Fake News, Telugu
 

మోటారు సైకిళ్లపై వచ్చి దొంగతనాలకు పాల్పడే దుండగులను కారుతో ఢీకొట్టి చంపడానికి బ్రెజిల్ తమ పౌరులను అనుమతించలేదు

0

“బ్రెజిల్‌లోకి శరణార్థులుగా, దొంగతనంగా ప్రవేశించి మోటారు సైకిళ్లపై వచ్చి దొంగతనాలు చేస్తున్న వారిని కారుతో గుద్ధి చంపడానికి బ్రెజిల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందిట” అని చెప్తూ ఉన్నపోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టులకు మద్దతుగా కొన్ని వీడియో క్లిప్‌లను జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ వీడియో క్లిప్‌లలో కొంతమంది మోటార్‌ సైకిళ్లపై వచ్చి దొంగతనాలకు పాల్పడుతుండగా, మరికొందరు వారిని కారుతో ఢీకొట్టడాన్ని మనం చూడవచ్చు. ఇదే వీడియో క్లిప్‌లను షేర్ చేస్తూ మరి కొన్ని పోస్టులలో “బ్రెజిల్‌లో మోటారు సైకిళ్లపై వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ముస్లింలను కారుతో గుద్ధి చంపడానికి బ్రెజిల్ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందిట” అని క్లెయిమ్ చేస్తున్నారు (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఇలాంటి మరిన్ని పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బ్రెజిల్‌లో మోటారు సైకిళ్లపై వచ్చి దొంగతనాలకు పాల్పడే  దుండగులను/ముస్లింలను కారుతో ఢీకొట్టి చంపడానికి బ్రెజిల్ ప్రభుత్వం అనుమతించింది. అందుకు సంబంధించిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వాదనలో ఎలాంటి నిజం లేదు. బైకులపై వచ్చి దొంగతనాలకు పాల్పడే దుండగులను కారుతో ఢీకొట్టి చంపడానికి బ్రెజిల్ ప్రభుత్వం తమ పౌరులను అనుమతించలేదు. దొంగతనాలకు పాల్పడే వ్యక్తులను చంపడాన్ని అనుమతించే చట్టం ఏదీ బ్రెజిల్‌లో లేదు. 1988లోనే బ్రెజిల్, మిలిటరీకి సంబంధించిన నేరాలకు మినహా అన్ని సైనికేతర నేరాలకు క్యాపిటల్ పనిష్మెంట్ (మరణశిక్ష) రద్దు చేసింది. ఈ వైరల్ వీడియో క్లిప్‌లు బ్రెజిల్‌లో రోడ్లపై జరిగిన పలు దోపిడీలకు సంబంధించిన దృశ్యాలను చూపుతున్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా బ్రెజిల్‌లో మోటారు సైకిళ్లపై వచ్చి దొంగతనాలకు పాల్పడే దుండగులను/ముస్లింలను కారుతో ఢీకొట్టి చంపడానికి బ్రెజిల్ ప్రభుత్వం ఇటీవల అనుమతించిందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, బ్రెజిల్‌లో ఇలాంటి చట్టం ఉందని, లేదా  మోటారు సైకిళ్లపై వచ్చి దొంగతనాలకు పాల్పడే  దుండగులను ప్రజలు తమ కార్లతో ఢీకొట్టి చంపడానికి ఇటీవల బ్రెజిల్ ప్రభుత్వం అనుమతించింది అని చెప్పే ఎటువంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు. అలాగే ఈ క్రమంలోనే 1988లోనే బ్రెజిల్‌, మిలిటరీకి సంబంధించిన నేరాలకు మినహా అన్ని సైనికేతర నేరాలకు క్యాపిటల్ పనిష్మెంట్ (మరణశిక్ష) రద్దు చేయబడిందని మేము కనుగొన్నాము (ఇక్కడ, ఇక్కడ).

తదుపరి మేము ఇదే విషయం గురించి మరింత సమాచారం కోసం బ్రెజిల్‌కు సంబంధించిన ఇంటర్నేషనల్ ఫ్యాక్ట్-చెకింగ్ నెట్‌వర్క్(IFCN)లో భాగస్వామైన ‘Aos Fatos  ఫాక్ట్-చెకింగ్ సంస్థను సంప్రదించగా, మోటారు సైకిళ్లపై వచ్చి దొంగతనాలకు పాల్పడే వ్యక్తులను చంపడాన్ని అనుమతించే చట్టం ఏది బ్రెజిల్‌లో లేదని, ఒక వ్యక్తిని చంపడం (హత్య) అనేది “చట్టబద్ధమైన ఆత్మరక్షణ”లో భాగంగా చేసినప్పుడు మాత్రమే బ్రెజిల్‌లో నేరంగా పరిగణించబడదని, ఈ విషయంపై 1984 నుంచి ఇదే చట్టం అమలులో ఉందని ‘Aos Fatos’ మేనేజింగ్ ఎడిటర్ లియోనార్డో కాజెస్ మాకు తెలిపారు. దీన్ని బట్టి బ్రెజిల్‌లో మోటారు సైకిళ్లపై వచ్చి దొంగతనాలకు పాల్పడే దుండగులను కారుతో ఢీకొట్టి చంపడానికి బ్రెజిల్ ప్రభుత్వం ఇటీవల అనుమతించలేదని, ఇలా చంపడాన్ని అనుమతించే చట్టం ఏది బ్రెజిల్‌లో లేదని మనం నిర్ధారించవచ్చు.

ఇకపోతే, ఈ వైరల్ వీడియోలో 5 వేర్వేరు సంఘటనలను చూపించే వీడియో క్లిప్‌లు ఉన్నాయి. ఈ 5 వీడియో క్లిప్‌లు కూడా బ్రెజిల్‌ రోడ్లపై జరిగిన పలు దోపిడీలకు సంబంధించిన దృశ్యాలను చూపుతున్నాయి.

వీడియో క్లిప్-1:

ఈ వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని రిపోర్ట్ చేస్తూ మార్చి 2022లో బ్రెజిలియన్ మీడియా సంస్థ ప్రచురించిన ఒక వార్తా కథనం (ఆర్కైవ్డ్ లింక్) మాకు లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ వీడియోలోని దృశ్యాలు బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలోని ఒసాస్కో మునిసిపాలిటీలోని బేలా విస్టాలోని అవెనిడా శాంటో ఆంటోనియోలో అవెన్యూలో ఇద్దరు దుండగులు దోపిడీకి పాల్పడుతుండగా ఒక వ్యక్తి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు దుండగులు తన కారుతో ఢీకొట్టిన సంఘటన చూపిస్తున్నాయి. ఈ ఘటన 11 మార్చి 2022న జరిగిందని ఈ కథనం పేర్కొంది. ఈ వీడియో బ్రెజిల్‌లోని సావో పాలో నగరంకు సంబంధించిదని పేర్కొంటూ మార్చి 2022లో పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). అలాగే మేము ఈ ఘటన జరిగిన అవెనిడా శాంటో ఆంటోనియోలో అవెన్యూ ప్రాంతాన్ని జియోలొకేట్ కూడా చేశాము.  

వీడియో క్లిప్-2:

ఈ వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని రిపోర్ట్ చేస్తూ నవంబర్ 2020లో బ్రెజిలియన్ మీడియా సంస్థ ప్రచురించిన ఒక వార్తా కథనం (ఆర్కైవ్డ్ లింక్) మాకు లభించింది. ఈ కథనం ప్రకారం, ఈ వీడియోలోని దృశ్యాలు బ్రెజిల్‌లోని జంగురుసు ప్రాంతంలోని ఫోర్టలేజాలో ఇద్దరు దుండగులు దోపిడీకి యత్నించాగా ఒక వ్యక్తి మోటార్‌సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరు దుండగులను తన కారుతో ఢీకొట్టిన సంఘటన చూపిస్తున్నాయి.

వీడియో క్లిప్-3:

ఈ వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని రిపోర్ట్ చేస్తూ జూలై 2021లో బ్రెజిలియన్ మీడియా సంస్థలు ప్రచురించిన పలు వార్త కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ) (ఆర్కైవ్డ్ లింక్). “ఈ ఘటన 01 జూలై 2021 తెల్లవారుజామున, బ్రెజిల్‌లోని సావో పాలో స్టేట్, డయాడెమా సిటీలో జరిగింది. ఒక బ్రెజిల్ సైనిక అధికారి ఉబెర్‌ను తీసుకొని, బ్రెజిల్‌లోని సావో పాలో స్టేట్, డయాడెమా సిటీ, నం. 317 ద్వారా వెళ్తుండగా ఇద్దరు దొంగలు మోటార్‌సైకిల్ పై వచ్చారు, అందులో ఒకరు కారు వద్దకు రాగా ఆ అధికారి తన తుపాకీతో ఆరుసార్లు కాల్చాడు. కాల్పులకు గల కారణాలపై డయాడెమా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కాల్పుల్లో ఒకరు మరణించారు” అని ఈ కథనాలు పేర్కొన్నాయి.

వీడియో క్లిప్-4:

ఈ వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని రిపోర్ట్ చేస్తూ అక్టోబర్  2021లో బ్రెజిలియన్ మీడియా సంస్థలు ప్రచురించిన పలు వార్త కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ) (ఆర్కైవ్డ్ లింక్). ఈ కథనాలు ప్రకారం, ఈ ఘటన 02 అక్టోబర్ 2021న బ్రెజిల్‌లోని సావో పాలో స్టేట్‌లోని క్యాంపోస్ నోవోస్ పాలిస్టాలో జరిగింది. ఈ ఘటన 2021న బ్రెజిల్‌లోని సావో పాలో స్టేట్‌లో జరిగింది అని పేర్కొన్న ఇతర వార్త కథనాలు మరియు సోషల్ మీడియా పోస్టులు ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.   

వీడియో క్లిప్-5:

ఈ వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని రిపోర్ట్ చేస్తూ ఫిబ్రవరి 2022లో బ్రెజిలియన్ మీడియా సంస్థలు ప్రచురించిన పలు వార్త కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) (ఆర్కైవ్డ్ లింక్). ఈ కథనాల ప్రకారం, ఈ ఘటన 12 ఫిబ్రవరి 2022న బ్రెజిల్‌లోని సావో పాలో స్టేట్‌లోని దక్షిణ జోన్ లో జరిగింది. ముగ్గురు యువకులు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ద్విచక్రవాహనంపై సాయుధులైన దుండగులు చోరీకి పాల్పడ్డారు, ఇది గమనించిన యువకుల మేనమామ కారుతో దొంగలను ఢీకొట్టాడు.

చివరగా, మోటారు సైకిళ్లపై వచ్చి దొంగతనాలకు పాల్పడే దుండగులను కారుతో ఢీకొట్టి చంపడానికి బ్రెజిల్ ప్రభుత్వం తమ పౌరులను అనుమతించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll