Fake News, Telugu
 

BRICS దేశాలు అధికారికంగా BRICS కరెన్సీని ఆమోదించి విడుదల చేయలేదు; వైరల్ ఫొటోలో ఉంది కేవలం సింబాలిక్ నోట్‌ మాత్రమే

0

ఇటీవల 16వ బ్రిక్స్(BRICS) సమ్మిట్ 22 అక్టోబర్ 2024 నుండి 24 అక్టోబర్ 2024 వరకు రష్యాలోని కజాన్‌లో రష్యా అధ్యక్షతన ‘Strengthening Multilateralism for Just Global Development and Security’ అనే థీమ్‌తో జరిగింది (ఇక్కడ). ఈ సంవత్సరం కొత్తగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లను బ్రిక్స్ కూటమిలో చేరాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఇటీవల 16వ బ్రిక్స్ సమ్మిట్ జరిగిన నేపథ్యంలో, “డాలర్‌కు చెక్ పెట్టేందుకు బ్రిక్స్ దేశాలు కొత్త బ్రిక్స్ కరెన్సీ ని విడుదల చేశాయి” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: డాలర్‌కు చెక్ పెట్టేందుకు బ్రిక్స్(BRICS) దేశాలు కొత్త బ్రిక్స్(BRICS) కరెన్సీని విడుదల చేశాయి.

ఫాక్ట్(నిజం): బ్రిక్స్(BRICS) దేశాలు అధికారికంగా కొత్త బ్రిక్స్ కరెన్సీని విడుదల చేయలేదు. వైరల్ ఫొటోలో ఉంది కేవలం సింబాలిక్ నోట్‌ మాత్రమే. ఇటీవల రష్యాలోని కజాన్‌లో జరిగిన 16వ బ్రిక్స్ సదస్సులో రష్యా అధికారి ఒకరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఈ సింబాలిక్ కరెన్సీ నోటును ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ నోటును తన మంత్రులకు చూపించిన తర్వాత, దానిని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా అధిపతికి ఇచ్చారు. బ్రిక్స్ కరెన్సీకి సంబంధించి రష్యా 2023 నుంచే పలు ప్రతిపాదనలు చేసిందని పలు రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా ఇటీవల బ్రిక్స్ దేశాలు కొత్త బ్రిక్స్ కరెన్సీ ని విడుదల చేశాయా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, బ్రిక్స్ దేశాలు అధికారికంగా కొత్త బ్రిక్స్ కరెన్సీని విడుదల చేశాయి అనే చెప్పే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు. ఒకవేళ ఇలాంటి ఏదైనా కరెన్సీ నోటును బ్రిక్స్ దేశాలు అధికారికంగా విడుదల చేసి ఉంటే ఖచ్చితంగా అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్ట్  చేసి ఉండేవి. అలాగే మేము BRICS అధికారిక వెబ్సైటును కూడా పరిశీలించాము, అక్కడ కూడా బ్రిక్స్ దేశాలు అధికారికంగా కొత్త బ్రిక్స్ కరెన్సీని విడుదల చేశాయి అని చెప్పే ఎటువంటి సమాచారం మాకు లభించలేదు.

ఈ క్రమంలోనే, మేము 24 అక్టోబర్ 2024న ప్రచురించబడిన ‘ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్’ రిపోర్ట్ కనుగొన్నాము, ఈ రిపోర్ట్ ప్రకారం, “కజాన్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో, బ్రిక్స్ సభ్య దేశాల జెండాలను కలిగి ఉన్న సింబాలిక్ బ్యాంక్‌నోట్‌ను ఆవిష్కరించారు, ఇది US డాలర్‌కు ప్రత్యామ్నాయాలను సృష్టించడం మరియు ప్రోత్సహించడంపై చర్చలకు దారితీసింది.”  

16వ బ్రిక్స్ సమ్మిట్‌కు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను రష్యా అధికారిక మీడియా ఏజెన్సీ స్పుత్నిక్ (Sputnik) 23 అక్టోబర్ 2024న తమ అధికారిక X (ట్విట్టర్)లో “At the summit in Kazan, Putin was shown a symbolic “BRICS banknote’. The note ‘represents the collective work being carried out within the BRICS framework’.” అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. దీన్ని బట్టి ఇది ఒక సింబాలిక్ నోటు మాత్రమేనని స్పష్టమవుతోంది.  

అలాగే ఇది కేవలం ఒక సింబాలిక్ నోట్‌ మాత్రమే అని అంటే బ్రిక్స్ దేశాలు ఏవీ ఈ నోటును ఆమోదించలేదు అని, బ్రిక్స్ దేశాలు అధికారిక కరెన్సీపై ఇంకా ఎలాంటి  నిర్ణయం తీసుకోలేదని రష్యా దౌత్య మిషన్ అధికారులు తయారు చేశారని, దీనికి భారత అధికారుల జోక్యం లేదా మరే ఇతర దేశం ఆమోదం లేదు అని, ఈ 16వ బ్రిక్స్ సదస్సులో రష్యా అధికారి ఒకరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఈ సింబాలిక్ కరెన్సీ నోటును ఇచ్చారని, ఈ నోటును తన మంత్రులకు చూపించిన తర్వాత, అధ్యక్షుడు పుతిన్ దానిని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ రష్యా అధిపతికి అందజేశారని పేర్కొన్న పలు రిపోర్ట్స్ లభించాయి (ఇక్కడ).

బ్రిక్స్ కరెన్సీకి సంబంధించి రష్యా 2023 నుంచే పలు ప్రతిపాదనలు చేసిందని పలు రిపోర్ట్స్ తెలుపుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). బ్రిక్స్ దేశాలు అమెరికా డాలర్‌ను పూర్తిగా తిరస్కరించడం లేదని, అయితే దానికి యాక్సెస్‌పై ఆంక్షలు కొనసాగితే ప్రత్యామ్నాయాలను సిద్ధం చేస్తున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో స్పష్టం చేశారు (ఇక్కడ, ఇక్కడ).

అలాగే బ్రిక్స్ దేశాలు అధికారికంగా కొత్త బ్రిక్స్ కరెన్సీని విడుదల చేశాయి అంటూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కాగా, ‘ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని, బ్రిక్స్ దేశాలకు సంబంధించి కామన్ కరెన్సీ అంటూ లేదు’ అని స్పష్టం చేస్తూ భారత ప్రభుత్వానికి చెందిన ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’(PIB) సంస్థ తమ అధికారిక ఫాక్ట్-చెకింగ్ X(ట్విట్టర్) హ్యాండిల్‌లో పోస్ట్ చేసింది.

చివరగా, బ్రిక్స్(BRICS) దేశాలు అధికారికంగా కొత్త బ్రిక్స్ కరెన్సీని ఆమోదించి విడుదల చేయలేదు; వైరల్ ఫొటోలో ఉంది కేవలం సింబాలిక్ నోట్‌ మాత్రమే.

Share.

About Author

Comments are closed.

scroll