Fake News, Telugu
 

ఈ విడియోలోని సంఘటన జరిగింది మహిళా శక్తి అనబడే సంస్థ సభలో, బీజేపీ మహిళా శక్తి సభలో కాదు

0

ఉత్తరప్రదేశ్, మౌలో బీజేపీ మహిళా శక్తి సభలో పరిస్థితి’ అంటూ ఒక వీడియోతో ఉన్న పోస్టును సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియో ద్వారా బీజేపీ మహిళలకు ఎంతగా గౌరవం ఇస్తుందో అర్ధం అవుతుందని పోస్ట్ ద్వారా అంటున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బీజేపీ మహిళా శక్తి సభలో మహిళలను అగౌరవపరుస్తున్న వీడియో.

ఫాక్ట్: బీజేపీకి ఈ వీడియోతో సంబంధంలేదు. మౌ నగరంలో మహిళా శక్తి అనబడే ఒక ఫేక్ ఎన్‌జీఓ సభ నిర్వహించినప్పుడు తీసిందే ఈ వీడియో. భర్త చనిపోయిన మహిళలకు ప్రభుత్వం నడుపుతున్న పధకాలను జీవితాంతం వర్తింపజేసే విధంగా చేస్తామని జనాలను మహిళా శక్తి సంస్థ ప్రలోభ పెట్టింది. ఇది తప్పుడు సమాచారం అని గ్రహించిన వెంటనే అక్కడి ప్రజలు, సంస్థ ఉద్యోగస్తులు వేదికపైకి ఎక్కి అధ్యక్షుడిని మరియు తోటివారిని కొట్టారు. తరువాత పోలీసులు మహిళా శక్తి వారిని అరెస్ట్ చేసారు. బీజేపీ మహిళా శక్తి సభలో మహిళలను అగౌరవపరిచిందని మాకు ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ లభించలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.

వీడియోను స్క్రీన్‌షాట్స్ తీసి, కీ వర్డ్స్ యూస్ చేసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అదే విజువల్స్‌తో ఉన్న ఒక యూట్యూబ్‌ వీడియో లభించింది. మహిళా శక్తి సంస్థ యొక్క అధ్యక్షుడిని జనాలు కొట్టారని ఈ వీడియోలో చెప్పారు. ప్రభుత్వం నడుపుతున్న పధకాలను జీవితాంతం వర్తింపజేసే విధంగా చేస్తామని జనాలను ప్రలోభ పెట్టారని, భర్త చనిపోయిన మహిళలకు ఈ సహాయం అందుతుందని చెప్పి సభకు జనాలను రప్పించారు. స్టేజి మీద ఆగ్రహంతో వచ్చిన కొంతమంది అక్కడ అధ్యక్షుడిగా పిలవబడే వ్యక్తిని కొట్టారని వీడియో ద్వారా తెలుస్తుంది. ఈ యూట్యూబ్‌ వీడియోలో బీజేపీ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఇదే విజువల్స్‌తో ఉన్న మరో రెండు వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ వీడియోల్లో కూడా బీజేపీ గురించి ఎటువంటి ప్రస్తావన లేదు.

మౌ నగరంలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో 14 సెప్టెంబర్ 2021న మహిళా శక్తి అనబడే ఒక సంస్థ సభ నిర్వహించింది. వితంతువు మహిళలకు జీవితకాల పెన్షన్, రైలులో స్వేచ్ఛగా ప్రయాణించడానికి సదుపాయం అంటూ కొన్ని స్కీంలతో ప్రలోభ పెట్టి అక్కడకు రప్పించారు. ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో మహిళలు, పురుషులు పాల్గొన్నారు.

మహిళా శక్తి సంస్థ జాతీయ అధ్యక్షుడు గులాబ్ జైస్వాల్ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు.  సంస్థ రిజిస్ట్రేషన్ ను అక్కడ మీడియా వ్యక్తులు అడిగినప్పుడు అధ్యక్షుడు తడబడటంతో కార్యక్రమానికి హాజరైన ప్రజలు మరియు సంస్థ ఉద్యోగస్తులు వేదికపైకి ఎక్కి అతన్ని కొట్టడం మొదలుపెట్టారు. గులాబ్ జైస్వాల్ తో సహా ఉన్న మహిళలు పారిపోతుండగా, ప్రజలు పట్టుకున్నారు. అక్కడికి వచ్చిన పోలీసులు గులాబ్ జైస్వాల్ మరియు నలుగురు మహిళలను స్టేషన్ తీసుకెళ్ళారని న్యూస్ ఆర్టికల్స్ ద్వారా ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.  

ఈ విషయాన్ని గురించి పోలీసు సూపరింటెండెంట్ సుశీల్ మాట్లాడుతూ, “ముగ్గురు మహిళలతో సహా మరికొందరు వేదిక నుండి అరెస్టు చేయబడ్డారు. విచారణ జరుగుతోంది.” ఈ వీడియో మౌ పోలీస్ వారి అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో చూడొచ్చు.

అది ఒక ఫేక్ ఎన్‌జీఓ అని, మరుసటి రోజే పోలీసులు గులాబ్ జైస్వాల్ ను లక్నోలో పట్టుకున్నట్టు ఆర్టికల్ ద్వారా చూడొచ్చు. దానికి సంబంధించి మౌ పోలీస్ వారి ట్వీట్ కూడ చూడొచ్చు.

బీజేపీ మహిళా శక్తి సభలో మహిళలను అగౌరవపరుస్తున్నట్లు మాకు న్యూస్ ఆర్టికల్స్ లభించలేదు.

చివరగా, మహిళా శక్తి అనబడే సంస్థ సభలో జరిగిన సంఘటనను పట్టుకొని బీజేపీ మహిళా శక్తి సభలో మహిళలను అగౌరవపరుస్తున్న వీడియో అని అంటున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll