Fake News, Telugu
 

‘మోడ్రన్ చైనా కేఫ్’ పేరుని ‘మింగిచావ్’ గా మార్ఫ్ చేసి అసత్య కథనాన్ని ప్రచారం చేస్తున్నారు

0

ఒక తెలుగు వ్యక్తి చైనాకు వెళ్ళి అక్కడ ‘మింగిచావ్’ అనే రెస్టారెంట్ స్థాపించాడంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఇదే ఫోటోని ఇక్కడ కూడా చూడవచ్చు

క్లెయిమ్: ఒక తెలుగు వ్యక్తి చైనాలో స్థాపించిన మింగిచావ్ అనే రెస్టారెంట్ యొక్క ఫోటో.

ఫాక్ట్: ఈ ఫోటోలోని రెస్టారెంట్ పేరు మార్ఫ్ చేయబడింది. అసలు ఫొటోలో ఉన్న రెస్టారెంట్ పేరు ‘మోడ్రన్ చైనా కేఫ్’.  ఎరిక్ ఝాంగ్ అనే చైనా సంతతి వ్యక్తి దీనిని 2009లో అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉన్న వాల్‌నట్ క్రీక్ నగరంలో స్థాపించాడు. చైనాలో తెలుగు వ్యక్తి ‘మింగిచావ్’ అనే పేరుతో రెస్టారెంట్ ప్రారంభించినట్లు ఎక్కడా సమాచారం లేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ పోస్టులో ఉన్న ఫొటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫొటోని 2010లో తీసినట్లుగా ఒక ఫోటోగ్రఫీ వెబ్‌సైట్లో పేర్కొన్నారు. అయితే ఈ ఫొటోలో రెస్టారెంట్ పేరు ‘Modern China café’ అని ఉంది.

ఇక ఈ రెస్టారెంట్ గురించి మరింత వెతకగా, ఇది అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని వాల్‌నట్ క్రీక్ నగరంలో ఉన్నట్లు రెస్టారెంట్ వెబ్‌సైట్లో పేర్కొన్నారు.  

స్థానిక మీడియా మరియు వెబ్‌సైట్ల ప్రకారం, చైనా సంతతికి చెందిన ఎరిక్ ఝాంగ్ (Eric Zhang) 2009లో దీనిని స్థాపించాడు.

ఈ రెస్టారెంట్ యొక్క మరిన్ని ఫొటోలు మరియు వీడియోలను రెస్టారెంట్ సోషల్ మీడియా ఖాతాలలో చూడవచ్చు.

ఇక వైరల్ అవుతున్న ఫోటోని అసలు ఫొటోతో పోల్చిచూడగా, వైరల్ ఫోటోలోని రెస్టారెంట్ పేరును ఎడిట్ చేసి మార్చినట్లు నిర్ధారించవచ్చు.

పైగా చైనాలో తెలుగు వ్యక్తి మింగిచావ్ అనే రెస్టారెంట్ స్థాపించినట్లు మాకు ఎక్కడా ఆధారాలు లభించలేదు. అయితే, విజయవాడలో ‘మింగిచావ్’ అనే పేరుతో ఒక రెస్టారెంట్ ఉన్నట్లు స్విగ్గి యాప్ లో పేర్కొన్నారు.

చివరిగా, మార్ఫ్ చేయబడిన ఫోటోని షేర్ చేస్తూ చైనాలో తెలుగు వ్యక్తి మింగిచావ్ అని రెస్టారెంట్‌ను స్థాపించినట్లు తప్పుడు ప్రచారం జరుగుతుంది.

Share.

About Author

Comments are closed.

scroll