“వక్షోజాలను పట్టుకోవడం, పైజామా తీసేయడం అత్యాచారం కిందకు రాదని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు జడ్జి గతంలో VHP సమావేశంలో పాల్గొన్నాడు”అని క్లెయిమ్ చేస్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: వక్షోజాలను పట్టుకోవడం, పైజామా తీసేయడం అత్యాచారం కాదని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు జడ్జి గతంలో VHP సమావేశంలో పాల్గొన్నారు.
ఫాక్ట్(నిజం): 17 మార్చి 2025న వక్షోజాలను పట్టుకోవడం, పైజామా తీసేయడం అత్యాచారం కాదని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా, 2024 డిసెంబర్‌లో విశ్వ హిందూ పరిషత్ (VHP) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తులలో ఒకరు కాదు. అలాగే, అలహాబాద్ హైకోర్టు జడ్జి రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా గతంలో VHP సమావేశంలో పాల్గొన్నట్లు కూడా ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ క్లెయింలో పేర్కొనట్లుగా, వక్షోజాలను పట్టుకోవడం, పైజామా తీసేయడం అత్యాచారం కిందకు రాదని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు జడ్జి గతంలో VHP సమావేశంలో పాల్గొనలేదు.
వైరల్ పోస్టులో ప్రస్తావించిన ‘ది ప్రింట్” కథనం ప్రకారం, డిసెంబర్ 2024లో అలహాబాద్ హైకోర్టు ప్రాంగణంలోని హైకోర్టు లైబ్రరీ హాల్‌లో జరిగిన విశ్వ హిందూ పరిషత్ (VHP) లీగల్ సెల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులు ఇద్దరు, దినేష్ పాఠక్, శేఖర్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్ (UCC), మత మార్పిడికి కారణాలు, నివారణపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమం గురించి VHP ఇంటర్నేషనల్ అధ్యక్షుడు అలోక్ కుమార్ మాట్లాడుతూ, నిర్దిష్ట అంశాలపై ప్రస్తావించడానికి వారిని (జడ్జిలను) అధ్యాపకులుగా ఆహ్వానించారని చెప్పారని ఈ కథనం పేర్కొంది.

ఇకపోతే , పలు కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), 2021వ సంవత్సరం ఉత్తర ప్రదేశ్‌లోని కాస్‌గంజ్ ప్రాంతానికి చెందిన 11 ఏళ్ల బాలికపై ఇద్దరు యువకులు దారుణానికి పాల్పడ్డారు. ఆ బాలిక వక్షోజాలు పట్టుకుని కల్వర్టు కిందకు లాగే ప్రయత్నం చేశారు. అలాగే ఆమె ప్యాంటు నాడాలు కట్ చేసి ఆమె ప్యాంటు విప్పేసేందుకు ప్రయత్నించారు. కానీ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు అడ్డుకొని పోలీసులకు అప్పగించగా, కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి, ట్రయల్ కోర్టులో హాజరుపరిచారు. దీంతో ప్రత్యేక ట్రయల్ కోర్టు న్యాయమూర్తి 23 జూన్ 2023న, అత్యాచారం, పోక్సో చట్టం కింద సమన్లు జారీ చేసింది. ఈ సమన్ల ఉత్తర్వును సవాలు చేస్తూ నిందితులు 2024లో అలహాబాద్ హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ (CRIMINAL REVISION No. – 1449 of 2024) దాఖలు చేశారు. బాధిత బాలికకు, నిందితుడి కుటుంబానికి మధ్య పాత గొడవలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో “కక్షలు తీర్చుకోవడానికి” ఈ అత్యాచారం ఆరోపణ బనాయించబడిందని నిందితుల తరపు న్యాయవాది అలహాబాద్ హైకోర్టు విచారణలో వాదించారు. ఈ పిటిషన్‌ను 17 మార్చి 2025న విచారించిన జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా, ట్రయల్ కోర్టు సమన్లలోని సెక్షన్లను సవరిస్తూ తీర్పు వెలువరించారు. మైనర్ బాలిక వక్షోజాలను తాకడం, ఆమె పైజామా తాడును తెంపడం, కల్వర్టు కిందకు తీసుకెళ్లడాన్ని అత్యాచారంగా, అత్యాచార యత్నంగా పరిగణించలేమని అన్నారు. నిందితులు చేసిన నేరాలు పోక్సో చట్టంలోని సెక్షన్ 18, సెక్షన్ 376 కిందకు రావని, నిందితులపై పోక్సో చట్టంలోని సెక్షన్ 9/10 (తీవ్రమైన లైంగిక వేధింపులు), సెక్షన్ 354-బి (మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో దాడి) కింద కేసులు నమోదు చేసి విచారించాలని ఆదేశించారు. ఈ తీర్పు కాపీని ఇక్కడ చూడవచ్చు.

ఈ సమాచారం ఆధారంగా, 17 మార్చి 2025న, వక్షోజాలను పట్టుకోవడం, పైజామా తీసేయడం అత్యాచారం కాదని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి, 2024 డిసెంబర్‌లో విశ్వ హిందూ పరిషత్ (VHP) నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న న్యాయమూర్తులలో ఒకరు కాదని మనం నిర్ధారించవచ్చు. అలాగే, అలహాబాద్ హైకోర్టు జడ్జి రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా గతంలో VHP సమావేశంలో పాల్గొన్నట్లు ఎలాంటి విశ్వసనీయ రిపోర్ట్స్ లభించలేదు.
చివరగా, వక్షోజాలను పట్టుకోవడం పైజామా తీసేయడం అత్యాచారయత్నం కాదని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు జడ్జి డిసెంబర్ 2024లో జరిగిన ఒక VHP సమావేశంలో పాల్గొన్నాడు అనే వాదనలో నిజం లేదు.