం. ఈ వీడియో యొక్క వివరాలలో ఒక వార్తా పత్రిక యొక్క లింక్ ఇవ్వబడింది.

దీని ఆధారంగా, I’m Gonna Die in Here: 19-year-old Mental Ill Woman Remains in Jail for spitting అనే శీర్షికతో ఫీనిక్స్ న్యూ టైమ్స్‌ 22 ఆగస్టు 2019లో ప్రచురించిన ఒక వార్తా నివేదికను కనుగొన్నాం. ఈ కథనం ప్రకారం, ఆటిజం మరియు తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వాలెంటినా గ్లోరియా అనే యువతి తన మానసిక ఆరోగ్య సంక్షోభం కారణంగా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో ఇరుక్కుపోయింది. ఆమె కేసు అరిజోనా జైళ్లలో మానసికంగా అస్థిరంగా ఉన్న వ్యక్తుల పోరాటాలను హైలైట్ చేస్తుంది అని తెలుసుకున్నాం. National Center on Disability and Journalism నివేదిక ప్రకారం, “డిసెంబర్ 2018లో, [వాలెంటినా] గ్లోరియా సెయింట్ ల్యూక్స్ హాస్పిటల్‌లోని బిహేవియరల్ ఆరోగ్య విభాగంలో చికిత్స పొందుతోంది, అక్కడ ఆమె ఇద్దరు నర్సులపై ఉమ్మివేసి, వారిని కొట్టినందుకు ఆరోపణలు ఎదుర్కొంది మరియు అరెస్టు చేయబడింది.”

అయితే, 17 జనవరి 2020న, ది రియల్ న్యూస్ నెట్‌వర్క్ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో వాలెంటినా గ్లోరియా తల్లితో ఇంటర్వ్యూని కలిగి ఉన్న మరొక వీడియో విడుదల చేయబడింది. ఇంటర్వ్యూలో, ఆమె కుమార్తెను జైలు నుంచి విడుదల చేయాలని వేడుకుంది.

వైరల్ పోస్ట్‌లో ఈ వీడియోతో షేర్ చేస్తున్న దావా గురించి తగిన కీ వర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్లో వెతికితే, మార్చి 2024లో అమెరికన్ మీడియా (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ప్రచురించిన నివేదికల ప్రకారం, అమెరికాలోని ఓహియోలోని క్లీవ్‌ల్యాండ్‌కు చెందిన క్రిస్టల్ కాండేలారియో తన 16 నెలల కుమార్తె జిలీన్‌ను ఇంట్లో ఒంటరిగా వదిలి 10 రోజుల సెలవులకు వెళ్లింది. జూన్ 2023లో జరిగిన ఈ సంఘటనలో, వెకేషన్ తర్వాత జూన్ 16న ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత క్రిస్టల్ తన బిడ్డ చనిపోయి ఉండటం చూసింది. 18 మార్చి 2024న కోర్టులో చిన్నారిని చనిపోవటానికి బాధ్యతను అంగీకరించిన క్రిస్టల్ కాండేలారియోకు కోర్టు జీవిత ఖైదు విధించింది.

ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న వైరల్ వీడియో వాస్తవానికి 2019లో విడుదలైన వాలెంటినా గ్లోరియా అనే అమెరికన్ యువతి యొక్క మానసిక చికిత్స సెషన్‌కు సంబంధించినది. 18 మార్చి 2024లో కోర్టులో తన కూతురు చనిపోవటానికి బాధ్యతను అంగీకరించిన క్రిస్టల్ కాండేలారియోతో ఈ వీడియోకు ఎలాంటి సంబంధం లేదు.

10 రోజుల ట్రిప్ కోసం తన బిడ్డను ఒంటరిగా వదిలి వెళ్లిన మహిళను శిక్షిస్తున్న అమెరికన్ పోలీసులు అంటూ సంబంధం లేని పాత వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll