“తెలంగాణలోని హైదరాబాద్‌లో హిందూ ఇళ్లపై ముస్లింలు దాడి చేశారు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో, కొంతమంది వ్యక్తులు ఒక భవనంపై అంతస్తుకు ఎక్కడం, కొంతమంది ఆ భవనం గేట్లను ధ్వంసం చేయడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: తెలంగాణలోని హైదరాబాద్‌లో హిందూ ఇళ్లపై ముస్లింలు దాడి చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో పాకిస్తాన్‌కు చెందినది. 2022 ఆగస్టులో పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లోని హైదరాబాద్‌లో ఇస్లాం పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను అపవిత్రం చేశాడనే ఆరోపణలతో అశోక్ కుమార్ అనే హిందూ పారిశుధ్య కార్మికుడిపై జరిగిన మూక దాడిని ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. అలాగే ఇటీవల అంటే ఫిబ్రవరి/మార్చ్ 2025లో తెలంగాణలోని హైదరాబాద్‌లో ముస్లింలు హిందూ ఇళ్లపై దాడి చేసినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/వార్తాకథనాలు లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ ఆగస్ట్ 2022లో ప్రచురించబడిన పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 21ఆగస్టు 2022న, పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో ఇస్లాం మతం యొక్క పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను అపవిత్రం చేశారనే ఆరోపణలపై అశోక్ కుమార్ అనే హిందూ పారిశుధ్య కార్మికుడుపై పాకిస్థాన్ సింధ్ పోలీసులు 295B కింద దైవదూషణ (Blasphemy) కేసు నమోదు చేశారు, ఈ విషయం తెలుసుకున్న కొందరు హిందూ పారిశుధ్య కార్మికుడిని ఇంటి పై దాడి చేశారు.

22 ఆగస్టు 2022న ప్రచురింపబడిన ‘ది ఎకనామిక్ టైమ్స్’ కథనం ప్రకారం, అశోక్ కుమార్ పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లోని సద్దార్‌లోని రాబియా సెంటర్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు, ఒక స్థానిక దుకాణదారుడితో అశోక్ కుమార్‌కు గొడవ జరిగిన తరువాత సదరు దుకాణదారుడి అశోక్ కుమార్ ఖురాన్‌ను అపవిత్రం చేశాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు, ఈ విషయం తెలుసుకున్న కొందరు హిందూ పారిశుధ్య కార్మికుడిని ఇంటి పై దాడి చేశారు. విషయం తెలుసుకున్న సింధ్ పోలీసులు అక్కడికి చేరుకుని, అల్లరి మూకలను చెదరగొట్టి, అశోక్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇస్లామిక్ పుస్తకాన్ని (ఖురాన్‌ను) తగలబెట్టింది ఒక ముస్లిం మహిళ అని స్థానిక మీడియా తెలిపింది అని ఈ కథనం పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించి పాకిస్థాన్ సింధ్ పోలీసులు నమోదు చేసిన FIR కాపీని ఒకరు ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు (ఇక్కడ).

అలాగే ఇటీవల అంటే ఫిబ్రవరి/మార్చ్ 2025లో తెలంగాణలోని హైదరాబాద్‌లో ముస్లింలు హిందూ ఇళ్లపై దాడి చేసినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్ట్స్/వార్తాకథనాలు లేవు.
చివరగా, 2022లో పాకిస్తాన్‌లోని హైదరాబాద్‌లో ఒక హిందూపై జరిగిన మూక దాడి దృశ్యాలను షేర్ చేస్తూ తెలంగాణలోని హైదరాబాద్‌లో హిందూ ఇళ్లపై ముస్లింలు దాడి చేసినట్లుగా తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు.