Fake News, Telugu
 

తమిళ సంగీతకారుడు అరివు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు అని తప్పుడు వార్తా కథనాలు ప్రచురించారు

0

సార్పట్ట పరంబరయ్ అనే తమిళ చిత్రంలోని ‘నీయే ఓలి ’ పాటకు సంగీతకారుడు అరువుకి ఆస్కార్ అవార్డు వచ్చిందని, ఈ పాట బెస్ట్ ఇన్స్పైరింగ్ సాంగ్ అఫ్ ది ఇయర్ అవార్డుకి కూడా ఎంపికైనట్టు చెప్తున్న సుమన్ టివీ వారి వార్తా కథనం ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదే కథనాన్ని మైక్ టివీ వారు కూడా ప్రచురించారు. ఈ వార్తలో నిజమెంతో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

క్లెయిమ్: తమిళ సంగీతకారుడు అరివు, సార్పట్ట పరంబరయ్ చిత్రంలోని ‘నీయే ఓలి‘ పాటకు ఆస్కార్ అవార్డు సాధించారు.

ఫాక్ట్ (నిజం): 2021లో విడుదలైన సార్పట్ట పరంబరయ్ చిత్రంలో ఉన్న ‘ నీయే ఓలి’ పాట కంపోజ్ చేసింది సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్, అరివు కాదు. ఈ పాటకి ఆస్కార్ అవార్డు రాలేదు. అసలు ఆస్కార్ అవార్డులలో బెస్ట్ ఇన్స్పిరేషనల్ సాంగ్ అనే విభాగమే ఉండదు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చెప్తున్న వార్తలో ఎంత నిజం ఉంది అని కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, సార్పట్ట పరంబరయ్ చిత్రంలోని ‘నీయే ఓలి ’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందని ఎటువంటి వార్త కథనాలు లభించలేదు. ఒక భారతీయ చిత్రంలోని పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిందనే వార్త నిజమైతే, ప్రముఖ మీడియా పత్రికల్లో, ఛానెళ్లలో  తప్పకుండా అది ప్రచురితమౌతుంది.

మార్చ్ 2022లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వారు ఇచ్చిన ఆస్కార్ అవార్డ్స్ లిస్ట్ లో  ‘నీయే ఓలి ’ పాట లేదు. ఆ లిస్టుని ఇక్కడ చూడవచ్చు. ఆస్కార్ అవార్డ్స్ లో సంగీతానికి సంబంధించి ఒరిజినల్ స్కోర్ మరియు ఒరిజినల్ సాంగ్ అనే రెండు విభాగాలలో అవార్డుని ఇస్తారు, కానీ పోస్టులో చెవుతున్నట్లుగా బెస్ట్ ఇన్స్పిరేషనల్ సాంగ్ అనే విభాగం ఉండదు.  2022లో ‘నో టైం టు డై’ అనే చిత్రంలోని ‘నో టైం టు డై’ పాటకి బిల్లీ ఎలిష్ మరియు ఫిన్నియాస్ ఓ’కానెల్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ అవార్డు పొందారు. వచ్చే సంవత్సరం, అంటే 2023 మార్చిలో 95వ ఆస్కార్ అవార్డులు ప్రధానోత్సవం జరగనుంది. దీనికి ఎంపికైన నామినిల జాబితాని జనవరి 2023లో విడుదల చేస్తారు.

పోస్టులో చేతున్నట్లుగా నీయే ఓలి పాటను కంపోజ్ చేసింది అరివు కాదు, సంతోష్ నారాయణన్, అరివు లిరిక్స్ మాత్రమే రాసారు. మార్చ్ 2022లో ఈ పాట జూనోస్ అవార్డుకు నామినేట్ అయ్యింది, ఈ విషయాన్నీ సంతోష్ తన ట్వీట్ ద్వారా తెలియ చేసారు.

చివరగా, సార్పట్ట పరంబరయ్ చిత్రంలోని ‘నీయే ఓలి ’ పాటకు సంగీతకారుడు అరువుకి ఆస్కార్ అవార్డు వచ్చిందని తప్పుడు కథనాలు ప్రచురించారు.

Share.

About Author

Comments are closed.

scroll