Fake News, Telugu
 

14 మే 2025 నుండి ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకులు పని చేయవు అనే వాదనలో నిజం లేదు; ఈ వైరల్ న్యూస్ వీడియో 2017 నాటిది

0

ఇకపై ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకులు పని చేయవంటూ ఓ న్యూస్ రిపోర్ట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో “పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇంధన వనరుల వాడకం తగ్గించడం కోసం ప్రతి ఆదివారం పెట్రోల్ బంకులకు సెలవు ప్రకటించారు, మే నెల 14వ తేదీ నుండి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందనీ పెట్రోల్ బంకుల యజమానులు సంఘం తెలియజేసింది, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోలియం వాడకం తగ్గించడం ద్వారా ఇంధన వనరుల పరిరక్షణ చేయుట కొరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెట్రోల్‌ బంకులు యజమానులు సంఘం తెలియజేసింది” అని పేర్కొన్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 14 మే 2025 నుండి ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకులు పని చేయవు – ఈటీవీ న్యూస్ రిపోర్ట్.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ న్యూస్ రిపోర్ట్ వీడియో 2017 నాటిది. వివిధ మీడియా కథనాల ప్రకారం, 2017లో మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడటానికి చమురును ఆదా చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఇంధన వనరుల వాడకం తగ్గించడం కోసం ఎంపిక చేసిన 8 రాష్ట్రాల్లో (తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా) ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకులకు సెలవు ప్రకటిస్తున్నట్టు పెట్రోల్‌ బంకుల యజమానుల సంఘం తెలిపింది. అయితే, ఆ ప్రణాళికను తరువాత ఉపసంహరించుకున్నారు. అలాగే, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు ఎలాంటి అధికారిక సమాచారం జారీ చేయలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా 14 మే 2025 నుండి ఎంపిక చేసిన 8 రాష్ట్రాల్లో ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకులకు సెలవు ప్రకటిస్తున్నట్టు పెట్రోల్‌ బంకుల యజమానుల సంఘం తెలిపిందా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికగా, ఇటీవల అలాంటి ప్రకటనను పెట్రోల్‌ బంకుల యజమానుల సంఘం చేసినట్లు ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లభించలేదు. అలాగే ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకులు మూసివేయాలని కేంద్ర ప్రభత్వం లేదా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు కూడా ఎలాంటి రిపోర్ట్స్ లేవు.

ఈ క్రమంలోనే, “మే 14 నుంచి ఎనిమిది రాష్ట్రాల్లో ఆదివారాల్లో పెట్రోల్ బంకులు మూసివేయబడతాయి” అని పేర్కొంటూ ఏప్రిల్ 2017లో ప్రచురించబడిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 2017లో మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడటానికి చమురును ఆదా చేయాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఇంధన వనరుల వాడకం తగ్గించడం కోసం ఎంపిక చేసిన 8 రాష్ట్రాల్లో (తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా) ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకులకు సెలవు ప్రకటిస్తున్నట్టు భారత పెట్రోలియం డీలర్ల కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేష్ కుమార్ తెలిపారు. అయితే, ఈ ప్రణాళికను తరువాత ఉపసంహరించుకున్నారు.

రిపోర్ట్స్ ప్రకారం, ఆదివారాల్లో పెట్రోల్ బంకులు మూసివేయాలనే నిర్ణయానికి పెట్రోల్ బంకుల యజమానుల సంఘం భిన్నమైన కారణాలు పేర్కొంది. మొదట డీలర్లకు కమిషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు పిలుపునిచ్చినట్లు అసోసియేషన్ పేర్కొంది. అయితే తరువాత, ఇంధన పరిరక్షణపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ఇచ్చిన పిలుపు మేరకు ప్రతిస్పందనగా ఇది జరిగిందని తెలిపింది.

ఇకపోతే ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి యూట్యూబ్‌లో వెతకగా, ఇదే వీడియోను తెలుగు మీడియా సంస్థ ‘ఈటీవీ’ వారి అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో (ETV Andhra Pradesh) 19 ఏప్రిల్ 2017న షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ న్యూస్ రిపోర్ట్ కూడా, పర్యావరణాన్ని కాపాడటానికి చమురును ఆదా చేయాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన వనరుల వాడకం తగ్గించడం కోసం 8 రాష్ట్రాల్లో (తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా) ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకులకు సెలవు ప్రకటిస్తున్నట్టు భారత పెట్రోలియం డీలర్ల కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సురేష్ కుమార్ తెలిపినట్లు పేర్కొంది.

చివరగా, 14 మే 2025 నుండి ప్రతి ఆదివారం పెట్రోల్‌ బంకులు పని చేయవు అనే వాదనలో నిజం లేదు. ఈ వైరల్ న్యూస్ రిపోర్ట్ వీడియో 2017 నాటిది.

Share.

About Author

Comments are closed.

scroll