Fake News, Telugu
 

నరేంద్ర మోదీ తన భోజనానికి, దుస్తులకు అయ్యే ఖర్చులను స్వయంగా భరిస్తారని కేంద్ర ప్రభుత్వం RTI సమాధానంలో స్పష్టం చేసింది

0

ప్రధాని నరేంద్ర మోదీ ఒక రోజు ఖర్చు వివరాలని తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. నరేంద్ర మోదీ రోజూ తైవాన్ నుండి దిగుమతి చేసుకున్న పుట్టగొడుగులను తింటారని,  ఈ తైవాన్ పుట్టగొడుగులు ఒక్కటి 80,000 రూపాయలు ధర ఉంటుందని ఈ వీడియోలో తెలుపుతున్నారు. ప్రధాని మోదీ ధరించే దుస్తుల ఖరీదు 10 లక్షలు ఉంటుందని, తన ఆరోగ్య చికిత్స కోసం మోదీ రోజుకి ఒకటిన్నర లక్షలు ఖర్చు పెడతారని వీడియోలో తెలుపుతున్నారు. అంతేకాదు, ప్రధాని భద్రత కోసం ఎస్పీజీ అలర్ట్ ఫోర్సుకు రోజు కోటి అరవై రెండు లక్షలు ఖర్చు అవుతుందని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: నరేంద్ర మోదీ ఒక రోజు ఖర్చు వివరాలని తెలుపుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ప్రధాని నరేంద్ర మోదీ తన భోజనానికి మరియు దుస్తులకు అయ్యే ఖర్చులను తానే స్వయంగా భరిస్తారని RTI ద్వారా అడిగిన కొన్ని ప్రశ్నలకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చించి. అంటే, నరేంద్ర మోదీ స్వయంగా ఆ ఖర్చులను బహిర్గతం చేస్తే తప్ప మనకు ఆ వివరాలు లభించే అవకాశం లేదు. నరేంద్ర మోదీ తన భోజనం, దుస్తుల ఖర్చులను బహిర్గతం చేసినట్టు మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. అలాగే, నరేంద్ర మోదీ మూడు నెలలకొకసారి ఆరోగ్య చికిత్స చేపించుకుంటారని పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.   

నరేంద్ర మోదీ తైవాన్ నుండి దిగుమతి చేసుకున్న పుట్ట గొడుగులను తింటారా?

నరేంద్ర మోదీ తైవాన్ పుట్టగొడుగులను తింటారని 2017 గుజరాత్ ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి అల్పేష్ ఠాకూర్ మొట్టమొదట ఒక బహిరంగ సభలో ఆరోపణలు చేసారు. ప్రధాని మోదీ తైవాన్ నుండి దిగుమతి చేసుకున్న పుట్టగొడుగులను రోజుకి అయిదు తింటారని, ఈ తైవాన్ పుట్టగోడుగు ఒక్కొక్కటి 80,000 రూపాయిల ధర పలుకుతుందని అల్పేష్ ఠాకూర్ ఆ సభలో ఆరోపించారు. నరేంద్ర మోదీ ఇదివరకు తనలా నల్లగా ఉండేవారని, తైవాన్ పుట్టగొడుగులు తిన్న తరువాత మంచి రంగుకోచ్చారని అల్పేష్ ఠాకూర్ అప్పుడు పేర్కొన్నారు.

అయితే, అల్పేష్ ఠాకూర్ చేసిన ఈ ఆరోపణలను బలపరుస్తూ ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో, ఈ ఆరోపణలు కేవలం ఉహాగానాలుగా మాత్రమే పరిగణించబడుతున్నాయి. PMINDIA వెబ్సైటులో ప్రధానమంత్రి భోజన ఖర్చులకి సంబంధించి RTI ద్వారా అడిగిన ప్రశ్నలకి కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇస్తూ, ‘ప్రధానమంత్రి వంటగది ఖర్చులు అనేవి ఆయన వ్యక్తిగత ఖర్చులు. ఈ ఖర్చులు ప్రభుత్వ అకౌంట్ నుండి ఖర్చు చేయరు’, అని స్పష్టం చేసింది.

ప్రధాని మోదీ ధరించే దుస్తుల ధర 10 లక్షలు ఉంటుందా?

ప్రధానమంత్రి తన దుస్తులకు అయ్యే ఖర్చులు తానే స్వయంగా భరిస్తారని RTI ద్వారా అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానమిచ్చినట్టు 2018లో పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. అంటే, నరేంద్ర మోదీ స్వయంగా తన భోజనం, దుస్తుల ఖర్చులను బహిర్గతం చేస్తే తప్ప మనకు ఆ వివరాలు లభించే అవకాశం లేదు. నరేంద్ర మోదీ తన భోజనం మరియు దుస్తులకు అయ్యే ఖర్చులను బహిర్గతం చేసినట్టు మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు.

నరేంద్ర మోదీ వస్త్రాలంకరణ మరియు దుస్తుల ఎంపికకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎదో ఒక ఆరోపణ  వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. నరేంద్ర మోదీ ధరించే దుస్తులు రెండు లక్షలకు పైగా ధర ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ ఒక సందర్భంలో ఆరోపించారు.

2016లో నరేంద్ర మోదీ ధరించిన ఒక సూటు ప్రపంచంలోనే వేలం వేయబడిన అత్యంత ఖరీదైనదిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకుంది. ‘నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ’ పేరు ముద్రించిన ఈ ప్రత్యేకమైన సూట్ వస్త్రాన్ని సూరత్ నగరానికి చెందిన ఒక వ్యక్తి 4.3 కోట్లకు కొనుగోలు చేసాడు. అహ్మదాబాద్ నగరానికి చెందిన ఒక గార్మెంట్స్ చైన్ కంపెనీ దీన్ని 10 లక్షల రూపాయల వ్యయంతో తయారు చేసినట్టు తెలిసింది.

నరేంద్ర మోదీ ప్రతి రోజు సంపూర్ణ బాడి చెకప్ చేయించుకుంటారా?

నరేంద్ర మోదీ ప్రతి రోజు వైద్య పరిక్షలు చేసుకుంటారని తెలుపుతూ ఇంటర్నెట్లో ఏ ఒక్క వార్త సంస్థ రిపోర్ట్ చేయలేదు. 2014లో పబ్లిష్ అయిన ఒక ఆర్టికల్‌లో నరేంద్ర మోదీ ప్రతి మూడు నెలలకొకసారి వైద్య పరిక్షలు చేసుకుంటారని రిపోర్ట్ చేసింది.

ఇదివరకు, RTI సమాచారం ప్రకారం ఏడేళ్ల బీజేపీ పరిపాలన కాలంలో నరేంద్ర మోదీ భోజన ఖర్చు 100 కోట్లు దాటిందని సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు, ఫ్యాక్ట్‌లీ దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.  

చివరగా, నరేంద్ర మోదీ తన భోజనానికి మరియు దుస్తులకు అయ్యే ఖర్చులను స్వయంగా భరిస్తారని కేంద్ర ప్రభుత్వం RTI సమాధానాలలో స్పష్టం చేసింది.

Share.

About Author

Comments are closed.

scroll