Fake News, Telugu
 

ఆగస్టు 2025లో ఢిల్లీలో జరిగిన కల్కాజీ ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్‌ హత్యను తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు

0

ఢిల్లీలోని కల్కాజీ ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్‌ను ముస్లింలు దారుణంగా కొట్టి చంపారని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీలోని కల్కాజీ ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్‌ను ముస్లింలు దారుణంగా కొట్టి చంపిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో 29 ఆగస్టు 2025న ఢిల్లీలోని కల్కాజీ ఆలయం సమీపంలో జరిగిన ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్‌ హత్యకు సంబంధించినది. రిపోర్ట్స్ ప్రకారం, ప్రసాదం పంపిణీ విషయంలో ఆయనకు కొంతమంది భక్తులతో వాగ్వాదం చోటు చేసుకుంది, ఆ వాగ్వాదం హింసాత్మకంగా మారడంతో అతన్ని ఆలయం వెలుపలకి లాగి కర్రలతో దాడి చేశారు, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యోగేంద్ర సింగ్‌ చికిత్స పొందుతూ మరణించాడు. ఈ కేసులో ఎలాంటి మతపరమైన కోణం లేదని, బాధితుడు, నిందితులందరూ హిందూ సమాజానికి చెందినవారని సౌత్ ఈస్ట్ ఢిల్లీ డీసీపీ Factlyతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 30 ఆగస్టు 2025న ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాల ప్రకారం, ఢిల్లీలోని కల్కాజీ ఆలయంలో దాదాపు 15 సంవత్సరాలుగా సేవ చేస్తున్న సేవకుడు యోగేంద్ర సింగ్, 29 ఆగస్టు 2025న చున్నీ ప్రసాదం పంపిణీ విషయంలో కొంతమంది భక్తులతో వాగ్వాదానికి దిగాడు. ఆ వాదన పెరిగి హింసాత్మకంగా మారడంతో, అతన్ని ఆలయం వెలుపలకి లాగి కర్రలతో దాడి చేశారు, ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన యోగేంద్ర సింగ్‌ను ఆలయ సిబ్బంది వెంటనే ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించగా,  అక్కడ చికిత్స పొందుతూ  యోగేంద్ర సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు.

02 సెప్టెంబర్ 2025న ప్రచురితమైన టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా కథనం ప్రకారం, ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు సుమారు తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు, అరెస్టయిన వారి పేర్లు: అతుల్ పాండే, మోహన్ (అలియాస్ భురా), కుల్దీప్ బిధూరి, నితిన్ పాండే, అనిల్ పాండే, సందీప్ బిధూరి, మోను కంగర్, రోహిత్ బిధూరి, బాబు అని ఈ కథనం పేర్కొంది.

ఈ కేసులో మతపరమైన కోణం ఉందా అనే విషయాన్ని తెలుసుకునేందుకు, మేము సౌత్ ఈస్ట్ ఢిల్లీ డీసీపీని సంప్రదించాము, Factlyతో మాట్లాడుతూ, ఈ సంఘటనకు ఎలాంటి మతపరమైన కోణం లేదని, బాధితుడు, నిందితులందరూ హిందూ సమాజానికి చెందినవారని, కేసు ప్రస్తుతం విచారణలో ఉందని, మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

చివరిగా, ఆగస్టు 2025లో ఢిల్లీ జరిగిన కల్కాజీ ఆలయ సేవకుడు యోగేంద్ర సింగ్‌ హత్యను తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll