“సీరియల్ నంబర్ ప్యానెల్‌లో ‘స్టార్(*)’ గుర్తు ఉన్న రూ.500 నోట్లు దొంగ నోట్లని, అవి చట్టబద్ధం కావని, చెల్లుబాటు కావని” చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: సీరియల్ నంబర్ ప్యానెల్‌లో ‘స్టార్(*)’ గుర్తు ఉన్న రూ.500 నోట్లు నకిలీవి మరియు చెల్లవు.
ఫాక్ట్(నిజం): సీరియల్ నంబర్ ప్యానెల్‌లో ‘స్టార్(*)’ గుర్తు ఉన్న రూ.500 నోట్లు చట్టబద్ధమైనవని, ఇతర కరెన్సీ నోట్లతో సమానంగా చెల్లుబాటు అవుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేస్తూ 27 జూలై 2023న పత్రికా ప్రకటన విడుదల చేసింది. రూ. 500 డినామినేషన్‌లో ‘స్టార్’ కలిగి ఉన్న నోట్లను తొలిసారిగా 2016లో RBI విడుదల చేసింది. అలాగే ₹ 10, 20, 50, 100 డినామినేషన్‌లో ‘స్టార్’ గుర్తు కలిగి ఉన్న నోట్లు 2006 నుండే చెలామణిలో ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ పోస్టులో చెప్పినట్లుగా, సీరియల్ నంబర్ ప్యానెల్‌లో ‘స్టార్(*)’ గుర్తు ఉన్నరూ.500 నోట్లు నకిలీవా? అని తెలుసుకోవడానికి మేము తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, 07 డిసెంబర్ 2023న ఈ వైరల్ పోస్టులు ఫేక్ అని, ఇందులో ఎలాంటి నిజం లేదని, ఈ ‘స్టార్(*)’ గుర్తు ఉన్నరూ.500 నోట్లను RBI జారీ చేసింది అని, ఈ నోట్లు 2016 నుండి చలామణిలో ఉన్నాయని స్పష్టం చేస్తూ భారత ప్రభుత్వానికి చెందిన ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’(PIB) సంస్థ తమ అధికారిక ఫాక్ట్-చెకింగ్ X(ట్విట్టర్)లో చేసిన ఒక పోస్టును కనుగొన్నాము. ఈ పోస్ట్‌లో, 2016లో సీరియల్ నంబర్ ప్యానెల్‌లో ‘స్టార్(*)’ గుర్తు ఉన్న రూ.500 నోట్లను జారీ చేయడానికి సంబంధించి RBI పత్రికా ప్రకటనకు సంబంధించిన లింక్‌ను కూడా PIB షేర్ చేసింది.
జూలై 2016లో RBI విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, “కొన్ని బ్యాంక్ నోట్లలో నంబర్ ప్యానెల్‌లోని ప్రిఫిక్స్ మరియు నంబర్ల మధ్య ఉన్న ఖాళీలో అదనపు అక్షరం ‘*’ (స్టార్) ఉంటుంది. ₹ 500 డినామినేషన్‌లో నంబర్ ప్యానెల్‌లో ‘స్టార్’ గుర్తు కలిగి ఉన్న నోట్లను తొలిసారిగా విడుదల చేస్తున్నామని. ₹ 10, 20, 50, 100 విలువ కలిగిన ‘స్టార్’ గుర్తు కలిగి ఉన్న నోట్లు ఇప్పటికే చెలామణిలో ఉన్నాయి.” అని పేర్కొంది. ఈ పత్రిక ప్రకటనలలో ‘స్టార్ (*)’ గుర్తు కలిగి ఉన్న నోట్లుకు సంబంధించి 2006లో విడుదల చేసిన పత్రిక ప్రకటన లింక్‌ను RBI షేర్ చేసింది.
RBI ఏప్రిల్ 2006లో విడుదల చేసిన పత్రిక ప్రకటన ప్రకారం, రిజర్వ్ బ్యాంకు కరెన్సీ నోట్లను ప్రింట్ చేసేటప్పుడు కొన్ని రకాల లోపాలు వచ్చిన నోట్లను అదే నంబర్ తో రీప్లేస్మెంట్ చేస్తుంది. అలాంటి సందర్భాల్లో ఇలా స్టార్(*) మార్క్ ని పెడతారు (ఇక్కడ). అంటే లోపం ఉన్న నోటు అదే నంబర్ తో మార్చినది అని దాని అర్ధం. రూ. 10, 20, 50, 100 విలువ కలిగిన ‘స్టార్’ నోట్లును RBI 2006లో విడుదల చేసిందని తెలుస్తుంది.
అలాగే ఇలాంటి పోస్టులే 2023లో వైరల్ కాగా, వాటి పై స్పందిస్తూ 27 జూలై 2023న RBI చేసిన పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో “కరెన్సీ నోట్లను ప్రింట్ చేసేటప్పుడు లోపాలు వచ్చిన నోట్లను అదే నంబర్ కలిగిన మరో నోటుతో రీప్లేస్మెంట్ చేయడాన్ని స్టార్(*) గుర్తు కలిగిన నోట్లు సూచిస్తుందని, స్టార్(*) గుర్తుతో ఉన్న నోటు ఇతర చట్టబద్ధమైన కరెన్సీ నోట్లతో సమానంగా చెల్లుబాటు అవుతాయని” స్పష్టం చేసింది.
చివరగా, నంబర్ ప్యానెల్‌లో ‘స్టార్(*)’ గుర్తు ఉన్న రూ.500 నోట్లు చట్టబద్ధమైనవని మరియు ఇతర నోట్లతో సమానంగా చెల్లుబాటు అవుతాయి. ఇదే విషయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా స్పష్టం చేసింది.