1918 లోనే ‘పూజారి ఒడిలో పెళ్లికూతురు కూర్చోవడం’ అనే ఆచారాన్ని బ్రిటిషువారు చట్టం చేసి రద్దు చేశారు అని, అయితే అదే ఆచారం ఇప్పుడు పునరావృతం అవుతుందని చెప్తూ కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: పూజారి ఒడిలో పెళ్లికూతురు కూర్చున్న దృశ్యాలు. ఈ ఆచారాన్ని బ్రిటిషువారు 1918లోనే చట్టం చేసి రద్దు చేశారు.
ఫాక్ట్: వైరల్ అవుతున్న ఫొటోలలో పెళ్లికూతురు తన తండ్రి ఒడిలో కూర్చొన్నది. తమిళ బ్రాహ్మణుల వివాహాల్లో, ముఖ్యంగా అయ్యంగార్ బ్రాహ్మణుల వివాహాల్లో, వధువు వరుడి చేత తాళి కట్టించుకునే సమయంలో తన తండ్రి ఒడిలో కూర్చోవడం వారి ఆచారంగా భావిస్తారు. ఇక, 1918లో బ్రిటిష్ ప్రభుత్వం ‘పూజారి ఒడిలో పెళ్లికూతురు కూర్చోవడం’ అనే ఆచారాన్ని చట్టం చేసి రద్దు చేసినట్లు ఆధారాలు లేవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ అవుతున్న ఫొటోలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ ఫోటో 2019లో చెన్నైలో జరిగిన ఒక తమిళ బ్రాహ్మణ యువతికి ఒక విదేశీ వ్యక్తితో జరిగిన పెళ్లిలో తీసినదిగా తెలిసింది. పెళ్లికొడుకు తాళి కట్టే సమయంలో పెళ్లికూతురు తన తండ్రి ఒడిలో కూర్చొన్నది.
మరొక వైరల్ ఫొటో, 2016లో కేరళలో జరిగిన తమిళ బ్రాహ్మణ పెళ్లిలో తీసినది. ఇందులో కూడా పెళ్లికూతురు తన తండ్రి ఒడిలో కూర్చొన్న ఫొటోలు మరియు వీడియో ఇక్కడ చూడవచ్చు. తమిళ బ్రాహ్మణుల వివాహాల్లో, ముఖ్యంగా అయ్యంగార్ బ్రాహ్మణుల వివాహాల్లో, వధువు వరుడి చేత తాళి కట్టించుకునే సమయంలో తన తండ్రి ఒడిలో కూర్చోవడం వారి ఆచారంగా భావిస్తారు. దీనికి సంబంధించిన వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
ఇక, ‘పూజారి ఒడిలో పెళ్లికూతురు కూర్చోవడం’ అనే ఆచారాన్ని 1918లో బ్రిటిష్ ప్రభుత్వం రద్దు చేయడం గురించి న్యాయశాఖ అధికారిక వెబ్‌సైట్లో వెతకగా, 1918లో అటువంటి చట్టం చేయలేదు అని తెలుస్తుంది. అలాగే, ఇటువంటి ఆచారాన్ని రద్దు చేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం కానీ భారత ప్రభుత్వం కానీ చట్టం చేసినట్లు ఆధారాలు లేవు.
చివరిగా, వైరల్ అవుతున్న ఫొటోలలో పెళ్లికూతురు కూర్చున్నది తన తండ్రి ఒడిలో మరియు బ్రిటిష్ ప్రభుత్వం ‘పూజారి ఒడిలో పెళ్లికూతురు కూర్చోవడం’ అనే ఆచారాన్ని చట్టం చేసి రద్దు చేసినట్లు ఆధారాలు లేవు.