Fake News, Telugu
 

కాంగ్రెస్ మరియు బీజేపీ ప్రభుత్వాలు బడ్జెట్‌లో అభివృద్ధి పనుల కోసం ఒకే విధంగా కేటాయింపులు జరిపాయి

0

గత కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే మోదీ ప్రభుత్వం అభివృద్ధి పనుల మీద ఎక్కువ ఖర్చు చేసిందని చెప్పే క్రమంలో 2004-14 మధ్య కాలంలో 49.2 లక్షల కోట్లు అభివృద్ధి పనుల మీద ఖర్చు చేయగా, మోదీ ప్రభుత్వం 2014 నుండి ఇప్పటివరకి అభివృద్ధి పనుల మీద 91 లక్షల కోట్లు ఖర్చు చేసిందని పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఈ పోస్టులో చేస్తున్న వాదనకు సంబంధించి నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: గత పది సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే మోదీ ప్రభుత్వం అభివృద్ధి పనుల మీద ఎక్కువ ఖర్చు చేసింది.

ఫాక్ట్ (నిజం): 2004 నుండి 2022 మధ్య కాలంలో అభివృద్ధి పనుల కోసం చేసిన ఖర్చుల నికర విలువ పెరిగినప్పటికీ, ఒక సంవత్సరంలో ప్రభుత్వాలు చేసే మొత్తం ఖర్చులలో అభివృద్ధి పనుల కోసం కేటాయించే వాటాలో పెద్దగా మార్పు లేదు. కాంగ్రెస్ మరియు బీజేపీ అధికారంలో ఉన్న 2004 – 2022 కాలంలో కేవలం కొన్ని సందర్భాలలో మాత్రమే క్యాపిటల్ వ్యయం 14% దాటింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలలో చేసిన మొత్తం ఖర్చులో అభివృద్ధి పనుల కోసం కేటాయించిన వాటా సగటు మరియు బీజేపీ అధికారంలో ఉన్న ఈ సంవత్సరాలలో అభివృద్ధి పనుల కోసం కేటాయించిన వాటా సగటు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సాధారణంగా ప్రతీ సంవత్సరం ప్రభుత్వం చేయబోయే ఖర్చులను బడ్జెట్‌లో ముఖ్యంగా క్యాపిటల్ వ్యయం మరియు రెవెన్యూ వ్యయం అనే రెండు పద్దుల రూపంలో విభజిస్తారు.

రెవెన్యూ వ్యయం : ప్రభుత్వం చేసే రోజువారీ ఖర్చుని రెవెన్యూ వ్యయం కింద పరిగణిస్తారు. అంటే సాధారణ పరిపాలనకు అవసరమైన ఖర్చు, జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, రుణాల వడ్డీ మదలైన వివిధ రకాల ఖర్చులను రెవెన్యూ వ్యయం కింద పరిగణిస్తారు.  

క్యాపిటల్ వ్యయం : మౌలిక వసతుల ఏర్పాటు, రోడ్లు, ప్రాజెక్ట్‌లు, పరిశ్రమలు మొదలైనవాటి నిర్మాణంపై ప్రభుత్వం చేయబోయే ఖర్చును క్యాపిటల్ వ్యయంగా పరిగణిస్తారు.

ప్రతీ సంవత్సరం ప్రభుత్వం అభివృద్ధి పనులపై చేసే ఖర్చులు ముఖ్యంగా ఈ రెండు పద్దుల కిందే కేటాయిస్తారు. ఈ రెండింటిలో క్యాపిటల్ వ్యయం ద్వారా ప్రభుత్వం నేరుగా అభివృద్ధి పనులపై ఖర్చు చేస్తుంది.

ఐతే అభివృద్ధి పనులపై రెండు ప్రభుత్వాలు చేసిన ఖర్చులను పోల్చే సందర్భంలో కేవలం ప్రభుత్వాలు చేసిన ఖర్చుల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకుంటే ఆయా ప్రభుత్వాల ప్రాధాన్యతల (అభివృద్ధి, మొదలైన అంశాలు) గురించి స్పష్టత రాదు.  ఉదాహారణకి 2004 -14 కాలంతో పోల్చుకుంటే 2014 -22 కాలంలో అభివృద్ధి పనులపై చేసే ఖర్చుల నికర విలువ సహజంగానే ఎక్కువ ఉంటుంది. కానీ, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది సహజంగా జరిగే పెరుగుదల మాత్రమే, ఎలాగైతే ప్రతీ సంవత్సరం సహజంగా దేశ స్థూల దేశీయ ఉత్పత్తి (GDP) పెరుగుతుందో, అలాగే అభివృద్ధి పనులపై చేసే నికర ఖర్చులు పెరుగుతాయి.

అందుకే ఆయా ప్రభుత్వాలు ప్రతీ సంవత్సరం చేసే మొత్తం ఖర్చుల్లో అభివృద్ధి పనులపై చేసిన ఖర్చుల వాటా పరిగణలోకి తీసుకంటే అభివృద్ధికి ఏ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యతను ఇచ్చిందన్న విషయం స్పష్టమవుతుంది. అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న 2004 -14 కాలంలో ప్రతీ సంవత్సరం చేసిన మొత్తం ఖర్చులలో అభివృద్ధి పనులపై చేసిన ఖర్చుల వాటాని, మోడీ నాయకత్వంలోని బీజేపీ అధికారంలో ఉన్న  2014 -22 కాలంలో అభివృద్ధి పనులకు కేటాయించిన వాటాని పోల్చినప్పుడు మనకు ఆయా ప్రభుత్వాలు అభివృద్ధి పనులకు ఇచ్చిన ప్రాధాన్యతపై స్పష్టత వస్తుంది.

2004-22 కాలంలో అభివృద్ధి కోసం చేసిన కేటాయింపులు:

2004-22 మధ్య ప్రవేశపెట్టిన బడ్జెట్లలోని వివరాల ప్రకారం బడ్జెట్‌లో అభివృద్ధి పనుల కోసం కేటాయించిన వాటాకు  సంబంధించి కాంగ్రెస్ మరియు బీజేపీ రెండు పార్టీలు ఒకేలా కేటాయింపులు జరిపాయి. 2014 -22 కాలంలో కేవలం కొన్ని సంవత్సరాలు మినహాయిస్తే ప్రభుత్వాలు చేసిన మొత్తం ఖర్చులలో (వ్యయం)  క్యాపిటల్ వ్యయం 14% కన్నా తక్కువగానే ఉంది. అంటే ఒక సంవత్సరంలో ప్రభుత్వాలు చేసే మొత్తం ఖర్చులో మౌలిక వసతుల ఏర్పాటు, వివిధ  ప్రాజెక్ట్‌లు మరియు పరిశ్రమల ఏర్పాటు వంటి అభివృద్ధి పనుల కోసం చేసే ఖర్చు 14% కన్నా తక్కువగానే ఉంది.

2004-05 సంవత్సరంలో మొత్తం వ్యయంలో 19.32% క్యాపిటల్ వ్యయం కోసం కేటాయించగా, ఆ తర్వాత కేవలం ఒక సంవత్సరాన్ని మినహాయిస్తే మిగతా సంవత్సరాలలో క్యాపిటల్ వ్యయం 14% కన్నా తక్కువే ఉంది. అలాగే బీజేపీ అధికారంలో ఉన్న 2014 -22 కాలంలో కూడా కేవలం మూడు సంవత్సరాలలో మాత్రమే 14% కన్నా ఎక్కవ ఉంది. 2022-23  బడ్జెట్‌లో అత్యధికంగా 19.02% క్యాపిటల్ వ్యయం (మొత్తం వ్యయంలో) కేటాయించింది.

2004 నుండి 2022 వరకు బడ్జెట్‌లో క్యాపిటల్ వ్యయం పెరుగుతూ వస్తున్నప్పటికీ మొత్తం వ్యయంలో క్యాపిటల్ వ్యయం యొక్క వాటాలో పెద్దగా మార్పు లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పది సంవత్సరాల (2004-14) కాలంలో బడ్జెట్‌లో క్యాపిటల్ వ్యయం వాటా యొక్క సగటు, మరియు బీజేపీ అధికారంలో  ఉన్న (2014 -22) కాలంలో బడ్జెట్‌లో క్యాపిటల్ వ్యయం వాటా యొక్క సగటు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. అలాగే రెవెన్యూ వ్యయానికి సంబంధించి కూడా కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు జరిపిన కేటాయింపులలో పెద్ద తేడా లేదు. దీన్నిబట్టి కాంగ్రెస్ మరియు బీజేపీ అభివృద్ధి పనుల కోసం ఒకేలా ఖర్చు చేసాయని స్పష్టమవుతుంది.

చివరగా, కాంగ్రెస్ మరియు బీజేపీ ప్రభుత్వాలు బడ్జెట్‌లో అభివృద్ధి పనుల కోసం ఒకే విధంగా కేటాయింపులు జరిపాయి.

Share.

About Author

Comments are closed.

scroll