ఒక హిందువుని అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ కేరళలోని ముస్లింలు బహిరంగ నిరసన చేపట్టిన దృశ్యాలు, అంటూ ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. శ్రీరామ్ వెంకట్రామన్‌ను అలప్పుజ కలెక్టర్ పదవి నుండి తొలగించాలని వేలాది మంది ముస్లిం సంఘాల కార్యకర్తలు మలప్పురం కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేసినట్టు ఈ స్క్రీన్ షాట్ తీసిన ఆర్టికల్‌లో రిపోర్ట్ చేసి ఉంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఒక హిందువుని అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ కేరళలోని ముస్లింలు బహిరంగ నిరసన చేపట్టిన దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): కేరళలోని అలప్పుజ జిల్లాకు ఇటీవల కలెక్టర్‌గా నియమితులైన శ్రీరామ్ వెంకట్రామన్, 2019లో మద్యం మత్తులో కార్ నడిపి బషీర్ అనే జర్నలిస్ట్ మృతికి కారణమయ్యాడనే ఆరోపణలున్నాయి. ఈ కేసులో భాగంగా శ్రీరామ్ వెంకట్రామన్ తన ఐఏఎస్ పదవి నుండి సస్పెండ్ అయి అరెస్ట్ కూడా అయ్యారు. తరువాత బెయిల్ మీద విడుదలయ్యారు. ఒక జర్నలిస్ట్ మృతిలో ప్రధాన దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కేరళ ప్రభుత్వం అలప్పుజ కలెక్టర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ వేలాదిమంది ముస్లింలు మలప్పురం కలెక్టరేట్ ముందు ఇలా నిరసన వ్యక్తం చేసారు. హిందూ మతానికి చెందిన వ్యక్తిని అలప్పుజ జిల్లా కలెక్టర్ గా నియమించవద్దని ఈ నిరసన చేపట్టలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.
పోస్టులో షేర్ చేసిన ఆర్టికల్‌కు సంబంధించిన వివరాల కోసం వెతికితే, ‘ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వార్తా సంస్థ ఈ ఆర్టికల్‌ని 31 జులై 2022 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. మద్యం మత్తులో కారుని నడిపి ఒక జర్నలిస్ట్ మృతికి కారణమయిన శ్రీరామ్ వెంకట్రామన్‌ను కేరళ ప్రభుత్వం అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా నియమించడాన్ని నిరసిస్తూ వేలాది మంది కేరళ ముస్లిం జమాత్ సభ్యులు, ముస్లిం సంఘాల కార్యకర్తలు మలప్పురం కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేసినట్టు ఈ ఆర్టికల్‌లో తెలిపారు.

26 జులై 2022 నాడు ఐఏఎస్ అధికారి శ్రీరామ్ వెంకట్రామన్ అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా పదవి బాధ్యతలు చేపట్టారు. అయితే, 2019లో కేరళలో సర్వే డైరెక్టరుగా పనిచేస్తున్న శ్రీరామ్ వెంకట్రామన్, మద్యం మత్తులో కార్ నడిపి ద్విచక్ర వాహనంపై వెళుతున్న బషీర్ అనే జర్నలిస్టుని ఢీ కొట్టి అతని మృతికి కారణమయ్యినట్టు పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ మరియు వీడియోలని పబ్లిష్ చేసాయి. 03 ఆగష్టు 2019 నాడు తెల్లవారుజామున తిరువనంతపురంలోని మ్యూజియం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఆక్సిడెంట్ చోటుచేసుకున్నట్టు తెలిసింది. జర్నలిస్ట్ మృతికి కారణమయిన శ్రీరామ్ వెంకట్రామన్‌ను కేరళ ప్రభుత్వం అప్పుడు పదవి నుండి సస్పెండ్ కూడా చేసింది.

ఈ ఆక్సిడెంట్‌కు సంబంధించి తిరువనంతపురం మ్యూజియం పోలీస్ స్టేషన్లో ఫైల్ అయినా FIR కాపీని ఇక్కడ చూడవచ్చు. ఈ కేసుకి సంబంధించి కేరళ హై కోర్ట్ 2019లో బెయిల్ విషయమై ఇచ్చిన ఆర్డర్ కాపీని ఇక్కడ చూడవచ్చు. 2019లో చోటుచేసుకున్న ఈ ఆక్సిడెంటుకు సంబంధించి ఇంకా తిరువనంతపురం జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. కోవిడ్-19 నేపథ్యంలో కేరళ ప్రభుత్వం శ్రీరామ్ వెంకట్రామన్‌ను తిరిగి హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్ సెక్రటరీగా నియమించింది.

అలప్పుజ జిల్లా కలెక్టర్‌గా శ్రీరామ్ వెంకట్రామన్‌ను నియమించడాన్ని పలు ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తూ తీవ్ర నిరసనలు వెలువెత్తుతున్న నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం శ్రీరామ్ వెంకట్రామన్‌ను అలప్పుజ జిల్లా కలెక్టర్ పదవి నుండి తొలగించి కేరళ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలో జనరల్ మేనేజరుగా నియమించింది. పై వివరాల ఆధారంగా ఫోటోలో కనిపిస్తున్న ముస్లింలు తమకు ఒక హిందువు కలెక్టర్‌గా వచ్చినందుకు నిరసన వ్యక్తం చేయట్లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, జర్నలిస్ట్ బషీర్ మృతిలో ముఖ్య దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీరామ్ వెంకట్రామన్‌ను అలప్పుజ కలెక్టర్‌గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు చేసిన నిరసనని మతపరమైన నేపథ్యంతో షేర్ చేస్తున్నారు.