ఇటీవల జరిగిన 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో TDP కూటమి గెలిచిన విషయం తెలిసిందే. ఐతే ఈ ఫలితాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో 10 జులై 2024న రీపోలింగ్ జరుగనుందని ఒక వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఇందుకుగాను కోర్టు ఆదేశాలు జారీ చేసిందని కూడా చెప్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 10 జులై 2024న రీపోలింగ్ జరుగనుంది; ఇందుకుగాను కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఫాక్ట్(నిజం): కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో జులై 2024లో జరగబోయే ఉపఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది, ఆంధ్రప్రదేశ్‌లో రీపోలింగ్‌కు సంబంధించి కాదు. ఎన్నికల అనంతరం ఏపీలో పలు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ పెట్టాలని YSRCP వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉపఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ స్థానాలకు 10 జులై 2024న పోలింగ్ జరుగనున్నట్టు తెలిపింది. ఐతే ఈ నియోజకవర్గాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏ స్థానం కూడా లేదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి ఎన్నికలు లేవన్న విషయం స్పష్టమవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో అనేక హింసాత్మక ఘటనలు జరిగి పోలింగ్‌కు అంతరాయం కలిగిన విషయం తెలిసిందే. ఐతే ఎన్నికల అనంతరం ఏపీలో పలు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ పెట్టాలని YSRCPకి చెందిన అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ వేయగా, కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది. ఎన్నికలు అయిపోయాక ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఆ తరవాత కూడా కౌంటింగ్‌కు ఒక్కరోజు ముందు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ విషయంలో YSRCP సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై అధికారిక సీల్, హెూదా లేకుండా స్పెసిమెన్ సిగ్నేచర్ ఉంటే చాలని, అలాంటి పోస్టల్ బ్యాలెట్ ఆమోదించాలన్న ఏపీ సీఈవో మెమోను, తదనంతరం ఆ నిర్ణయాన్ని సమర్థిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేయాలని వైఎస్సార్సీపీ కోరింది. ఐతే కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి రీపోలింగ్ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయినట్టు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. కాబట్టి కోర్టు రీపోలింగ్‌కు ఆదేశించిందన్న వార్తలో కూడా నిజం లేదని స్పష్టమవుతుంది.
చివరగా, 2024 ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో రీపోలింగ్ నిర్వహించాలని కోర్టు ఆదేశించిందన్న వార్త నిజం కాదు.