తన సోదరిని వేధిస్తున్న ముస్లిం వ్యక్తిని ఓ హిందువు హత్య చేశాడంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో, తన సోదరిని వేధిస్తున్న వ్యక్తిని తానే చంపానని ఒక వ్యక్తి చెప్పడం మనం చూడవచ్చు. “ఉగ్రవాదిని నరికి పారేసిన ఇతని మాటల్లో… నేను హిందూవుని సార్ నా చెల్లికి బంగారం ఇప్పిస్తా వస్తావా అంటాడా? లేపుకపోతా అంటాడా! అందుకే ఆ ఉగ్రవాద జాతి గాడిని నరికి పారేశా. ఎవ్వరి సహాయం లేకుండా ఒక్కన్నే నరికాను” అని చెప్తూ ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: తన సోదరిని వేధిస్తున్న ముస్లిం వ్యక్తిని తానే చంపానని హిందూ వ్యక్తి చెప్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఆగస్టు 2025లో మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన అనిల్ కరోసియా అనే వ్యక్తి హత్యకు సంబంధించినది. ఈ వైరల్ వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి పేరు అభిషేక్ టింగా. తన సోదరిని వేధిస్తున్నాడని అభిషేక్ టింగా తన స్నేహితులతో కలిసి అనిల్ కరోసియాను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన గుణ జిల్లాలోని కాంట్ (Cantt) పోలీసులు, ఈ సంఘటనలో ఎలాంటి మతపరమైన కోణం లేదని, మరణించిన అనిల్ ముస్లిం కాదని, హిందువు అని మాకు (Factly) తెలిపారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 24 ఆగస్టు 2025న మధ్యప్రదేశ్‌కు సంబంధించిన మీడియా సంస్థ ‘MP Tak’ యూట్యూబ్‌లో షేర్ చేసిన న్యూస్ వీడియో రిపోర్ట్ ఒకటి లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ వీడియో 2025లో మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన అనిల్ కరోసియా అనే వ్యక్తి హత్యకు సంబంధించినది.
దీని ఆధారంగా ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ ఘటనకు సంబంధించిన పలు వార్త కథనాలు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాల ప్రకారం, 22 ఆగస్టు 2025న మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో తన సోదరిని వేధిస్తున్నాడని అనే కారణంతో అభిషేక్ టింగా అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి అనిల్ కరోసియా అనే వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు.

ఈ క్రమంలోనే, ఈ హత్యపై గుణ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ (SP) అంకిత్ సోనీ 23 ఆగస్టు 2025న మీడియా సమావేశం నిర్వహించారని తెలిసింది. ఈ మీడియా సమావేశానికి సంబంధించిన వివరాలను గుణ జిల్లా SP తన అధికారిక X(ట్విట్టర్)లో షేర్ చేశారు. ఈ మీడియా ప్రకటనలో, ఈ హత్యలో ప్రధాన నిందితుడు అభిషేక్ టింగా అని, ఈ హత్య కేసులో తనతో సహా ఎనిమిది మందిని గుణ జిల్లా కాంట్ (Cantt) పోలీసులు అరెస్టు చేశారని ఎస్పీ తెలిపారు.
ఈ కేసుకు సంబంధించిన మరింత సమాచారం కోసం, ఈ హత్య కేసును దర్యాప్తు చేసిన గుణ జిల్లాలోని కాంట్ (Cantt) పోలీసులను మేము సంప్రదించగా, కాంట్ పోలీస్ స్టేషన్ SI రసన సింగ్ మాతో (Factly) మాట్లాడుతూ, “ఈ హత్యలో ఎలాంటి మతపరమైన కోణం లేదు, మరణించిన అనిల్ ముస్లిం కాదు, హిందువు” అని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి కాంట్ పోలీస్ స్టేషన్ లో (FIR 0809/2025) నమోదు చేయబడిందని కూడా పేర్కొన్నారు.
తదుపరి ఈ హత్య కేసుకు సంబంధించిన వివరాల కోసం గుణ జిల్లా కోర్టు వెబ్‌సైట్‌లో వెతకగా, ఈ ఘటన 21 ఆగస్టు 2025న రాత్రి జరిగినట్లు తెలిసింది. అలాగే ఎనిమిది మంది నిందితులు, మరణించిన అనిల్ కూడా హిందువే అని స్పష్టమైంది.


చివరగా, ఆగస్టు 2025లో మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో జరిగిన అనిల్ కరోసియా హత్యను తప్పుడు మతపరమైన కథనంతో షేర్ చేస్తున్నారు.

