Fake News, Telugu
 

కర్ణాటకలో జరిగిన సిద్ధేశ్వర స్వామి అంతిమ యాత్ర దృశ్యాలను చంద్రబాబు కుప్పం పర్యటన దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు

0

ఇటీవల కందుకూరు, గుంటూరులో జరిగిన తొక్కిసలాటలలో ప్రజలు చనిపోయిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 02 జనవరి 2023న రాష్ట్రంలో పబ్లిక్ మీటింగులు, ర్యాలీలు, రోడ్డు షోలపై నిషేధం విధిస్తూ G.O.No.1 జారీ చేసింది. ఈ ఆదేశాలను పాటించాలని చెప్తూ పోలీసులు 04 జనవరి 2023న చంద్రబాబు కుప్పం రోడ్డు షోను అడ్డుకున్నారు. అయితే ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు వేసినా కూడా కుప్పంలో చంద్రబాబుతో రోడ్లు జన సముద్రంగా మారాయంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

ఇదే పోస్టుని ఇక్కడ కూడా చూడవచ్చు

క్లెయిమ్: 04 జనవరి 2023న చంద్రబాబు కుప్పం పర్యటనలో జనం భారీగా పాల్గొన్న దృశ్యాలు.

ఫాక్ట్: ఈ వీడియోలోని దృశ్యాలు కర్ణాటకలోని విజయపుర (బీజాపూర్)కు చెందిన సిద్ధేశ్వర స్వామి అంతిమ యాత్రకు సంబంధించినవి. 02 జనవరి 2023న ఆయన మరణించగా జనవరి 03న అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా ప్రజలు వచ్చారు. పైగా, చంద్రబాబు కుప్పం నియోజకవర్గ పర్యటన 04 జనవరి 2023 నుంచి మొదలయ్యింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇదే వీడియోని 04 జనవరి 2023, ఉదయం 8.11కి ట్విట్టర్ లో ఒక యూజర్ పోస్టు చేసినట్లు గుర్తించాము . అయితే, ఈ దృశ్యాలు విజయపుర సిద్ధేశ్వర స్వామి అంతిమ యాత్రకు వచ్చిన జనాలకు సంబంధించినవిగా పోస్టులో చెప్పారు.

వార్తా కథనాల ప్రకారం, కర్ణాటకకు చెందిన 82 ఏళ్ల సిద్ధేశ్వర స్వామి 02 జనవరి 2023 సాయంత్రం మరణించారు. జనవరి 03న ఆయన అంతిమ యాత్రను నిర్వహించి విజయపురలోని జ్ఞానయోగాశ్రమంలో దహనం చేశారు. ఈ కార్యక్రమానికి  వివిధ రాష్ట్రాల నుంచి వేలాదిగా జనం తరలి వచ్చారు. ఇక, ఈ అంతిమ యాత్రకు సంబంధించిన వీడియోలను పరిశీలించగా, “Public TV” అనే కన్నడ న్యూస్ ఛానెల్లో 03 జనవరి 2023 న అప్‌లోడు చేసిన వీడియోలో కూడా వైరల్ వీడియోలో కనిపించే “Roopa Devi CBSE school & Residential PU college, Vijayapura” అనే హోర్డింగ్ ను చూడవచ్చు. ఈ రూపా దేవి విద్యాసంస్థలు కర్ణాటకలోని విజయపుర లో ఉన్నాయి. ఈ అంతిమ యాత్రకు సంబంధించిన మరిన్ని వీడియోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇక జనవరి 04న కుప్పం నియోజకవర్గంలో చంద్ర బాబు పర్యటనలో పాల్గొన్న ప్రజల దృశ్యాలను ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, కర్ణాటకలోని విజయపురాలో సిద్ధేశ్వర స్వామి అంతిమ యాత్ర వీడియోని కుప్పంలో చంద్ర బాబు పర్యటనకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll