ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం అందించే పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టింది. ఈ నేపథ్యంలోనే డొక్కా సీతమ్మ ఫోటో అంటూ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ఈ కథనం ద్వారా ఆ ఫొటోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: నిత్యాన్నదాతగా ప్రసిద్ధి చెందిన డొక్కా సీతమ్మ ఫోటో.
ఫాక్ట్(నిజం): ఈ ఫొటోలో ఉన్నది డొక్కా సీతమ్మ కాదు. ఈ ఫొటోలో ఉన్నది వక్త, సాహితీ వ్యాఖ్యాత శ్రీభాష్యం అప్పలాచార్యులు దంపతులది. డొక్కా సీతమ్మ ఫోటోలు పెద్దగా అందుబాటులో లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వం అమలుచేసిన పలు స్కీముల పేర్లను మార్చుతూ ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే పాఠశాల విద్యాశాఖ పరిధిలో అమలవుతోన్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి జగనన్న అమ్మఒడి పేరును ‘తల్లికి వందనంగా’ మార్చగా, జగనన్న విద్యా కానుక పథకాన్ని ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ అని పేరు పెట్టారు. అలాగే, జగనన్న గోరుముద్దను ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం’గా మార్పు చేశారు. మన బడి – నాడు నేడును ‘మన బడి – మన భవిష్యత్తు’ అని, స్వేచ్ఛ పథకాన్ని ‘బాలికా రక్ష’ అని, జగనన్న ఆణిముత్యాలును ‘అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం’గా మార్చారు.
తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో నిత్యాన్నదాతగానూ, అన్నపూర్ణ గానూ ప్రసిద్ధి చెందిన వ్యక్తి డొక్కా సీతమ్మ. ఈమె డొక్కా జోగన్న పంతులును పెళ్లి చేసుకుంది. ఐతే మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడంతో ప్రస్తుతం ఈ ఫోటో షేర్ అవుతూ ఉంది. ఐతే ఇప్పుడు షేర్ అవుతున్న ఫొటోలో ఉన్నది డొక్కా సీతమ్మ కాదు. ఈ ఫోటో వక్త, సాహితీ వ్యాఖ్యాత అయిన శ్రీభాష్యం అప్పలాచార్యులు దంపతులది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా శ్రీభాష్యం పేరుతో ఉన్న ఒక బ్లాగ్‌లో ఇదే ఫోటోను షేర్ చేసినట్టు తెలిసింది.
ఈ బ్లాగ్‌లో శ్రీభాష్యం దంపతుల మరికొన్ని ఫోటోలు కూడా షేర్ చేసారు. దీన్నిబట్టి వైరల్ అవుతన్న ఫోటో డొక్కా సీతమ్మది కాదని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా డొక్కా సీతమ్మ ఫోటోలు ఎక్కువగా లేవు. ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న డొక్కా సీతమ్మ ఫోటో ఇక్కడ చూడొచ్చు (ఇక్కడ). ఈ ఫొటోకు ప్రస్తుతం షేర్ అవుతున్న ఫొటోకు సంబంధం లేదు.
చివరగా, సంబంధంలేని ఫోటోను డొక్కా సీతమ్మది అంటూ షేర్ చేస్తున్నారు.