Fake News, Telugu
 

వైరల్ ఫోటోలోని పువ్వు దక్షిణాఫ్రికా జాతీయ పుష్పం ‘కింగ్ ప్రొటియా’; ఇది ప్రతియేటా పూస్తుంది

0

నాలుగు వందల ఏళ్ళకి ఒకసారి మాత్రమే పుష్పించే మహామేరు పుష్పం అని చెప్తూ ఒక పువ్వు యొక్క ఫోటో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: 400 ఏళ్ళకు ఒకసారి పుష్పించే మహామీరు పుష్పం యొక్క ఫోటో.

ఫాక్ట్: ఫోటోలోని పువ్వు పేరు కింగ్ ప్రొటీయా. ఇది దక్షిణాఫ్రికా యొక్క జాతీయ పుష్పం. ఈ పువ్వు ప్రతియేటా పూస్తుంది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ ఫోటోనీ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఫోటోలోని పువ్వు పేరు ‘ప్రొటీ సైనరాయిడ్స్’ లేదా ‘కింగ్ ప్రొటీయా’ అని తెలిసింది. ఇది దక్షిణాఫ్రికా యొక్క జాతీయ పుష్పం.

వైరల్ ఫోటోలో ఉన్నది కింగ్ ప్రొటీయా యొక్క మొగ్గ. వివిధ వృక్షశాస్త్ర వెబ్సైట్ల (ఇక్కడ & ఇక్కడ) ప్రకారం, ఈ పువ్వు ఏడాది పొడవునా, ముఖ్యంగా వేసవిలో, పూస్తుంది. ఇక ప్రపంచంలో అత్యంత నెమ్మదిగా పుష్పించే పువ్వు ‘పుయా రైమండి’ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు పేర్కొన్నారు. ఈ పువ్వు 80- 150 ఏళ్లకు ఒకసారి పూస్తుంది. 400 ఏళ్లకు ఒకసారి పుష్పించే పువ్వు అంటూ ఏదీ నమోదు కాలేదని వృక్ష శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు.

మహామేరు పువ్వు ఫోటోలు అని గతంలో కూడా సోషల్ మీడియాలో అనేక ఫోటోలు ప్రచారం అయినప్పుడు ఫ్యాక్ట్లీ రాసిన ఫాక్ట్-చెక్ కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, వైరల్ ఫోటోలోని పువ్వు ఏడాది పొడవునా పూసే కింగ్ ప్రొటీయా. ఇది దక్షిణాఫ్రికా జాతీయ పుష్పం.

Share.

About Author

Comments are closed.

scroll