Fake News, Telugu
 

ఈ వీడియోలో కనిపిస్తున్న క్లాక్ టవర్‌పై రాముడి చిత్ర ప్రదర్శన డెహ్రాడూన్‌లో జరిగింది, శ్రీనగర్‌లో కాదు

0

అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట జరుగనున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్‌లోని క్లాక్ టవర్‌పై శ్రీరాముడి చిత్రాలు ప్రదర్శించారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. నరేంద్రమోదీ వల్లే ఇది సాధ్యమైందని చెప్తూ ఈ వీడియోను షేర్ ఉంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: శ్రీనగర్‌లోని క్లాక్ టవర్‌పై శ్రీరాముడి చిత్రాలు ప్రదర్శించిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో కనిపిస్తున్న శ్రీరాముడి చిత్ర ప్రదర్శన డెహ్రాడూన్‌లో జరిగింది. అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో డెహ్రాడూన్‌లోని క్లాక్ టవర్‌పై లేజర్ లైట్ ద్వారా శ్రీరాముడి చిత్రాలు ప్రదర్శించారు. వార్తా కథనాలు ఈ దృశ్యాలను రిపోర్ట్ చేసాయి. కాగా శ్రీనగర్‌లోని క్లాక్ టవర్‌పై శ్రీరాముడి చిత్రాలు ప్రదర్శించినట్టు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియోలో చూపిస్తున్నట్టు క్లాక్ టవర్‌పై శ్రీరాముడి చిత్రాలు ప్రదర్శించిన విషయం నిజమే అయినప్పటికీ ఇది జరిగింది శ్రీనగర్‌లోని కాదు, డెహ్రాడూన్‌లో. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం వెతకగా వీడియోలో కనిపిస్తున్నట్టు క్లాక్ టవర్‌పై శ్రీరాముడి చిత్రాలు ప్రదర్శించిన దృశ్యాలను రిపోర్ట్ చేసిన వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ).

ఈ కథనాల ప్రకారం ఈ ప్రదర్శన ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగినట్టు తెలుస్తుంది. అయోధ్యలో జరుగనున్న రామాలయ ప్రాణప్రతిష్టను స్వాగతిస్తూ 18 జనవరి 2024 నాడు డెహ్రాడూన్‌లోని క్లాక్ టవర్‌పై లేజర్ లైట్ ద్వారా శ్రీరాముడి చిత్రాలు ప్రదర్శించారని ఈ కథనాలు రిపోర్ట్ చేసాయి.

ఈ వివరాల ఆధారంగా వెతకగా ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను ఒక లోకల్ వార్తా ఛానల్ యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన వీడియో కనిపించింది. ఈ ఛానల్ కూడా ఈ దృశ్యాలు డెహ్రాడూన్‌లో జరిగిన లేజర్ షో అనే చెప్తున్నాయి.

ఈ వివరాల ఆధారంగా గూగుల్ మ్యాప్స్‌లో వెతకగా వీడియోలో కనిపిస్తున్న క్లాక్ టవర్‌ డెహ్రాడూన్‌లో ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా శ్రీనగర్‌లో ఉన్న క్లాక్ టవర్‌ని ఇక్కడ చూడొచ్చు. ఐతే ఈ క్లాక్ టవర్‌ ఆకారం ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోలోని క్లాక్ టవర్‌నతో పోల్చితే భిన్నంగా ఉండడం గమనించొచ్చు. ఈ వివరాల బట్టి ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోకు శ్రీనగర్‌తో సంబంధంలేదని స్పష్టమవుతుంది.

ఇకపోతే అయోధ్యలో రామాలయ ప్రాణప్రతిష్ట నేపథ్యంలో శ్రీనగర్‌లోని క్లాక్ టవర్‌పై శ్రీరాముడి చిత్రాలు ప్రదర్శించినట్టు మాకు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు.

చివరగా, ఈ వీడియోలో చూపిస్తున్న క్లాక్ టవర్‌పై రాముడి చిత్ర ప్రదర్శన డెహ్రాడూన్‌లో జరిగింది, శ్రీనగర్‌లో కాదు.

Share.

About Author

Comments are closed.

scroll